వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వెదురు రంగం అభివృద్ధి కోసం సలహా మండలి ఏర్పాటు

Posted On: 05 DEC 2022 8:20PM by PIB Hyderabad

వెదురు రంగం అభివృద్ధి కోసం సలహా మండలి ఏర్పాటు చేయడానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఆమోదం తెలిపారు. క్రమ పద్ధతిలో వెదురు రంగాన్ని అభివృద్ధి చేయడానికి సలహా మండలి కృషి చేస్తుంది. వెదురు రంగంతో సంబంధం ఉన్న వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు సలహా మండలి సభ్యులుగా ఉంటారు. విద్యావేత్తలు, పరిశోధకులు, ఆవిష్కర్తలు,ప్రగతిశీల వ్యాపారవేత్తలు, డిజైనర్లు, రైతు నాయకులు, మార్కెటింగ్ నిపుణులు, విధాన నిర్ణేతలు వంటి వారికి మండలిలో  ప్రాతినిధ్యం ఉంటుంది. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన వారితో సంప్రదింపులు జరిపి వెదురు రంగం అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించడం జరిగింది. వెదురుకు విలువ ఆధారిత వ్యవస్థను పటిష్టం చేయడానికి వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను సమన్వయం చేసి అన్ని వర్గాల సహకారంతో వెదురు రంగం అభివృద్ధికి సలహా మండలి పనిచేస్తుంది. 

 పునర్వ్యవస్థీకరించబడిన నేషనల్ బాంబూ మిషన్ (NBM) 2018-19లో కేంద్ర ప్రాయోజిత పథకంగా ప్రారంభించబడింది. వెదురు పెంపకందారులు, వెదురు వినియోగదారుల మధ్య అనుసంధానం సాధించడం ద్వారా వెదురు రంగం అభివృద్ధికి కృషి జరుగుతుంది. వెదురు పెంపకం, వెదురు సేకరణ, వేరు చేయడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి,  బ్రాండింగ్ లాంటి రంగాల్లో పెంపకందారులు, వినియోదారుల మధ్య సమన్వయం సాధించడానికి కృషి జరుగుతుంది. విధాన నిర్ణయాలు, సౌకర్యాల కల్పన, అవగాహన కార్యక్రమాల వల్ల వెదురు రంగం ఆదాయ ఆర్జన రంగంగా అభివృద్ధి చెందింది. ఇటీవల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన బెంగళూరు (కెంపగౌడ) విమానాశ్రయం నిర్మాణంలో వెదురును ఉపయోగించారు. దీని ద్వారా వెదురు నిర్మాణ సామాగ్రిగా మాత్రమే కాకుండా కళాత్మక వస్తువుగా కూడా ఉపయోగపడుతుందని వెల్లడయింది.  'గ్రీన్ స్టీల్' గా వెదురు గుర్తింపు పొందింది.  నిర్మాణ రంగంలో డిజైన్ మరియు నిర్మాణ మూలకంగా ఉపయోగించడమే కాకుండా వెదురు వివిధ రకాలుగా ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది.  పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో  వెదురుతో చేసిన ఉత్పత్తులు ఉపయోగించవచ్చు. వేగంగా పెరిగే గుణం కలిగి ఎక్కువగా లభించే వెదురు ఇథనాల్ మరియు బయో-ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థంగా కూడా ఉపయోగపడుతుంది. వెదురు ఆధారిత జీవనశైలి ఉత్పత్తులు, కత్తిపీటలు, గృహాలంకరణ, హస్తకళలు మరియు సౌందర్య సాధనాల మార్కెట్ కూడా వృద్ధి బాటలో ఉంది.  అభివృద్ధి చెందుతున్న వెదురు రంగం ద్వారా లభించే  ప్రయోజనాలను దేశంలో రైతులు మరియు మానవ వనరుల అభివృద్ధికి అందించాలని  జాతీయ వెదురు మిషన్ కృషి చేస్తోంది.

వెదురు రంగంలో చురుగ్గా పని చేస్తున్న నిపుణులు, ఇతర సంబంధిత  దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాలు,  వెదురు రంగంలో వాటాదారుల మధ్య  సమన్వయం సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు సూచిస్తారు.  వెదురు సలహా మండలికి  కేంద్ర వ్యవసాయ కార్యదర్శి చైర్‌పర్సన్‌గా, నేషనల్ బాంబూ మిషన్ మిషన్ డైరెక్టర్ కన్వీనర్‌గా ఉంటారు.   ప్రచారం, వెదురు , అంతర పంటల పెంపకం, ప్రాథమిక ప్రాసెసింగ్, ఉత్పత్తి అభివృద్ధి, విలువ జోడింపు, మార్కెట్ మౌలిక సదుపాయాలు మరియు అనుసంధానం , ప్రాసెసింగ్ మెషినరీలు, స్కిల్ డెవలప్‌మెంట్ మొదలైన వాటిలో సమస్యలు మరియు సాంకేతికత అంశాలపై  వ్యవసాయం , రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు కమిటీ సభ్యులు సలహా ఇస్తారు.

***



(Release ID: 1881176) Visitor Counter : 125


Read this release in: English , Urdu , Hindi , Tamil