భారత పోటీ ప్రోత్సాహక సంఘం

5వ దఫా 'యూరోపియన్ యూనియన్-ఇండియా కాంపిటీషన్ వీక్' 2022 ప్రారంభం

Posted On: 05 DEC 2022 4:00PM by PIB Hyderabad

5వ దఫా 'యూరోపియన్ యూనియన్-ఇండియా కాంపిటీషన్ వీక్' ఇవాళ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైంది. సీసీఐ తాత్కాలిక ఛైర్‌ పర్సన్ డా.సంగీత వర్మ, ఈయూ ప్రతినిధి బృందానికి భారత్‌ & భూటాన్‌లో ఉప అధిపతిగా ఉన్న మిస్టర్‌ సెప్పో నూర్మి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోటీ వారోత్సవాన్ని డిసెంబర్‌ 5-7 తేదీల్లో నిర్వహిస్తున్నారు.

సీసీఐ అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించే పోటీ వారోత్సవం ఔచిత్యాన్ని సీసీఐ ఛైర్‌ పర్సన్ ప్రశంసించారు. 2013 నవంబర్‌లో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం సీసీఐ- యూరోపియన్ కమిషన్‌కు చెందిన 'డైరెక్టరేట్ జనరల్ ఫర్‌ కాంపిటీషన్‌' మధ్య కొనసాగుతున్న సహకారాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ఈయూ, భారత్‌కు చెందిన అధికారులు, నిపుణుల మధ్య చర్చలకు, ఉత్తమ విధానాల మార్పిడికి ఈ సాంకేతికత సహకార కార్యక్రమం వేదికగా నిలుస్తుందని అన్నారు. అజెండాలోని అంశాలు ప్రస్తుత కాలానికి సరిపోయేవి, ప్రాముఖ్యత కలిగినవేగాక, భవిష్యత్తుకు సంబంధించినవి కూడా అని చెప్పారు.

వేగంగా మారుతున్న, అభివృద్ధి చెందుతున్న డిజిటలీకరణ కారణంగా పోటీ చట్టాన్ని అమలు చేసే అధికారులకు కొత్త సవాళ్లు ఎదురవుతుండడం, పోటీ నియంత్రణకు సంబంధించిన సాంప్రదాయ పరిమితులు ప్రశ్నార్ధకంగా నిలుస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే ఉన్న విధానాలను ఎలా వర్తింపజేయాలి, కొత్త వాటిని ఎలా రూపొందించాలన్న అంశాల మీద కొత్త వైఖరిని పోటీ నియంత్రణ సంస్థలు అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని డా.వర్మ ప్రస్తావించారు.

డిజిటల్ నిబంధనలను రూపొందించడంలో, అమలు చేయడంలో ఈయూ నిపుణులు ప్రస్తావించిన అభిప్రాయాలు ఆకర్షణీయమైన చర్చలకు దారి తీస్తాయని డా.వర్మ అన్నారు.

ఈయూ ప్రతినిధి బృందం ఉప అధిపతి మిస్టర్‌ నూర్మి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. 1960ల ప్రారంభంలో ఉన్న భారత్‌-ఈయూ సంబంధాలను ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత భారత్‌-ఈయూ పోటీ వారోత్సవం అజెండాలో ఉన్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ/మార్కెట్లకు యాంటీట్రస్ట్ చట్టాలను వర్తింపజేయడంలో అనుభవాలు, ఈయూ డిజిటల్ మార్కెట్ల చట్టం, పరిశోధన 'హబ్‌-అండ్‌-స్పోక్‌' ఒప్పందాలు, పోటీ చట్టం & స్థిరమైన సహకారం వంటి అంశాల మీద ఈయూ నిపుణుల అభిప్రాయాలను తీసుకోవడం సమయానుకూలంగా ఉంటుందని చెప్పారు. డిజిటల్, సాంకేతికత మార్కెట్లలో యాంటీట్రస్ట్ చట్టం అమలుకు సంబంధించిన సవాళ్లకు సమాధానాలను కనుగొనేందుకు తాము ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, రెండు కీలక ఆర్థిక వ్యవస్థల నుంచి అభిప్రాయాలను పంచుకోవడానికి ఒక వేదికను 5వ దఫా 'ఇండియా-ఈయూ కాంపిటీషన్ వీక్' అందిస్తుందని, డిజిటల్‌ మార్కెట్‌ చట్టం అమలులో నియంత్రణ సంస్థలు ఎలా వ్యవహరించాలన్న విషయం మీద చర్చించడానికి అవకాశాన్ని అందిస్తుందని అన్నారు.

పోటీ చట్టం వారోత్సవం సందర్భంగా ఈయూ ప్రతినిధి బృందం ఉప అధిపతి, సీసీఐ చైర్‌ పర్సన్‌, కార్యదర్శి సెక్రటరీ, ఇతర అధికారుల మధ్య ఒక చిన్న సమావేశం కూడా జరిగింది.

 

****



(Release ID: 1881048) Visitor Counter : 135


Read this release in: Marathi , English , Hindi , Urdu