పర్యటక మంత్రిత్వ శాఖ
పర్యాటక అవగాహన కార్యక్రమం కింద టాక్సీ/క్యాబ్/కోచ్ డ్రైవర్లకు నైపుణ్య శిక్షణ ధ్రువీకరణ పత్రాలు అందజేసిన శ్రీ జి.కిషన్ రెడ్డి
జి20 శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ శిక్షణ కార్యక్రమం భారత
పర్యాటక అభివృద్ధిలో ఒక మైలురాయి కానుంది: శ్రీ జి.కిషన్ రెడ్డి
దేశంలోని పర్యాటక ప్రదేశాల ప్రచారంలో టాక్సీ/క్యాబ్
డ్రైవర్లు మన బ్రాండ్ అంబాసిడర్లు: కేంద్ర పర్యాటక మంత్రి
Posted On:
30 NOV 2022 7:12PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు:
మొత్తం 229 మంది అభ్యర్థులు శిక్షణ పొందగా, వీరిలో 165 మంది పురుషులు, 134 మంది మహిళలు లబ్ధిదారులుగా ఉన్నారు.
ఈ అభ్యర్థులకు మానవ సంబంధాల్లో, ప్రవర్తనపరమైన నైపుణ్య శిక్షణతోపాటు వ్యక్తిగత-పని ప్రదేశ పరిశుభ్రత, ఢిల్లీలో పర్యాటక ప్రాధాన్య స్థలాలు, ప్రథమ చికిత్స, కోవిడ్ విధివిధానాలు, విదేశీ భాషలు వగైరాలపై ఆలోచనాత్మక, ఆచరణాత్మకంగా లోతైన అవగాహన కల్పించబడింది.
“భారతదేశం 2022 డిసెంబరు 1వ తేదీనుంచి ఏడాదిపాటు జి20 కూటమికి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచంలోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలుగల దేశాలు పాల్గొనబోతున్నాయి. దీనికిముందు 55 వేర్వేరు ప్రదేశాల్లో 200కుపైగా సభలు నిర్వహించబడతాయి. ఈ నేపథ్యంలో భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తితో చూస్తున్నాయి. ఆయా దేశాల ప్రతినిధులు మన దేశానికి కేవలం పర్యటన కోసం వస్తున్నవారు కాదు... భారత్‌పై ప్రభావం కూడా చూపగలరు. అందువల్ల జి20 శిఖరాగ్ర సమావేశానికి ముందు చేపట్టిన ఈ శిక్షణ కార్యక్రమం భారత పర్యాటక రంగం ప్రగతిలో ఒక మైలురాయి కానుందని నేను భావిస్తున్నాను” కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి అన్నారు. పర్యాటక అవగాహన కార్యక్రమం కింద నైపుణ్య శిక్షణ పొందిన టాక్సీ/క్యాబ్/కోచ్ డ్రైవర్లకు న్యూఢిల్లీలో ఇవాళ ధ్రువీకరణ పత్రాల ప్రదానం సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రసంగించారు.
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలో సేవా ప్రదాతలకు సామర్థ్యం పెంపు కార్యక్రమం కింద ‘ఐటీడీసీ’ మానవ వనరుల విభాగం ఆధ్వర్యంలోని ‘అశోక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ (ఏఐహెచ్ అండ్ టీఎం) తమ అవగాహన కల్పన కార్యక్రమం (ఇది పూర్తిగా మంత్రిత్వశాఖ ప్రాయోజితం)లో భాగంగా టాక్సీ/క్యాబ్/కోచ్ డ్రైవర్లకు ఈ శిక్షణ ఇచ్చింది. ఈ మేరకు (ఫ్రెంచి, జర్మన్, అరబిక్ వంటి) ఒక ప్రాథమిక విదేశీ భాష సహితంగా ప్రవర్తన, మానవ సంబంధాల నైపుణ్యాలపై వారికి అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో ఐటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జి.కమల వర్ధనరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ధ్రువీకరణ పత్రాల ప్రదానం సందర్భంగా శ్రీ జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ- ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించిన ‘ఏఐహెచ్ అండ్ టీఎం’ విభాగాన్ని ప్రశంసించారు. భారత పర్యాటక రంగాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడమే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యమని శ్రీ రెడ్డి గుర్తుచేశారు. ఈ దిశగా మోదీ ప్రభుత్వం అనేక రకాల శిక్షణ కార్యక్రమాలుసహా పథకాలను కూడా అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. టాక్సీ/క్యాబ్ డ్రైవర్ల వృత్తిగత, వ్యక్తిగత నైపుణ్యాలకు పదును పెట్టడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన చెప్పారు. తద్వారా వారు దేశవిదేశీ పర్యాటకులతో మరింత సమర్థంగా సంభాషిస్తూ, మమేకం కాగలరని తెలిపారు. దేశంలోని పర్యాటక ప్రదేశాలకు ప్రచారం కల్పించడంలో మన టాక్సీ/క్యాబ్ డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు. అలాగే “అభ్యర్థులకు మానవ సంబంధాల్లో, ప్రవర్తనలో నైపుణ్యాలతోపాటు వ్యక్తిగత-పని ప్రదేశ పరిశుభ్రత, ఢిల్లీలో పర్యాటక ప్రాముఖ్యంగల ప్రదేశాలు, ప్రథమ చికిత్స, కోవిడ్ విధివిధానాల, విదేశీ భాషతో పరిచయం తదితరాలపై ఆలోచనాత్మకంగానే కాకుండా ఆచరణాత్మక పద్ధతుల్లో అవగాహన కల్పించినట్లు అధికారులు నాకు వివరించారు. అలాగే శిక్షణార్థులకు పర్యాటక పరిశ్రమలోని వాణిజ్య నిపుణులు తరగతులను నిర్వహించడంతోపాటు కరదీపిక రూపంలోనూ వారికి సమాచారం పంపిణీ చేశారు” అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 229 మంది అభ్యర్థులు శిక్షణ పొందగా, వీరిలో 165 మంది పురుషులు, 134 మంది మహిళలు లబ్ధిదారులుగా ఉన్నారని శ్రీ రెడ్డి తెలిపారు. శిక్షణ సమయంలో వీరికి రోజుకు రూ.300 వంతున తాత్కాలిక భృతి అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ‘ఐటీడీసీ’ చైర్మన్ డాక్టర్ సంబిత్ పాత్రా 18.06.2022న అశోకా హోటల్‌లో ప్రారంభించారని తెలిపారు. వివిధ పరిశ్రమల నిపుణులు, పేరుపొందిన టాక్సీ అసోసియేషన్లకు చెందిన 300 మంది వరకూ డ్రైవర్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారని వెల్లడించారు. ‘ఏఐహెచ్ అండ్ టీఎం’ శిక్షణార్థులను బృందాలుగా విభజించి ఐటీడీసీ ప్రాంగణంలోగల సామ్రాట్ హోటల్లో శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ఈ పథకం కింద శిక్షణ కోసం రాజధాని టాక్సీ అసోసియేషన్ తదితర సంస్థలు 299 మంది డ్రైవర్ల సమీకరణతోపాటు ఇతరత్రా సహాయసహకారాలు అందించినట్లు మంత్రి తెలిపారు.
****
(Release ID: 1880168)
Visitor Counter : 130