సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కొన్నిసార్లు జంతువులు మనుషుల్లా ప్రవర్తిస్తాయి, మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తారు: సినీ దర్శకుడు రోద్రిగో గెర్రెరో
ఇఫ్ఫి-53లో అంతర్జాతీయ పోటీ విభాగం కింద సియెతే పెర్రోస్ (ఏడు కుక్కలు) ప్రదర్శన
తన పెంపుడు కుక్కల విషయంలో అపార్ట్‌మెంట్ ఇరుగుపొరుగు వారితో ఇబ్బందులు పడ్డ ఒక వ్యక్తి గురించి వార్తాపత్రికలో వచ్చిన కథనం చదివిన చిత్ర దర్శకుడు రోద్రిగో గెర్రెరో, ఆ వార్తాకథనం స్ఫూర్తితో "సియెతే పెరోస్" (ఏడు కుక్కలు) సినిమా తీశారు. గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలో, ఇవాళ పీఐబీ నిర్వహించిన "టేబుల్ టాక్స్"కు ఆ దర్శకుడు హాజరయ్యారు. "కొన్నిసార్లు జంతువులు మనుషుల్లా, మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తారని" వ్యాఖ్యానించారు.
ఇఫ్ఫి “టేబుల్ టాక్స్”లో డైరెక్టర్ రోద్రిగో గెర్రెరో
ప్రస్తుత నగర వాతావరణంలో ఒంటరితనం, స్నేహం అంశాలను ఇతివృత్తాలుగా చేసుకుని చలనచిత్రాన్ని తీశారు. ఈ సినిమాలో మానవ సంబంధాలను ఒక కుక్కల బృందం ప్రేరేపిస్తుంది.
జంతువులతో చిత్రీకరణ వల్ల ఎదురయిన సవాళ్ల గురించి అడిగినప్పుడు, పెంపుడు జంతువులను నియంత్రించగలినంత వరకు వాటితో నటింపజేయడం సులభం అని దర్శకుడు చెప్పారు. ప్రధాన నటుడికి శునకాలు మచ్చిక కావడానికి చిత్రీకరణకు వారం ముందు నుంచే ఆయన వాటితో స్నేహం చేశారని వెల్లడించారు.
రోద్రిగో గెర్రెరో దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2021లో విడుదల అయింది. గోవాలో జరుగుతున్న 53వ ఇఫ్ఫి వేడుకల్లో ప్రదర్శితమైంది. అంతర్జాతీయ పోటీ విభాగంలో ప్రతిష్టాత్మకమైన 'గోల్డెన్ పీకాక్' పురస్కారానికి సిఫార్సు అందుకుంది. ఇది అర్జెంటీనా దర్శకుడి నాలుగో చిత్రం. కేవలం 80 నిమిషాలకు కొంచెం ఎక్కువ నిడివితో, మనిషి-అతని పెంపుడు జంతువుల మధ్య బంధాన్ని ఈ చిత్రం వివరించింది.
'సియెతే పెర్రోస్' చిత్రంలో ఒక దృశ్యం
53వ భారత అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ కోసం 15 సినిమాలు పోటీ పడతాయి.
చిత్ర బృందం:
దర్శకుడు: రోద్రిగో గెర్రెరో
నిర్మాత: రోద్రిగో గెర్రెరో
కథనం: పౌలా లూసీ
డీవోపీ: గుస్తావో తెజేదా
ఎడిటర్: : డెల్ఫినా కాస్టాగ్నినో, సువానా లెండా
తారాగణం: లూయిస్ మచిన్, మాక్సిమిలియానో బిని, నటాలియా డి సియెంజో, పౌలా లుస్సీ, ఎవా బియాంకో, పౌలా హెర్ట్‌జోగ్
కథ సారాంశం:
అర్జెంటీనాలోని కార్డోబా నగరంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో, ఎర్నెస్తో తన ఏడు కుక్కలతో కలిసి ఉంటాడు. అతను ఒంటరి. అతని దినచర్య మొత్తం పెంపుడు శునకాల అవసరాలు తీర్చడం, అతని ఆరోగ్య సమస్యలు, డబ్బు ఇబ్బందుల చుట్టూ తిరుగుతుంటుంది. ఆ శునకాలను అపార్ట్‌మెంట్ నుంచి బయటకు పంపమని అతని పొరుగువారు కోరతారు. తన కుక్కలు లేకుండా జీవించడానికి ఎర్నెస్తో ఇష్టపడడు, వేరే చోటికి వెళ్లేంత డబ్బు లేదు. ఆ పరిస్థితుల్లో అతను ఏం చేశాడన్నదే చిత్ర కథ.
దర్శకుడి గురించి:
నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ కార్డోబాలో 'ఫిల్మ్ అండ్ టెలివిజన్' కోర్సును రోద్రిగో గెర్రెరో (జననం 1982, కార్డోబా, అర్జెంటీనా) చదివారు. స్పెయిన్‌లోని లా రియోజాలో ఉన్న అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నుంచి 'ఆడియో-విజువల్ స్క్రీన్‌ప్లేస్'లో మాస్టర్ డిగ్రీ చేశారు. 'ఎల్ ఇన్వియెర్నో దే లాస్ రారోస్' చిత్రంతో (2011) అరంగేట్రం చేశారు. తర్వాత 'ఎల్ తెర్సెరో' (2014), 'వెనేజియా' (2019) చిత్రాలకు దర్శకత్వం వహించారు.
పూర్తి ముఖాముఖిని ఇక్కడ చూడండి:
(Release ID: 1878163)
Visitor Counter : 233