మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘కాశీ తమిళ సంగమం’ కార్యక్రమానికి హాజరై, ‘త్రివేణి సంగమం’లో పవిత్ర స్నానం చేసిన తమిళనాడు విద్యార్థులు


ప్రయాగ్‌రాజ్ నగరంలో, చుట్టుపక్కల ఉన్న వివిధ చారిత్రక ప్రాంతాలను సందర్శించిన విద్యార్థి బృందం

Posted On: 21 NOV 2022 4:28PM by PIB Hyderabad

తమిళనాడుకు చెందిన విద్యార్థుల బృందం ప్రయాగ్‌రాజ్ నగరాన్ని సందర్శించడంతో, ‘సంగం నగరి’లోని ‘కాశీ తమిళ సంగమం’ మార్మోగింది. 'సంగం ఘాట్' చేరుకున్న విద్యార్థుల బృందంలో ఉత్సాహం పరవళ్లు తొక్కింది. 'హర్‌హర్ మహాదేవ్', 'భారత్ మాతా కీ జై' నినాదాలు చేశారు. ప్రయాగ్‌రాజ్ స్థానికులు విద్యార్థి బృందానికి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు.

 

'త్రివేణి సంగమం' వద్ద పవిత్ర స్నానం చేసిన తర్వాత, విద్యార్థుల బృందం 'సంగం' ఒడ్డున ఉన్న 'హనుమాన్ జీ'ని సందర్శించారు. ఆ తర్వాత 'శ్రీ ఆదిశంకర విమాన మండపాన్ని’ కూడా సందర్శించారు.

విద్యార్థుల కోసం జిల్లా యంత్రాంగం ప్రయాగ్‌రాజ్‌లో విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లా అధికారులు విద్యార్థులను ప్రయాగ్‌రాజ్ నగరంలో, చుట్టుపక్కల ఉన్న వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లారు. అక్షయవత్ ('నాశనం లేని మర్రి చెట్టు'గా హిందూ పురాణాల్లో పేర్కొన్న పవిత్రమైన అంజూర చెట్టు), చంద్రశేఖర్ ఆజాద్ పార్క్, ప్రయాగ్‌రాజ్ మ్యూజియం, శ్రీ స్వామినారాయణ మందిర్‌కు తీసుకెళ్లారు. 'సంగం నగరి'లో పర్యటనను ముగించుకున్న తమిళనాడు విద్యార్థుల బృందం అయోధ్యకు బయలుదేరింది.

అయోధ్యకు బయలుదేరే సమయంలోనూ విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. సందర్శించిన వివిధ ప్రాంతాల్లో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల చరిత్ర గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తి కనబరిచారు.  భాషాపరమైన ఇబ్బందులు రాకుండా చూసేందుకు, ప్రత్యేక చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగం తమిళ భాష & సంస్కృతి మీద అవగాహన ఉన్న అధికారులను ఎంపిక చేసి విద్యార్థులతో పంపింది.

*****


(Release ID: 1877856) Visitor Counter : 124