రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్‌ లోని పశ్చిమ మేదినీపూర్‌ లో 5,351 కోట్ల రూపాయల విలువైన 4 ఎన్.హెచ్. ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన - శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 17 NOV 2022 5:35PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, ఈ రోజు, పశ్చిమ బెంగాల్‌ లోని పశ్చిమ మేదినీపూర్‌ లో 5,351 కోట్ల రూపాయల విలువైన 4 ఎన్.హెచ్. ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు.

ఆయన ఈ  రోజు జాతికి అంకితం చేసిన ఈ ప్రాజెక్టులలో ఖరగ్‌పూర్ నుండి చిచ్రా వరకు 613 కోట్ల రూపాయలతో నిర్మించిన 4 వరుసల రహదారి కూడా ఉంది.  చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల పురోగతి, శ్రేయస్సును నిర్ధారించడంలో ఈ రహదారి అభివృద్ధి చాలా దోహదపడుతుంది.

పనాగర్ నుండి దంకుని (ఎన్.హెచ్-2) వరకు 162 కిలోమీటర్ల మేర 4,215 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 6 వరుసల రహదారి నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు.   ఈ మార్గం నిర్మాణం వల్ల సిక్కిం, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, బంగాళాఖాతం ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుంది.

10 కి.మీ. మేర 175 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 4 లైన్ల పురూలియా బైపాస్‌ కు కూడా కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ బైపాస్ నిర్మాణం 2023 డిసెంబర్ నాటికి పూర్తి అవుతుంది.  ఈ బైపాస్ నిర్మాణం వల్ల నగరం లోపల ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు, దుర్గాపూర్, అసన్సోల్, బొకారో ధన్‌ బాద్, జంషెడ్‌పూర్, రాంచీకి వెళ్లే వాహనాలు తమ ప్రయాణ సమయం, దూరం, ఖర్చు కూడా ఆదా అవుతుంది. 

*****


(Release ID: 1876943) Visitor Counter : 138


Read this release in: English , Urdu , Hindi