గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

భూ రికార్డుల డిజిటలైజేషన్ వల్ల గ్రామీణ భారతదేశంలో పారదర్శకత మరియు సాధికారత ఏర్పడుతుంది...కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే,

Posted On: 16 NOV 2022 5:16PM by PIB Hyderabad

   హైదరాబాద్‌లో  జియోస్పేషియల్ సాంకేతిక పరిజ్ఞానంపై జరుగుతున్నమూడు రోజుల జియోస్మార్ట్ ఇండియా 2022 వార్షిక సదస్సు  రెండో రోజున కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ ఈరోజు పాల్గొన్నారు.  సదస్సులో పాల్గొంటున్న ప్రతినిధులను ఉద్దేశించి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే ప్రసంగించారు.  "భూ రికార్డుల డిజిటలైజేషన్ వల్ల గ్రామీణ భారతదేశం పారదర్శకత మరియు సాధికారత ఏర్పడుతుంది.  గ్రామీణ భారతదేశంలో నిరక్షరాస్యులు  కూడా దేశంలో కొనసాగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగం కావచ్చు" అని శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే  అన్నారు.


వివాద పరిష్కారం

భూమికి సంబంధించిన వివాదాల పరిష్కార అంశంపై  మంత్రి మాట్లాడుతూ “భూమి , భూమిపై హక్కులు లేకుండా సాగే వ్యవసాయం వల్ల ఎటువంటి పురోగతి సాధ్యం కాదు. పేదలు,  అట్టడుగున ఉన్న వారికి భూమి రికార్డులు  కీలకంగా ఉంటాయి.భూ హక్కుల వివాదాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కూడా సమీప భవిష్యత్తులో అన్ని భూములు  సర్వే చేయడం జరుగుతుంది" అని మంత్రి వివరించారు. 
భూ వివాదాలు తలెత్తినప్పుడు, వ్యవసాయ భూముల అంతర్లీన సంక్లిష్ట సమస్య వెలుగు చూస్తుందని  శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే వ్యాఖ్యానించారు.  కుటుంబ సమస్యలు, వివాదాలు లేదా భూసేకరణ సమయంలో సమస్య బయటపడుతుందని అన్నారు. భూ సీలింగ్‌ జరిగిన సమయంలో కొంతమంది పెదాలు కూడా భూమి పొందారని అయితే వీరికి  ఇప్పటికీ  యాజమాన్య హక్కులు లభించలేదని మంత్రి అన్నారు. సమస్య జటిలతకు  ఇది  ఒక ఉదాహరణ అని  శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే పేర్కొన్నారు.   ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లలో భూ సమస్యలు కూడా ఉన్నాయని అన్నారు. . జియోస్పేషియల్ సహకారంతో   రికార్డులు మెరుగు పరిచి త్వరితగతిన  భూమి మరియు ఆస్తి నిర్వహణ హక్కులు కల్పించడానికి అవకాశం కలుగుతుందని శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే అన్నారు. దీనివల్ల భూ ఆక్రమణలు అరికట్టడానికి వీలవుతుందని అన్నారు. 

ఈ అంశంలో సంవత్సరాల తరబడి తనకు ఎదురైన  అనుభవాలను మంత్రి వివరించారు. "అట్టడుగు స్థాయిలో ప్రజలు ఈ అంశాలపై ఆసక్తి చూపుతున్నారు. అయితే భూ యజమాని లేదా జమీందారీ వర్గం అని పిలవబడే వారు భూములపై నియంత్రణ కలిగి ఉంటున్నారు. అణగారిన వర్గాలకు చెందిన రైతులు మరియు కార్మికులకు తక్కువ జీతం ఇస్తున్నారు" అని మంత్రి పేర్కొన్నారు.


సమానత్వం, అందుబాటు:
భూములకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించే విభిన్న యంత్రాంగాల పనితీరు సంక్లిష్టంగా ఉంటుందని  శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే అన్నారు. భూ సమస్యలకు సంబంధించి దేశంలో ఎక్కువగా ఉన్న వివాదాలను   జియోస్పేషియల్ వినియోగంతో పరిష్కరించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలో  ప్రారంభమైన ఐటి విప్లవం కారణంగా ఈ రోజు ఒక గ్రామంలోని సామాన్యుడు కూడా డిజిటల్ సాంకేతికత ప్రయోజనాలు పొందుతున్నారని మంత్రి తెలిపారు. 

" జియోస్పేషియల్ సాంకేతిక పరిజ్ఞానం భూ రికార్డులలో పారదర్శకతను అందిస్తుంది. భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం  సాధారణ ప్రజలు అనేక దశల ద్వారా ప్రయత్నాలు చేయవలసి  ఉంటుంది, ఇది ప్రజలకు సమస్యగా ఉంటుంది. సమగ్ర జియోస్పేషియల్సాంకేతిక పరిజ్ఞానం అమలు చేయడం వల్ల పరిపాలన పారదర్శకంగా సాగడమే  కాకుండా సాధారణ ప్రజలు తమ హక్కులను సులువుగా పొందడానికి కూడా వీలవుతుంది.  జియోస్పేషియల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక  సవాళ్లకు పరిష్కారం లభిస్తుంది" అని మంత్రి పేర్కొన్నారు.  “ఫోర్జరీ మరియు బినామీ ఆస్తులు నిరోధానికి  అన్ని రికార్డులను  కేంద్రీకృత ప్రక్రియ ద్వారా సిద్ధం చేసి   రిజిస్ట్రీలో పొందుపర్చడం జరుగుతుంది. . డిజిటలైజేషన్ వల్ల ప్రజలకు సాధికారత లభించింది. భూమి హక్కులే ఆత్మ నిర్భర్ భారత్‌కు పునాది అని ప్రధాని మోదీ నిరంతరం చెబుతున్నారు. దేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు సులువుగా అర్థం చేసుకునే విధంగా అనేక భాషల్లో  పోర్టల్‌లను అభివృద్ధి చేయడం జరిగింది" అని శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే  అన్నారు.

డిజిటల్ రికార్డులు:

           ఈ రోజుల్లో భూమి రికార్డులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.అనేక అసమానతలు ఎదుర్కొంటున్న ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి సహకారం అందించేందుకు పారదర్శక విధానంలో ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తోంది.  “విపత్తు సమయంలో లేదా భూసేకరణ కోసం సరైన పరిహారం అంశం లేవనెత్తిన సమయంలో నిర్ణయించిన సర్కిల్ రేటు  చెల్లించి ప్రజలు ప్రయోజనం పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. . ఇది చాలా సులువైన పనిగా కనిపించినప్పటికీ దీనిలో చాలా సంక్లిష్టతలు ఉన్నాయి' అని శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే పేర్కొన్నారు. 

"సంక్లిష్టంగా ఉండే  భూమి మరియు ఆస్తి వంటి అంశాలకు సంబంధించి అనుసరిస్తున్న భాష సులువుగా అర్థమయ్యే విధంగా ఉండాలి. దీనివల్ల సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి. దీంతో సామాజిక పురోగతిలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు  సమాన భాగస్వాములుగా ఉంటారు. దీని ద్వారా ప్రజలకు సాధికారత లభిస్తుంది" అని శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే అన్నారు. 

అంతకుముందు, జియో స్మార్ట్ సదస్సులో భూమి, ఆస్తుల యాజమాన్యంపై కేంద్ర  అదనపు కార్యదర్శి హుకుం సింగ్ మీనా ప్రసంగించారు.  డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లి దేశంలోని అన్ని భూములను యజమానుల ఆధార్‌తో అనుసంధానం చేస్తామని హుకుం సింగ్ మీనా చెప్పారు. భూమికి సంబంధించిన వివాదాలను నిర్దిష్ట పరిమితిలో పరిష్కరించడానికి చట్ట నిబంధనల ప్రకారం  పరిష్కరించాల్సిన అవసరం ఉందని కూడా సింగ్ అన్నారు.  భూమి రిజిస్ట్రేషన్ కోసం వన్ నేషన్ వన్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని  ఆయన అన్నారు. భారతదేశంలో 60% కంటే ఎక్కువ వ్యాజ్యాలు భూమికి సంబంధించిన వ్యాజ్యాలు అని ఆయన అన్నారు.

 నవంబర్ 15 నుంచి  17 వరకు హైదరాబాద్‌లో మూడు రోజులపాటు జరిగే సదస్సులో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 2500 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు .

***



(Release ID: 1876624) Visitor Counter : 256


Read this release in: English , Urdu , Hindi