ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారత 41వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో సీబీడీటీ పన్ను చెల్లింపుదారుల ప్రాంగణాన్ని ప్రారంభించిన చైర్మన్ శ్రీ నితిన్ గుప్తా
ఇటీవల సీబీడీటీ చేపట్టిన పన్ను చెల్లింపుదారు సౌలభ్య
చర్యలపై అవగాహన కల్పించేందుకే ప్రాంగణం ఏర్పాటు;
ఐఐటీఎఫ్ ఇతివృత్తమైన ‘స్థానికత కోసం స్వగళం’ నినాదానికి మద్దతుసహా
అంకుర సంస్థలు.. వ్యవసాయం-అనుబంధ కార్యకలాపాలు.. స్థానిక తయారీ.. సహకార సంస్థలకు పన్ను ప్రోత్సాహకాల గురించి ఈ ప్రాంగణం వివరిస్తుంది
Posted On:
15 NOV 2022 7:13PM by PIB Hyderabad
న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 2022 నవంబర్ 14 నుంచి 27దాకా నిర్వహించే భారత 41వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2022లో పన్ను చెల్లింపుదారుల ప్రాంగణాన్ని ఆదాయపు పన్ను శాఖ ఏర్పాటు చేసింది. పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ అందించిన సేవలపై అవగాహన కల్పనసహా ఆ శాఖ చేపట్టిన డిజిటలీకరణ, పారదర్శక పన్నువిధానం, ఫిర్యాదులపై ఆన్‌లైన్ పరిష్కారం, ఇ-పాన్, ఇ-ఫైలింగ్ వగైరా నిబంధనల అనుసరణ సౌలభ్య చర్యల గురించి వివరించడం లక్ష్యంగా ఈ ప్రాంగణం ఏర్పాటు చేయబడింది. న్యూడిల్లీలోని ప్రగతి మైదాన్‌లోగల 5వ నంబరు హాలులో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ శ్రీ నితిన్ గుప్తా ఈ పన్ను చెల్లింపుదారుల ప్రాంగణాన్ని ప్రారంభించారు. బోర్డు సభ్యులతోపాటు ఆదాయపు పన్ను శాఖలోని పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీబీడీటీ ఇటీవల చేపట్టిన పన్ను చెల్లింపుదారు సౌలభ్య చర్యలపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాంగణం ఏర్పాటు చేయబడింది. దీంతోపాటు దేశ నిర్మాణంలో పన్నుల ప్రాముఖ్యంపై (భవిష్యత్తు పన్ను చెల్లింపుదారులైన) బాలలు, యువకులలో చైతన్యం కల్పించేందుకు యత్నిస్తుంది. ఈ రెండు కీలక లక్ష్యాల ప్రాతిపదికన ఈ పన్ను చెల్లింపుదారుల ప్రాంగణంలో అధికారులు కింద పేర్కొన్న విధంగా పలు కార్యకలాపాలు నిర్వహించారు:
- పాన్/ఇ-పాన్, పాన్-ఆధార్ సంధానంపై దరఖాస్తుకు సహాయం; పాన్ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు.
- ఇ-ఫైలింగ్, ఫారం 26ఎఎస్ (పన్ను-జమ)/ఏఐఎస్ సంబంధిత సందేహాల నివృత్తి.
- ఇ-విచారణలో ప్రత్యక్ష హజరురహిత అంచనా, నిబంధనానుసరణ సంబంధిత సమస్యలపై సందేహాలకు సమాధానాలు.
- వివిధ అంశాలపై పన్ను చెల్లింపుదారులకు వరుస సమాచార కరదీపికల పంపిణీ.
- అంతర్జాతీయ పన్నులపై చర్యల సంబంధిత సమాచారం ఇవ్వడం.
- కామిక్ పుస్తకాలు, బోర్డ్-వర్చువల్ రియాలిటీ ఆటలు, రోబో-టాక్స్, ‘ఆయకర్’ వీడియో గేమ్ తదితర అంశాలతో కూడిన పిల్లల కార్నివాల్ కేంద్రం. ఆదాయపు పన్నుశాఖకు ముద్రాపక హక్కుగల మూడు కామిక్ పాత్రలు- ‘జాన్‌కారీ బాబు’, ‘ ‘టాక్స్ పరి’, ‘టాక్సా’లతో పిల్లలు సంభాషించే వెసులుబాటు.
- పన్ను వ్యవస్థ, దేశ నిర్మాణం ఇతివృత్తాలుగా పిల్లలకు నుక్కడ్ నాటక్, క్విజ్ షోలు, ఇంద్రజాల ప్రదర్శనలు, అక్కడికక్కడ కేరికేచర్ గీయడం, డ్రాయింగ్/పెయింటింగ్ పోటీ వగైరాల నిర్వహణ.
ఐఐటీఎఫ్ ఇతివృత్తం ‘స్థానికత కోసం స్వగళం’కు అనుగుణంగా అంకుర సంస్థలు, వ్యవసాయం-అనుబంధ కార్యకలాపాలు, స్థానిక తయారీ, సహకార సంస్థలు తదితరాలకు కల్పించిన పన్ను ప్రోత్సాహకాల గురించి వివిధ ప్రదర్శనలు, పరస్పర చర్యాధారిత ప్రదర్శనల ద్వారా ఈ ప్రాంగణం ప్రముఖంగా వివరించింది. పన్ను చెల్లింపుదారులు/భాగస్వాములతో పరస్పర చర్యలుసహా వారికి ఎదురయ్యే సమస్యలపై అభిప్రాయ సేకరణలోనూ ఈ ప్రాంగణం ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది. అందువల్ల అందరికీ చేరువయ్యే ఒక మార్గంగా మాత్రమేగాక సేవా ప్రదాతగా ఆదాయపు పన్నుశాఖ పోషించే పాత్రను వివరించేందుకు ఈ ప్రాంగణం ఒక వేదికగా నిలుస్తుంది.
******
(Release ID: 1876328)
Visitor Counter : 146