ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
41వ భారత అంతర్జాతీయ వాణిజ్య సదస్సులో ఆరోగ్య పెవిలియన్ ప్రారంభించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్
వివిధ మాధ్యమాల ద్వారా సమాచార వ్యాప్తి కార్యకలాపాలను గరిష్ట స్థాయికి పెంచుకోవాలని విజ్ఞప్తి
Posted On:
14 NOV 2022 7:40PM by PIB Hyderabad
ఇవాళ, దిల్లీలో జరిగిన 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య సదస్సులో (ఐఐటీఎఫ్) ఆరోగ్య పెవిలియన్‌ను నీతి ఆయోగ్ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె.పాల్ ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ ఎస్.గోపాలకృష్ణన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏటా ఈ పెవిలియన్ ఏర్పాటు చేస్తుంది. ఈ సంవత్సరం పెవిలియన్ అంశం "భారతదేశంలో స్వస్థత, భారతదేశం ద్వారా స్వస్థత".

ఆరోగ్యం పట్ల అందరూ తగిన శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా డాక్టర్ పాల్ సూచించారు. పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మెచ్చుకున్నారు. నిర్ధరణ అయ్యే వరకు తెలీని అమీనియా, చక్కెర వ్యాధి వంటి వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.
ఆరోగ్య అవగాహన సందేశాన్ని ప్రతి ఒక్కరూ యుద్ధ ప్రాతిపదికన స్వీకరించాలని, వివిధ మాధ్యమాల ద్వారా సమాచార వ్యాప్తి కార్యకలాపాలను గరిష్ట స్థాయికి విస్తరించాలని సంబంధిత వర్గాలను డాక్టర్ పాల్ కోరారు.

మెరుగైన ఆరోగ్యం కోసం ప్రజా ఉద్యమం ప్రారంభించేందుకు ఆరోగ్య పెవిలియన్‌ను ఒక వేదికగా ఉపయోగించుకోవాలని చెప్పారు.

ఆరోగ్య రంగంలో తీసుకొస్తున్న కీలక సంస్కరణలు, చేపడుతున్న కార్యక్రమాల పట్ల శ్రీ గోపాలకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ హెల్త్ కార్యక్రమం గురించి మాట్లాడిన శ్రీ గోపాలకృష్ణన్, దాని సార్వత్రిక ప్రభావం, వర్తింపు గురించి నొక్కి వక్కాణించారు. ప్రజల్లో అవగాహన పెంచితే అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని అన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల ప్రారంభించిన పీఎం టీబీ-ముక్త్ భారత్ అభియాన్, జాతీయ సార్వత్రిక రోగ నిరోధకత కార్యక్రమం, ఎఫ్‌ఎస్‌ఏఏఐ, నాకో, ఏబీ పీఎంజేవై, ఎన్‌వీబీడీసీపీ, ఎన్‌హెచ్‌ఏ సహా వివిధ కార్యక్రమాలు, పథకాలు, విజయాలను ఆరోగ్య పెవిలియన్ ప్రదర్శిస్తుంది. సమాచార కార్యక్రమాలు, ప్రాణ రక్షణ నైపుణ్యాలు, మధుమేహం, రక్తహీనత, రక్తపోటు, బీఎంఐ మొదలైన వాటిని తనిఖీ చేసుకునే, పరీక్షించుకునే వివిధ స్టాల్స్ కూడా ఆరోగ్య పెవిలియన్‌లో ఉన్నాయి.
****
(Release ID: 1876020)
Visitor Counter : 162