గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ లో సమర్థవంతమైన పాలన వ్యవస్థ కోసం అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
Posted On:
10 NOV 2022 3:56PM by PIB Hyderabad
దీనదయాళ్ అంత్యోదయ యోజన - నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (DAY-NRLM),పాలన వ్యవస్థను పటిష్టం చేయడం, వినూత్న విధానాల రూపకల్పన, పంచాయతీరాజ్ సంస్థలు, స్వయం సహాయక బృందాల మధ్య సమన్వయం సాధించడానికి రూపొందించిన జాతీయ విధానాన్ని అమలు చేయడానికి గురుగ్రామ్‌కు చెందిన వెడ్డిస్ ఫౌండేషన్‌తో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, వెడ్డిస్ల మధ్య కుదిరిన ఒప్పందం మూడు సంవత్సరాల పటు అమలులో ఉంటుంది. దీనిలో ఎటువంటి ఆర్థిక అంశాలు ఉండవు. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తరఫున గ్రామీణ జీవనోపాధి సంయుక్త కార్యదర్శి శ్రీమతి నీతా కేజ్రేవాల్ మరియు వీడిస్ ఫౌండేషన్ సీఈఓ మురుగన్ వాసుదేవన్ అవగాహన ఒప్పందం పై సంతకం చేశారు.
ఈ సందర్భంగా గ్రామీణ జీవనోపాధి సంయుక్త కార్యదర్శి శ్రీమతి నీతా కేజ్రేవాల్ మాట్లాడుతూ, దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు.దీనిని దృష్టిలో ఉంచుకుని దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పరిపాలనను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాఖ్యలను బలోపేతం చేసే రంగాలలో ప్రత్యేకంగా క్లస్టర్ స్థాయి సమాఖ్యల నిర్వహణకు సంబంధించి సంబంధిత వర్గాల మధ్య సమన్వయం సాధించాల్సి ఉంటుందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ రంగాల్లో అపార అనుభవం కలిగి ఉన్న వెడ్డిస్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని శ్రీమతి నీతా కేజ్రేవాల్ వివరించారు. వెడ్డిస్ ఫౌండేషన్‌తో కుదిరిన అవగాహన వల్ల గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు మరింత సమర్థంగా అమలు జరుగుతాయని అన్నారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, రాష్ట్రాల వ్యవస్థలకు అవసరమైన సాంకేతిక సహాయం కూడా అందుతుందని అన్నారు.
వెడ్డిస్ ఫౌండేషన్ సీఈఓ శ్రీ మురుగన్ వాసుదేవన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సంస్థ గత ఐదేళ్లుగా గ్రామీణ జీవనోపాధి మిషన్ అమలు కోసం రాష్ట్రాలతో పని చేస్తున్నదని తెలిపారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన - నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ లాంటి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు స్థిరమైన బహుళ-వ్యవస్థలు, సమర్థవంతమైన పాలన అందించేందుకు రాష్ట్ర సామర్థ్యాన్ని పెంపొందించడం అత్యంత ముఖ్యమైన అంశం అని తాము గుర్తించామని శ్రీ మురుగన్ వాసుదేవన్ తెలిపారు. వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలు దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద అమలు జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమాల అమలుకు అవసరమైన పాలన వ్యవస్థను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో అభివృద్ధి చేస్తామని శ్రీ మురుగన్ తెలిపారు.
అవగాహన ఒప్పందం ప్రకారం రాబోయే ఐదేళ్లపాటు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రామీణ జీవనోపాధి విభాగంలో ప్రాజెక్టు నిర్వహణ కోసం ఒక యూనిట్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజా నిధుల సక్రమ వినియోగం కోసం సమాచార ఆధారిత వ్యవస్థను వెడ్డిస్ ఫౌండేషన్ అభివృద్ధి చేస్తుంది. సమర్థ పాలనకు ప్రాధాన్యత ఇస్తూ ఒప్పందం అమలు జరుగుతుంది.
హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు మణిపూర్, రాజస్థాన్‌లో రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్‌లలో ప్రాజెక్టు నిర్వహణ యూనిట్లను వెడ్డిస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. పని క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారం ఆధారంగా విధాన నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రాధాన్యతలను సమర్థవంతంగా అమలు చేయడం. మెరుగైన ప్రక్రియలను పొందుపరచడం మరియు రాష్ట్ర భాగస్వాములకు శిక్షణ మరియు సామర్థ్య నిర్మాణం కోసం వెడ్డిస్ ఫౌండేషన్ 360-డిగ్రీల విధానంలో పనిచేస్తుంది.దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ను సమర్థవంతంగా అమలు చేయడానికి సహకరించే వ్యవస్థలను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామిగా వెడ్డిస్ ఫౌండేషన్ ఉంటుంది.
ఎమ్‌ఓయులో భాగంగా తొలుత 'గవర్నెన్స్ ఇండెక్స్' ఆధారంగా వివిధ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ ల పనితీరు మదింపు వేసి వార్షిక నివేదికను విడుదల చేయడం జరుగుతుంది.
గ్రామీణ పేదలు ముఖ్యంగా మహిళల కోసం సంస్థాగత వేదికలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఒకటిగా దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అమలు జరుగుతున్నది. స్థిరమైన జీవనోపాధి అందించడం ద్వారా గృహ ఆదాయాన్ని పెంచడం, హక్కులు, సౌకర్యాలు అందుబాటులోకి తేవడంతో పాటు ఆర్థిక ప్రజా సేవలు అమలు చేయడాన్ని దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ లక్ష్యంగా చేసుకుని అమలు జరుగుతున్నది. 13,000 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌తో దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ 34 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని 723 జిల్లాల్లోని 7.15 లక్షల గ్రామాలలో అమలులో ఉంది. దాదాపు 8.6 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలు దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పరిధిలో ఉన్నాయి.
***
(Release ID: 1875075)
Visitor Counter : 275