నౌకారవాణా మంత్రిత్వ శాఖ

వారణాసిలో 2 రోజుల పాటు జరగనున్న 'పీఎం గతి శక్తి మల్టీమోడల్ వాటర్‌వేస్ సమ్మిట్‌' ప్రారంభించనున్న శ్రీ శర్వానంద సోనోవాల్

Posted On: 09 NOV 2022 3:30PM by PIB Hyderabad

భారత జల మార్గాల నిర్వహణ సంస్థ (ఐడబ్ల్యూఏఐ), 2022 నవంబర్‌ 11, 12 తేదీల్లో 'పీఎం గతి శక్తి మల్టీమోడల్ వాటర్‌వేస్ సమ్మిట్' నిర్వహిస్తోంది. కేంద్ర నౌకాశ్రయాలు, నౌకా రవాణా, జల మార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలో ఉన్న దీనదయాళ్ హస్తకళా సంకుల్‌ (వాణిజ్య కేంద్రం & మ్యూజియం) లో ఈ సదస్సు జరుగుతుంది. జల మార్గాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావిస్తూ, పీఎం గతి శక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక గురించి ఈ కార్యక్రమం మరింత అవగాహన కల్పిస్తుంది.

ఈ సదస్సుకు ముందు, వారణాసిలోని రవిదాస్ ఘాట్ వద్ద ఎన్‌డబ్ల్యూ-1 (గంగానది) పై సామాజిక జెట్టీల శిలాఫలకాలు (7) & పునాది రాళ్లను (8) కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా, జల మార్గాల మంత్రి శ్రీ శర్వానంద సోనోవాల్ ఆవిష్కరిస్తారు.

పీఎం గతి శక్తి జాతీయ బృహత్తర పథకం, బహుళార్థక జల మార్గాల సదస్సు గురించి మాట్లాడిన శ్రీ సోనోవాల్, “సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ ఆలోచనలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉంది. రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రవాణా వ్యయాలను తగ్గించడానికి తీసుకొచ్చిన నూతన విధానమే పీఎం గతి శక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక (ఎన్‌ఎంపీ). ప్రజా రవాణా, సరుకుల రవాణాలో ఇబ్బందులు లేని మొదటి-చివరి మైళ్ల అనుసంధానం దీనివల్ల సాధ్యమవుతుంది. దాదాపు రూ.62,627 కోట్ల వ్యయ అంచనాతో, గతిశక్తి ఎన్‌ఎంపీ కింద 101 ప్రాజెక్ట్‌లను మంత్రిత్వ శాఖ గుర్తించింది. 2024 నాటికి వీటిని పూర్తి చేయాలన్నది లక్ష్యం. వీటిలో తొమ్మిది అతి ముఖ్యమైన ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.1,913 కోట్లు. వీటిని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం" అని వివరించారు.

ఐడబ్ల్యూఏఐ అధ్యక్షుడు శ్రీ సంజయ్ బందోపాధ్యాయ మాట్లాడుతూ, “జాతీయ బృహత్తర ప్రణాళికపై చర్చించడానికి కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ, మేథావి వర్గాలకు ఈ సదస్సు ఒక అనుసంధాన వేదికగా మారుతుంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి సీనియర్ అధికారులు, నౌకాశ్రయ అధికారులు, పరిశ్రమ నిపుణులు, ప్రైవేట్ రంగానికి చెందిన సంబంధిత వర్గాలు వారు సదస్సుకు హాజరవుతారు" అని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సెజ్‌లకు బహుళార్ధక అనుసంధాన మౌలిక సదుపాయాలను అందించడం, రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటివి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం గతి శక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక లక్ష్యం. ప్రజా రవాణా, సరకు రవాణాలో వేగం పెంచి, మరింత సమర్థవంతంగా తయారు చేసేలా ఇప్పటికే ఉన్న & ప్రతిపాదిత మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాల అమలును ఏకీకృతం చేయడం కూడా ఈ ప్రణాళిక లక్ష్యం. ఒక సులువైన, సమర్థవంతమైన రవాణా వ్యవస్థ దేశ అభివృద్ధికి వెన్నెముకగా పని చేస్తుంది, 'ఆత్మనిర్భర్ భారత్' సాధనలో కీలకాంశంగా నిలుస్తుంది.

 

****



(Release ID: 1874743) Visitor Counter : 130