వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎగుమతి ప్రోత్సాహక మండలులు, పరిశ్రమ సంఘాలతో ఎగుమతులపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ పీయూష్ గోయెల్
- ఎగుమతుల వృద్ధిలో వేగాన్ని కొనసాగించేందుకు ఎగుమతి ప్రోత్సాహక మండలులు శ్రమించాలని కోరిన వాణిజ్య మంత్రి
- జాతీయత స్ఫూర్తితో వృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా బలాబలాలు సృష్టించుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని భారత పరిశ్రమను కోరిన మంత్రి
- సవాళ్ల సమయంలో ప్రపంచ మార్కెట్లలో పట్టును నిలబెట్టుకునేందకు శ్రమించాలని ఎగుమతిదారులకు సూచన
Posted On:
07 NOV 2022 5:53PM by PIB Hyderabad
ఎగుమతుల్లో విభాగాల వారీగా ఏర్పడిన పురోగతిని ఎగుమతి ప్రోత్సాహక మండలులు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులతో న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర వాణిజ్య-పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం-ప్రభుత్వ పంపిణీ, టెక్స్ టైల్స్ శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ సమీక్షించారు.
టెక్స్ టైల్స్ శాఖ సహాయమంత్రి శ్రీమతి దర్శనా జర్దోశ్, వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ బర్త్వాల్, టెక్స్ టైల్ శాఖ కార్యదర్శి శ్రీమతి రచనా షా, ఎగుమతి ప్రోత్సాహక మండలులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు, వాణిజ్య శాఖ, పారిశ్రామిక ప్రోత్సాహం-అంతర్గత వాణిజ్య శాఖ, ఇతర శాఖల సీనియర్ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ఎగుమతి ప్రోత్సాహక సంఘాలు ఎగుమతులకు క్రియాశీల ప్రోత్సాహం అందించాలని, గత ఏడాది ఎగుమతుల్లో ఏర్పడిన వేగాన్ని కొనసాగించేందుకు కృషి చేయాలని మంత్రి కోరారు.
అంతర్జాతీయ వాణిజ్యంలో ఏర్పడిన అంతరాయాల కారణంగా కొన్ని దేశాలు కోల్పోయిన స్థానాలను ఆక్రమించుకుని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వివిధ రంగాల నాయకులను శ్రీ గోయెల్ కోరారు. జాతీయత స్ఫూర్తితో బలాబలాలు సృష్టించుకునేందుకు, వృద్ధిని ప్రోత్సహించుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని ఆయన భారత పరిశ్రమను కోరారు.
స్వల్పకాలిక సవాళ్లకు అనుగుణంగా ధరల్లో కొన్ని మార్పులు చేసుకుని అయినా సరే ఎగుమతి మార్కెట్లను నిలబెట్టుకోవాలని ఆయన భారత పరిశ్రమకు సూచించారు. ఎగుమతి సామర్థ్యం గల ఆముదం వంటి వస్తువులతో ప్రత్యేక ఉత్పత్తులకు గల అవకాశాలను అన్వేషించాలని ఎగుమతిదారులకు సూచించడంతో పాటు ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు క్రియాశీలమైన మద్దతు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ అధికారులకు సూచించారు.
భారత ఎగుమతులకు అవకాశాలు గల రంగాలను గుర్తించేందుకు రంగాలు, కమోడిటీలు, మార్కెట్ల వారీగా డేటాను విశ్లేషించాలని అధికారులను వాణిజ్య శాఖ మంత్రి కోరారు. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు సత్వరం గుర్తించి పరిష్కరించేందుకు వీలుగా ఎగుమతి ప్రోత్సాహక సంఘాలు, పారిశ్రామిక సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య బహిరంగ సమాచార మార్పిడికి గల మార్గాలను అన్వేషించాలని కూడా ఆయన సూచించారు.
వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ బర్త్వాల్ ఈ సమీక్షా సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఎగుమతులను పెంచడానికి మంత్రిత్వ శాఖ తీసుకున్నపలు చర్యలను వివరించారు. తాజా ఎగుమతి ధోరణులు, అవకాశాలపై విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ శ్రీ సంతోష్ సారంగి ప్రెజెంటేషన్ ఇచ్చారు.
***
(Release ID: 1874636)
Visitor Counter : 132