సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
స్వచ్ఛతా ప్రత్యేక ప్రచారం 2.0 సంపూర్ణంగా జయప్రదం!
స్వచ్ఛతా సంస్థాగతానికి జరిగిన కృషి
సఫలీకృతం, ప్రశంసనీయం: జితేంద్ర సింగ్..
ప్రధాని మోదీ కన్న కలలను సాకారం చేయడంలో
కార్యక్రమం విజయవంతమైందని వెల్లడి...
చెత్త తొలగింపుతో రూ. 364.53 కోట్ల ఆర్జన
4,36,855 ప్రజా ఫిర్యాదుల పరిష్కారం,
8,734 ఎం.పి. రెఫరెన్స్‌లకు సమాధానాలు..
883 నియమాల సరళీకరణ,
54.5 లక్షల ఫైళ్లపై సమీక్ష
88.05 లక్షల చదరపు అడుగుల స్థలానికి విముక్తి..
99,633 ప్రచార స్థలాల్లో స్వచ్ఛతా ప్రచారం విజయవంతం
2021 ప్రత్యేక ప్రచారం కంటే స్వచ్ఛత ప్రచారం2.0
15 రెట్లు పెద్దది: జితేంద్ర సింగ్ వెల్లడి.
Posted On:
04 NOV 2022 4:59PM by PIB Hyderabad
స్వచ్ఛతా పథకాన్ని సంస్థాగతం చేయడం, పెండింగ్ సమస్యలను తగ్గించడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేయడంలో స్వచ్ఛతా ప్రత్యేక ప్రచార కార్యక్రమం 2.0 ఎంతో విజయవంతమైందని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 2022 అక్టోబరు 2 నుంచి అక్టోబర్ 31వరకూ నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ప్రచారం 2.0 ఫలితాలు, ఉత్తమ విధథాన పద్ధతుల గురించి కేంద్రమంత్రి మీడియాకు వివరిస్తూ ఈ విషయం చెప్పారు. చెత్త సామగ్రి, రద్దీ సామగ్రి అమ్మకం, తొలగింపు ద్వారా ద్వారా రూ. 364 కోట్ల సముపార్జన జరిగిందని, ప్రచార కార్యక్రమ సమయంలో 88.05 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీ అయిందని కేంద్రమంత్రి చెప్పారు.
పరిశుభ్రత ప్రచార కార్యక్రమం సందర్భంగా స్థలాల శుభ్రతాపరంగా పరిశీలించినపుడు 2021లో జరిగిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంకంటే తాజాగా జరిగిన 2వ దశ కార్యక్రమం 15 రెట్లు పెద్దదని జితేంద్ర సింగ్ అన్నారు. 2022, అక్టోబర్ 2నుంచి 25వ తేదీవరకూ కార్యక్రమం నిర్వహించిన 99,633 స్థలాల్లో స్వచ్ఛతా ప్రచారం విజయవంతమైందని, 54.5 లక్షల ఫైళ్లను సమీక్షించామని, 4,36,855 ప్రజా ఫిర్యాదులను పరిష్కరించామని, 8,734 ఎం.పి.ల రిఫరెన్స్‌లకు సమాధానమిచ్చామని, 883వరకూ నిబంధనలను సడలించామని ఆయన చెప్పారు.
ప్రత్యేక ప్రచార కార్యక్రమం,.. ప్రభుత్వం అనుసరించే మొత్తం విధానానికి సరైన నిదర్శనమని, నెలరోజుల ప్రచారంలో విదేశాలకు చెందిన సంస్థలు కూడా చురుకుగా పాల్గొన్నందున అంతకు మించిన అనూహ్య ఫలితాలు లభించాయని అన్నారు. 2022 అక్టోబరు 2నుంచి 31వరకూ జరిగిన స్వచ్ఛతా ప్రచార కార్యక్రమంలో భారతదేశంలోని మారుమూల ప్రాంతాలతో సహా అనుబంధ,/సబార్డినేట్/ఫైల్డ్ కార్యాలయాలపై కూడా వివిధ కేంద్ర విభాగాలు/మంత్రిత్వ శాఖలు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయని ఆయన చెప్పారు.
ప్రత్యేక ప్రచార కార్యక్రమం 2.0 గురించి, అందులో పాటించిన పద్ధతుల గురించి కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా సమస్యల శాఖ (డి.ఎ.ఆర్.పి.జి.) కార్యదర్శి వి. శ్రీనివాస్ పత్రికా సమావేశంలో వివరించారు. ఆయనతోపాటుగా ఓడరేవులు, నౌకాయాన- జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సంజీవ్ రంజన్, రైల్వే బోర్డు ఛైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి, కేంద్ర టెలీ కమ్యూనికేషన్స్ విభాగం కార్యదర్శి కె. రాజారామన్, కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ (డి.ఎస్.టి.) కార్యదర్శి చంద్రశేఖర్, కేంద్ర పరోక్షపన్నుల, కస్టమ్స్ సుంకాల బోర్డు (సి.బి.ఐ.సి.) చైర్మన్ వివేక్ జోహ్రీ కూడా విషయాలు విపులంగా వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, స్వచ్ఛతా అభియాన్ ప్రచార కార్యక్రమంలో ప్రయత్నాలు వినూత్నమైనవి, ప్రశంసనీయమైనవి అని అన్నారు. "ముఖ్యంగా మన పరిసరాలు, బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ప్రాథమిక పౌర కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది" అంటూ ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రి ప్రస్తావించిన మాటలతో అధికారులు స్ఫూర్తిని పొందారని, ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారని జితేంద్ర సింగ్ అన్నారు.
కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 2022 అక్టోబర్ 2నుంచి 31 వరకూ స్వచ్ఛతకోసం ప్రత్యేక ప్రచారం 2.0 చేపట్టారు. ప్రత్యేక ప్రచారం 2.0 కింద, కార్యాలయాల్లో పరిశుభ్రత కోసం, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు, మంత్రిత్వ శాఖలు/విభాగాలు ప్రత్యేక శ్రద్ధ వహించాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలతో సహా, సబార్డినేట్ కార్యాలయాలు/క్షేత్రస్థాయి కార్యాలయాల్లో, తదితర ప్రాంతాల్లో ఈ ప్రత్యేక ప్రచారం 2.0ను అమలుచేశారు. ఉత్తరాదిలోని ద్రాస్ ప్రాంతంనుంచి కన్యా కుమారి వరకు, బికనీర్ నుంచి ఇటానగర్ వరకు ఉన్నకేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ప్రచారాన్ని విస్తృత స్థాయిలో చేపట్టారు. విదేశాలలో ఉన్న అన్ని భారతీయ సంస్థలు కూడా ప్రత్యేక ప్రచారం 2.0ని ఎంతో ఉత్సాహంతో అమలు చేశాయి. పరిమాణంలో, స్థాయిలో ప్రత్యేక ప్రచారం 2.0 పూర్తిగా సంపూర్ణమైనది. ప్రభుత్వ కార్యాలయాలలో స్వచ్ఛత కోసం సృష్టించిన ఉద్యమం లాంటి ఈ భారీ కార్యక్రమంలో వేలాది మంది అధికారులు, పౌరులు విస్తృతంగా పాల్గొన్నారు. కేంద్ర కేబినెట్ మంత్రులు, రాష్ట్రాల మంత్రులు ప్రత్యేక ప్రచారం 2.0లో పాలుపంచుకున్నారు. కార్యక్రమం అమలులో వారు నాయకత్వం, మార్గదర్శకత్వం అందించారు.
24,000 తపాలా కార్యాలయాల్లో తపాలా శాఖ, 9,374 రైల్వే స్టేషన్లలో రైల్వే మంత్రిత్వ శాఖ, 5,922 ప్రచార స్థలాల్లో రక్షణ శాఖ, 11,559 ప్రచార ప్రాంతాల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశుభ్రత, స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాయి. వెయ్యికి పైగా ప్రచార సైట్‌లలో 16 మంత్రిత్వ శాఖలు/విభాగాలు, వందకి పైగా ప్రచార స్థలాల్లో 31 మంత్రిత్వ శాఖలు/విభాగాలు 2వ దశప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించాయి.
ఈ ప్రత్యేక ప్రచారం పురోగతిని ప్రతిరోజూ www.pgportal.gov.in/scdpm22 అనే ప్రత్యేక పోర్టల్ ద్వారా పర్యవేక్షించారు. ఇందుకోసం అన్ని మంత్రిత్వ శాఖల్లో/ విభాగాల్లో 215 మంది నోడల్ అధికారులు/ సబ్-నోడల్ అధికారులు నియమితులయ్యారు. ప్రత్యేక ప్రచారం 2.0ని భారత ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు వారం, వారం సమీక్షించారు. ప్రత్యేక ప్రచారం 2.0 పురోగతి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. వివిద మంత్రిత్వ శాఖలు/విభాగాలు 67,000కి పైగా ట్వీట్లను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశాయి. ఇక పత్రికా సమాచార విభాగం (పి.ఐ.బి.) ద్వారా 127 ప్రకటనలను వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల జారీ చేశాయి.
పౌరులను, ప్రభుత్వానికి మరింత చేరువ చేసేందుకు, ఒక చక్కని ఆహ్లాదకరమైన పని వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రత్యేక ప్రచార 2.0 ద్వారా ప్రయత్నం జరిగింది. ఈ ప్రచారాన్ని పౌరల ప్రధానమైన ఉద్యమంగా నిర్వహించడంలో 300కు పైగా ఉత్తమ పద్ధతులను మంత్రిత్వ శాఖలు/విభాగాలు చేపట్టాయి.
ప్రత్యేక ప్రచారం 2.0 ద్వారా రూపుదాల్చిన ఉత్తమ పద్ధతుల్లో కొన్నింటిని, ఈ దిగువన ఉదహరిస్తున్నాం :
- బెంగుళూరు రైల్వే స్టేషన్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ రెండు కార్యక్రమాలు నిర్వహించింది. తద్వారా, వాడి, వదలేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో ప్లాస్టిక్ రాక్షస శిల్పాన్ని రూపొందించారు. మరో కార్యక్రమంలో భాగంగా గుంటూరు రైల్వేస్టేషన్‌లో కొత్త రైలు బోగీ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
- వినియోగదారుల అనుభవాన్ని మరింతగా పెంపొందించడం కోసం తపాలా శాఖ చొరవ తీసుకుంది. దీనితో,.. పాత ఫర్నిచర్ సామగ్రి రీసైక్లింగ్ ద్వారా కోల్‌కతా జనరల్ పోస్ట్ ఆఫీసు (జి.పి.ఒ.)లో పార్శిల్ కేఫ్‌ను ప్రారంభించగలిగారు.
- పోర్ట్ బ్లెయిర్‌లో జార్వా తెగ పూరిగుడిసెను రూపొందించడంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చొరవ చూపించింది. పరిశుభ్రత పట్ల పర్యావరణహితమైన విలువలతో కూడిన వారి పద్ధతిని తెలియజెప్పేందుకు ఇది దోహదపడుతుంది.
- తెలంగాణ రాష్ట్రంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కె.వి.కె.), కేంద్ర మెట్టప్రాంత వ్యవసాయ పరిశోధనా సంస్థ (క్రిడా) చొరవతో చేపట్టిన కార్యక్రమం. పార్దీనియం రహితమైన, ప్లాస్టిక్ రహితమైన వ్యవసాయ క్షేత్రాలను రూపొందించేందుకు ఇది దోహదపడింది.
- మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చొరవతో చేపట్టిన కార్యక్రమం. "వన్ స్టాప్ సెంటర్స్"ను అభివృద్ధి చేయడం, వ్యర్థ పదార్థాల నుంచి ఉపయోగకరమైన ఉత్పత్తులను తయారు చేయడానికి శిక్షణ అందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
- కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు చొరవతో చేపట్టిన కార్యక్రమం ఇది. వారి కార్యాలయ కారిడార్ మరింత మెరుగుపరిచి, వినూత్నంగా వినియోగించడం కోసం “అరణ్య” థీమ్‌ను ఉపయోగించారు.
- "చెత్తనుంచి ఉద్యానవనం" పేరిట కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చొరవతో ఈ కార్యక్రమం చేపట్టారు. బొకారో, కర్గాలీ క్షేత్రాలకు పరిమితమైన కేంద్రీయ బొగ్గు క్షేత్రాలలో గతంలో చెత్తాచెదారానికి నిలయాలుగా ఉన్న బొగ్గు క్షేత్రాల్లో ఉద్యానవనాలను, తోటలను అభివృద్ధి చేశారు. స్వచ్ఛతా ప్రత్యేక ప్రచారం 2 కింద ఈ పనులు నిర్వహించారు.
- వ్యర్థంగా పడిఉన్న ప్లాస్టిక్ సీసాలను ఉపయోగించడం ద్వారా వర్టికల్ గార్డెన్‌లను రూపొందించడంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చొరవతో చేపట్టిన కార్యక్రమం... ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంలో, కార్యాలయ స్థలాలను సుందరంగా తీర్చిదిద్దడంలో ఇది దోహదపడుతుంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం అనేక ప్రదేశాలలో 430 ఆయ్‌కార్ సేవా కేంద్రాలను (ఎ.ఎస్.కె. కేంద్రాలను) రంగంలోకి దింపారు.
- "చెత్తనుంచి హరితం ప్రాజెక్ట్" కింద తెలంగాణలోని బీబీనగర్‌లో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ఆయుష్ వనమూలికల మొక్కలను పెంచారు. ఇది కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చొరవతో చేపట్టిన కార్యక్రమం.
- కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ చొరవతో చేపట్టిన కార్యక్రమం. కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సి.ఐ.ఎస్.ఎఫ్.) ద్వారా ‘స్ట్రయిట్ టు సెక్యూరిటీ ఇనిషియేటివ్’ పేరిట హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల చెక్‌ఇన్ ప్రక్రియ వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకోవడం.
- 80 ఏళ్ల వయస్సు పైబడిన పెన్షనర్ల కోసం ఫేస్ అథెంటికేషన్ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించడం. ఇది,.. కేంద్ర పెన్షన్లు, పెన్షనర్ల సంక్షేమ శాఖ చొరవతో చేపట్టిన కార్యక్రమం.
- కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అథారిటీ (ఎస్.ఎం.పి.ఎ.)లో కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్-జలమార్గాల మంత్రిత్వ శాఖ చొరవతో చేపట్టిన కార్యక్రమం. ఇక్కడ క్రూయిజ్ టూరిజం కోసం ప్యాడిల్ స్టీమర్‌ను ఒక ప్రత్యేకమైన ప్రదర్శనశాలగా మార్చారు. ఇందులో అండర్-డెక్ మ్యూజియం, తేలియాడే రెస్టారెంట్/కాన్ఫరెన్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. సెల్ఫ్ ప్రొపెల్షన్ ప్రక్రియతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది.
- ముంబైలోని బాబా అణుశక్తి పరిశోధనా సంస్థ (బి.ఎ.ఆర్.సి.-బార్క్)లో మురుగు కాలువలను, ఇతర కాలువలను శుభ్రం చేయడానికి రోబోలను ఉపయోగించారు. ఇది కేంద్ర అణుశక్తి శాఖ చొరవతో చేపట్టిన కార్యక్రమం.
- కేంద్ర వైజ్ఞానిక-పారిశ్రామిక పరిశోధన విభాగం చొరవతో చేపట్టిన కార్యక్రమం. ఫైళ్లను జియో-ట్యాగింగ్ చేసే ప్రక్రియకు ఇది దోహదపడింది.
- ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించి రోడ్లను నిర్మించడంలో సరిహద్దు రహదారుల సంస్థ (బి.ఆర్.ఒ.) చొరవ చూపించింది.
స్వచ్ఛతను సంస్థాగతం చేయడం, పెండింగ్ సమస్యలను తగ్గించడంలో ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో 2వ దశ ప్రత్యేక ప్రచార కార్యక్రమం కింద నిర్విరామంగా కృషి చేసిన అధికారులను, వివిధ సంస్థలను కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా అభినందించారు.
<><><>
(Release ID: 1873971)
Visitor Counter : 152