వ్యవసాయ మంత్రిత్వ శాఖ

'జాతీయ ప్రకృతి సేద్య కార్యక్రమం' సారథ్య సంఘం సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్


వ్యవసాయ మంత్రులందరి సహకారంతో ప్రకృతి సేద్యం కార్యక్రమంలో ముందుకు సాగుతాం

రైతులకు సమాచారం అందించే పోర్టల్‌ ప్రారంభం; గ్రామీణాభివృద్ధి, జల్‌ శక్తి శాఖల మంత్రులు కూడా కార్యక్రమానికి హాజరు

Posted On: 03 NOV 2022 7:41PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన, ఇవాళ, న్యూదిల్లీలోని కృషి భవన్‌లో 'జాతీయ ప్రకృతి సేద్య కార్యక్రమం' సారథ్య సంఘం మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ తోమర్ ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ పోర్టల్‌ ప్రారంభించారు. ప్రకృతి సేద్యం కార్యక్రమాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకువెళ్తామని కేంద్ర మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర శాఖలతో సమన్వయం చేసుకుని మార్కెట్ల అనుసంధానం పెంచాలని అధికారులను కోరారు. తద్వారా, రైతులు తమ ఉత్పత్తులను మరింత సులభంగా విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, కేంద్ర జల్‌ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సూర్య ప్రతాప్ షాహి, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా, వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

 

శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఇవాళ ప్రారంభించిన పోర్టల్‌ను (http://naturalfarming.dac.gov.in/) కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. కార్యక్రమం గురించి పూర్తి సమాచారం, అమలు విధానం, వనరులు, అమలు పురోగతి, రైతుల పేర్లు నమోదు, బ్లాగ్ ఈ పోర్టల్‌లో ఉంటాయి. ఇవన్నీ రైతులకు ఉపయోగపడతాయి. దేశంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి ఈ వెబ్‌సైట్ సహాయపడుతుంది.

ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు మంచి కార్యక్రమాలు చేపట్టామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ చెప్పారు. ఆయన కొన్ని సూచనలు కూడా అందించారు. ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, గంగానది ఒడ్డున ప్రకృతి సేద్యం చేపట్టినట్లు జ‌ల్ శ‌క్తి మంత్రి శ్రీ షెకావ‌త్ తెలిపారు. 'సహకార భారతి'తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ, మొదటి దశలో 75 సహకార గంగ గ్రామాలను గుర్తించింది. ప్రకృతి సేద్యం కోసం విధానాలు రూపొందించి, రైతులకు శిక్షణ ఇచ్చింది.

నమామి గంగే ప్రాజెక్టు కింద తమ రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం ప్రారంభించామని ఉత్తరప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ షాహి చెప్పారు. ప్రతి విభాగంలో పనిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, సుశిక్షిత శిక్షణ ఇచ్చారు.

2021 డిసెంబర్ నుంచి, 17 రాష్ట్రాల్లో 4.78 లక్షల హెక్టార్లకు పైగా అదనపు వ్యవసాయ భూములను ప్రకృతి సేద్యం కిందకు తీసుకువచ్చినట్లు సమావేశంలో వెల్లడించారు. 7.33 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యంలో పాల్గొంటున్నారు. రైతుల కోసం సుమారు 23 వేల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గంగా నది ఒడ్డున నాలుగు రాష్ట్రాల్లో 1.48 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం జరుగుతోంది.

 

*****



(Release ID: 1873609) Visitor Counter : 151


Read this release in: English , Urdu , Hindi