రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ద్వైపాక్షిక రక్షణ సహకారం పెంచుకోవడానికి న్యూదిల్లీలో సమావేశమైన భారత రక్షణ శాఖ కార్యదర్శి & రాయల్ భూటాన్ ఆర్మీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్

నాడు పోస్టు చేయడమైనది: 03 NOV 2022 2:34PM by PIB Hyderabad

రాయల్ భూటాన్ ఆర్మీలో చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ (సీవోవో, ఆర్‌బీఏ) లెఫ్టినెంట్ జనరల్ బటూ షెరింగ్, భారత రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్‌ అరమణేతో న్యూదిల్లీలో సమావేశం అయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ బటూ షెరింగ్ భారత పర్యటన సందర్భంగా నవంబర్ 01, 2022న ఈ సమావేశం జరిగింది. రెండు దేశాల సైన్యాల మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారంపై ఇరువురు చర్చించారు. రక్షణ సహకారాన్ని పెంచడానికి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలను సమీక్షించారు.

ఆర్‌బీఏ సీవోవోగా 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు లెఫ్టినెంట్ జనరల్ బటూ షెరింగ్‌ను రక్షణ కార్యదర్శి అభినందించారు. భారతీయ సైనిక శిక్షణ బృందంతో సానుకూల బంధంపై లెఫ్టినెంట్ జనరల్ బటూ షెరింగ్ సంతోషం వ్యక్తం చేశారు. భూటాన్ రక్షణ కోసం భారతీయ సైనిక శిక్షణ బృందం 1962 నుంచి అందిస్తున్న సహకారాన్ని గుర్తు చేసుకున్నారు.

భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్‌ చుక్‌ ప్రారంభించిన జాతీయ సేవ కార్యక్రమాన్ని (గ్యాల్‌సంగ్) శ్రీ గిరిధర్ అరమణే ప్రశంసించారు. యువత నైపుణ్యాభివృద్ధి కోసం భారత్‌-భూటాన్‌ సహకరించుకోగల అవకాశాలపై ఆయన చర్చించారు.

చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్‌కు హాజరైనందుకు లెఫ్టినెంట్ జనరల్ బటూ షెరింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత్‌, భూటాన్ మధ్య బలమైన స్నేహబంధాన్ని కొనసాగించేందుకు భారత రక్షణ శాఖ కార్యదర్శి, ఆర్‌బీఏ సీవోవో పరస్పరం అంగీకరించారు. బంధుత్వం, స్నేహాన్ని కొనసాగించడానికి ఇరుపక్షాల నిబద్ధతను బలంగా వెల్లడించారు.

***


(రిలీజ్ ఐడి: 1873458) సందర్శకుల సూచీ సంఖ్య : : 173
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil