రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
కేరళలో కూలిన నిర్మాణంలో ఉన్న అండర్ పాస్ వంతెన, తప్పిన ప్రాణనష్టం
Posted On:
30 OCT 2022 4:39PM by PIB Hyderabad
కేరళలో, 66వ నంబర్ జాతీయ రహదారిలోని చెంగాల-నీలేశ్వరం సెక్షన్‌లో నిర్మాణంలో ఉన్న వాహన అండర్ పాస్ (వీయూపీ) డెక్ స్లాబ్ కూలిపోయింది. 29 అక్టోబర్ 2022 (శనివారం) తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. వాహన అండర్‌పాస్ డెక్ స్లాబ్ నిర్మాణం కోసం కాంక్రీట్ పనులు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి, ప్రాణనష్టం లేదు.
కాంక్రీట్ పనులు చేయడానికి నిర్మించిన పరంజా విఫలం కావడంతో స్లాబ్ కూలిపోయిందని ప్రాథమికంగా తేల్చారు. ప్రమాద పూర్తి కారణాలను నిర్ధరించడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్‌కల్, కాలికట్ ఆచార్యులతో ఒక నిపుణుల కమిటీని జాతీయ రహదారుల అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) నియమించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు, సంస్కరణలను ఈ కమిటీ సూచించనుంది.
నిర్మాణ పనుల్లో అత్యున్నత ప్రమాణాలను పాటించేందుకు జాతీయ రహదారుల అథారిటీ కట్టుబడి ఉంది. హైవేల అభివృద్ధిలో లోపాలు జరక్కుండా జాతీయ రహదారుల అథారిటీ ఒక కఠినమైన విధానాన్ని అనుసరిస్తోంది. నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు/కన్సల్టెంట్లు, సంస్థల వల్ల వంతెనలు/నిర్మాణాలు/నిర్మాణానికి సంబంధించిన విధానాల్లో ఏవైనా లోపాలు జరిగితే బాధ్యులైన సంస్థ/సిబ్బందిపై జరిమానా చర్యలు తీసుకుంటుంది.
****
(Release ID: 1872115)