పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఎన్.సి.ఆర్. పరిధిలో క్షీణిస్తున్న గాలి నాణ్యత సి.ఎ.క్యు.ఎం. ఎమర్జెన్సీ భేటీ!
నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై
కఠిన నిషేధం అమలు చేయాలని ఆదేశం..
ఆమోదించినవి కాకుండా, ఇతర ఇంధనాలను
ఉపయోగించే పరిశ్రమలపై ఆంక్షల విధింపు..
ప్రజా రవాణాను ఉపయోగించాలని,..
బహిరంగ దహనాన్ని నివారించాలని
పౌరులకు సి.ఎ.క్యు.ఎం. సూచనలు
Posted On:
29 OCT 2022 5:37PM by PIB Hyderabad
జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్.సి.ఆర్.)లో దిగజారుతున్న గాలి నాణ్యత సమస్య పరిష్కరించడానికి గాలి నాణ్యతా నిర్వహణా కమిషన్ (సి.ఎ.క్యు.ఎం.)కి చెందిన ఉపకమిటీ ఈ రోజు అత్యవసర సమావేశం జరిపింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జి.ఆర్.ఎ.పి.) కింద ఈ అత్యవసర సమావేశం నిర్వహించారు. దేశరాజధాని, దాని పరిసరప్రాంతాల్లో గాలి నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు ఈ కమిషన్ ఏర్పాటైంది. కాగా, అత్యవసర సమావేశంలో ఎన్.సి.ఆర్. పరిధిలో ఆవరించిన మొత్తం గాలి నాణ్యత ప్రమాణాలపై సమీక్ష జరిగింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలి వేగం తక్కువగా ఉండటం, వ్యవసాయ వ్యర్థాల దహనాలు ఆకస్మికంగా పెరగడం తదితర కారణాలతో ఎన్.సి.ఆర్. పరిధి అంతటా కాలుష్య నివారణకు సంబంధించి తక్షణమే జి.ఆర్.ఎ.పి. 3వ దశ ప్రక్రియను అమలు చేయడం అవసరమని ఈ సమావేశం అభిప్రాయపడింది.
క్రియాశీలక నమూనా, వాతావరణ గమనం, వాతావరణ విభాగం సూచనల ప్రకారం, ఢిల్లీలో మొత్తం గాలి నాణ్యత 2022 అక్టోబరు 29, 30 తేదీల్లో చాలా అధ్వాన్న స్థాయినుంచి తీవ్రస్థాయికి తగ్గిపోయే ఆస్కారం ఉందని, గాలి నాణ్యత మరింత క్షీణించి, అక్టోబరు 31నుంచి నవంబరు 1వ తేదీ వరకూ మరింత తీవ్రమైన విషమస్థాయికి చేరే అవకాశం ఉందని సమావేశం అభిప్రాయపడింది. ఆ తరువాత తదుపరి 6 రోజుల వరకు, గాలి నాణ్యత తీవ్రమైన స్థాయి నుంచి మరీ విషమస్థాయి వరకూ మారుతూ హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం ఉందని కూడా సమావేశం అంచనా వేసింది. రాబోయే రోజుల్లో గాలులు ప్రశాంతంగా ఉంటాయని, గాలి దిశ తరచుగా గమనం మార్చే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. దీనితో పలు వాయు కాలుష్య కారకాలు చెల్లాచెదురు కాకుండా ఎన్.సి.ఆర్. ప్రాంతంలోనే చిక్కుబడి, పేరుకుపోయే అవకాశం ఉందని కూడా ఉపకమిటీ తన సమావేశంలో అభిప్రాయపడింది. దేశరాజధాని, పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత దృష్టాంతాన్ని ఉప కమిటీ కూలంకషంగా సమీక్షించింది. రాబోయే రోజుల్లో గాలిలో నాణ్యత ప్రమాణాలు మరింత తగ్గిపోయే అవకాశం ఉందని, ఢిల్లీ-ఎన్.సి.ఆర్. ప్రాంతంలో గాలి నాణ్యతా సూచిని (ఎ.క్యు.ఐ.ని) పరిష్కరించే కృషిలో భాగంగా జి.ఆర్.ఎ.పి. 3వ దశ కింద నిర్దేశించిన చర్యలన్నీ అమలు చేయాలని ఉప-కమిటీ ఈరోజు సూచించింది.
- 'తీవ్రమైన' గాలి నాణ్యతా ప్రమాణాల సూచి (ఢిల్లీలో ఎ.క్యు.ఐ. 401-450 మధ్య ఉంటుంది), ఈ రోజు ఎన్.సి.ఆర్. పరిధి అంతటా తక్షణమే అమలులోకి వచ్చినట్టుగా పరిగణిస్తారు. జి.ఆర్.ఎ.పి. మొదటి దశ, 2వ దశలో పేర్కొన్న నిర్బంధ చర్యలకు, ఆంక్షలకు తోడుగా ఈ తాజా చర్యలను కూడా చేపడతారు. జి.ఆర్.ఎ.పి. కింద చర్యలను అమలు చేయాల్సిందిగా వివిధ బాధ్యతాయుత సంస్థలకు, ఎన్.సి.ఆర్., ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపి.సి.సి.)కి సంబంధించిన సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి తోడు, జి.ఆర్.ఎ.పి.ని అమలు చేయడంలో సహకరించాలని, జి.ఆర్.ఎ.పి. కింద సిటిజన్ చార్టర్‌లో పేర్కొన్న దశలను అనుసరించాలని ఎన్.సి.ఆర్. పరిధిలోని పౌరులకు కూడా సి.ఎ.క్యుఎం. విజ్ఞప్తి చేస్తోంది. పౌరులు ఈ దిగువన పేర్కొన్న సూచనలను పాటించాలని కమిషన్ సూచించింది:
- కాలుష్యానికి దారితీయని కాస్త మెరుగైన ప్రయాణాన్ని ఎంచుకోండి – పనిప్రదేశానికి వెళ్లేందుకు ఇతరులతో కలసి వాహనాన్ని పంచుకోవడానికి, లేదా ప్రజా రవాణాను ఉపయోగించడానికి, నడక లేదా సైకిల్‌ని ఉపయోగించడానికి ప్రయత్నించండి.
- ఇంటి నుండి పని చేయడానికి (వర్క్ ఫ్రం హోమ్ పద్ధతికి) అనుమతి ఉంటే అలాంటి వారు ఇంటినుంచి పనిచేయవచ్చు.
- ఏదైనా వేడి చేయడానికి బొగ్గు,ను, కలపను ఉపయోగించవద్దు.
- సొంత ఇళ్లున్నగృహ యజమానులు శీతాకాలంలో తమ సెక్యూరిటీ సిబ్బంది ఆరుబయలు చలిమంటలు వేయకుండా నివారించేందుకు వారికి ఎలక్ట్రిక్ హీటర్‌లను ఏర్పాటు చేయవచ్చు.
- బయటకు వెళ్లేటపుడు పనులను కలుపుకోండి. ప్రయాణాలను తగ్గించండి. సాధ్యమైతే పని ప్రదేశాలకు కాలినడకన వెళ్లండి.
అంతే కాకుండా, జి.ఆర్.ఎ.పి. 3వదశ ప్రకారం ఎన్.సి.ఆర్. ప్రాంతం అంతటా 9-సూత్రాల కార్యాచరణ ప్రణాళిక నేటి నుండి తక్షణమే అమలులోకి వచ్చినట్టు పరిగణిస్తారు. . ఈ 9-సూత్రాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఎన్.సి.ఆర్.కు చెందిన సంస్థలు, డి.పి.సి.సి. వంటి కాలుష్య నియంత్రణ బోర్డ్‌లు పలు దశల్లో అమలు చేయాల్సిన చర్యలు అనేకం ఉన్నాయి. ఈ దశలు:
- మెకానైజ్డ్/వాక్యూమ్ ఆధారితంగా రోడ్లను ఊడ్చే ప్రక్రియను తీవ్రతరం చేయడం.
- ముఖ్యమైన ప్రదేశాల్లో, రద్దీ ప్రాంతాల్లో వాహనరద్దీ సమయానికి ముందు, దుమ్మును అణచివేసే పదార్థాల వాడకంతో పాటు రోజువారీగా నీటిని చిమ్మడం. వివిధ ప్రాంతాల్లో, నిర్దేశించిన స్థలాల్లో/పల్లపు ప్రదేశాల్లో సేకరించిన దుమ్మును సక్రమంగా పారవేయడం
- రహదారులపై ప్రజా రవాణా సేవలను తీవ్రతరం చేయడం. వాహన రద్దీలేని సమయంలో పౌరుల ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ప్రయాణ చార్జీల్లో తేడాలను అమలు చేయడం
- నిర్మాణం & కూల్చివేత కార్యకలాపాలు:
- కొన్ని మినహాయింపులతో మొత్తం ఎన్.సి.ఆర్. పరిధిలో నిర్మాణ కార్యకలాపాలపై, కూల్చివేత పనులపై కఠినమైన నిషేధం అమలు చేయండి. అయితే ఈ దిగువ పనులకు సంబంధించి నిషేధాన్ని మినహాయించండి:
ఎ. రైల్వే సేవలు / రైల్వే స్టేషన్లు స్టేషన్లు.
బి. మెట్రో రైలు సేవలు.
సి. విమానాశ్రయాలు మరియు ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్స్.
డి. జాతీయ భద్రత/ రక్షణ సంబంధిత కార్యకలాపాలు/జాతీయ ప్రాముఖ్యతా ప్రాజెక్టులు;
ఇ.. ఆసుపత్రులు/ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు.
ఎఫ్. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఓవర్ బ్రిడ్జిలు, పవర్ ట్రాన్స్‌మిషన్, పైప్‌లైన్‌లు వంటి లీనియర్ పబ్లిక్ ప్రాజెక్ట్‌లు.
జి. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, నీటి సరఫరా పథకాలు మొదలైన పారిశుద్ధ్యవిభాగం ప్రాజెక్టులు;
హెచ్. పైన ఉదహరించిన ప్రాజెక్టులకు అనుబంధంగా ఉండే కార్యకలాపాలు, పనులు.
గమనిక: నిర్మాణ కార్యకలాపాల, కూల్చివేతల వ్యర్థాల నిర్వహణా నియమాలు, ధూళి నివారణ/నియంత్రణ నిబంధనలను ఖచ్చితంగా పాటించడంతోపాటుగా ఈ విషయంలో ఎప్పటికప్పుడు జారీ అయ్యే కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఉంటేనే, పైన పేర్కొన్న మినహాయింపులు అమలవుతాయి.
(i) కింద మినహాయింపు ఉన్న ప్రాజెక్ట్‌లు కాకుండా, (ii) మిగిలిన ప్రాజెక్టులు, అంటే, ధూళిని ఉత్పత్తి చేయడం/వాయు కాలుష్యం కలిగించే నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలు ఉంటే, వాటిపై ఈ కాలంలో ఖచ్చితంగా నిషేధం ఉంటుంది.
ఎ. బోరింగ్ వేయడం, డ్రిల్లింగ్ పనులతో సహా తవ్వకం, మట్టి నింపడం,.. తదితర మట్టి పనులు.
బి. ఫ్యాబ్రికేషన్ , వెల్డింగ్ కార్యకలాపాలతో సహా అన్ని నిర్మాణ పనులు.
సి. కూల్చివేత పనులు.
డి. ప్రాజెక్ట్ స్థలాల్లో లేదా వెలుపల, జరిగే నిర్మాణ సామగ్రి లోడింగ్, అన్‌లోడింగ్ పనులు.
ఇ. ఫ్లై యాష్ తదితర ముడి పదార్థాలను మాన్యువల్‌గా లేదా కన్వేయర్ బెల్టుల ద్వారా మరోచోటికి బదిలీ చేయడం.
ఎఫ్. ఎప్పుడూ ఉపయోగించని గతుకులరోడ్డుపై వాహనాల కదలిక
జి. కాంక్రీట్ తయారీ యంత్రాన్ని నడపడం.
హెచ్. నేలను తవ్వడం ద్వారా మురుగు నీటి పారుదల లైన్, వాటర్‌లైన్, డ్రైనేజీ పని,.. విద్యుత్ కేబుల్స్ వేయడం.
ఐ. టైల్స్, రాళ్ళు, ఇతర ఫ్లోరింగ్ సామగ్రిని కోసివేయడం, అమర్చడం.
జె. గ్రౌండింగ్ కార్యకలాపాలు.
కె. పైలింగ్ పని.
వాటర్ ప్రూఫింగ్ పని.
కాలిబాటలు/ మార్గాలతో సహా అన్ని రకాల రోడ్డు నిర్మాణం పనులు/ మరమ్మతు కార్యకలాపాలు.
- ఎన్.సి.ఆర్. పరిధిలో కాలుష్య రహితమైన /దుమ్మును రేగడానికి ఆస్కారం లేని కార్యకలాపాలను అంటే, నిర్మాణ ప్రాజెక్టుల కోసం జరిగే, ప్లంబింగ్ పనులు, ఇంటీరియర్ డెకరేషన్, ఎలక్ట్రికల్ పనులు మరియు వడ్రంగి సంబంధిత పనుల కొనసాగింపునకు అనుమతిస్తారు.
- పారిశ్రామిక కార్యకలాపాలు
ఎ. పెట్రోలియం, ఖనిజవాయువుల. మౌలిక సదుపాయాలు మరియు సరఫరా ఉన్న పారిశ్రామిక ప్రాంతాల కోసం:
ఎన్.సి.ఆర్. ప్రాంతం కోసం ఆమోదం పొందిన ప్రామాణిక జాబితాలో పేర్కొన్న ఇంధనాలను వినియోగించని పరిశ్రమలను/పారిశ్రామిక కార్యకలాపాలను మూసివేయడం/నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయడం.
బి. పెట్రోలియం ఖనిజవాయువుల మౌలిక సదుపాయాలు, సరఫరా లేని పారిశ్రామిక ప్రాంతాల కోసం:
ఎన్‌సిఆర్ కోసం ఆమోదించబడిన ఇంధనాల ప్రామాణిక జాబితా ప్రకారం ఇంధనాలను ఉపయోగించని పరిశ్రమల కార్యకలాపాలపై నియంత్రించండి, వాటిని వారానికి గరిష్టంగా 5 రోజులు మాత్రమే పనిచేయడానికి అనుమతించడం (31.12.2022 వరకు):
(i) పేపర్, కలపగుజ్జు ప్రాసెసింగ్, డిస్టిలరీలు- క్యాప్టివ్ థర్మల్ పవర్ ప్లాంట్లు. – శని, ఆదివారాల్లో పనిచేయకుండా ఉంటాయి.
(ii) వడ్లు/బియ్యం ప్రాసెసింగ్ యూనిట్లు - సోమ, మంగళవారాల్లో పనిచేయవు.
(iii) అద్దకం ప్రక్రియలతో సహా వస్త్రాలు/వస్త్రాలు మరియు దుస్తులు - బుధవారాలు మరియు గురువారాల్లో పనిచేయవు.
(iv) పైన పేర్కొన్న కేటగిరీల పరిధిలోకి రాని ఇతర పరిశ్రమలు - శుక్రవారాలు మరియు శనివారాల్లో పనిచేయవు.
సి. ఎన్‌సిఆర్ కోసం ఆమోదం పొందిన ప్రామాణిక జాబితా పేర్కొన్నట్టుగా ఇంధనాలను వాడని పరిశ్రమలపై/పారిశ్రామిక కార్యకలాపాలపై ఎన్.సి.ఆర్. పరిధి అంతటా 2023 జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చేలా, మూసివేత/నిషేధాలను కచ్చితంగా అమలు చేయండి.
గమనిక: పాలు, పాల ఉత్పత్తుల యూనిట్లు, ప్రాణ రక్షణ వైద్య పరికరాలు/సామగ్రి, మందులు- ఔషధాల తయారీలో పాలుపంచుకున్న సంస్థలకు పైన పేర్కొన్న పరిమితులు, నిషేధం నుండి మినహాయింపు ఉంటుంది.
- ఎన్.సి.ఆర్. కోసం ఆమోదించిన ఇంధనాల ప్రామాణిక జాబితాలో పేర్కొన్నట్టుగా ఇంధనాలను వాడని ఇటుక బట్టీలు, హాట్ మిక్స్ ప్లాంట్లు మూసివేయండి.
- స్టోన్ క్రషర్ల కార్యకలాపాలను మూసివేయండి.
- ఎన్.సి.ఆర్. పరిధిలో గనుల తవ్వకం, తదితర అనుబంధ కార్యకలాపాలను నిషేధించడం / మూసివేయడం.
- బి.ఎస్. 3 పెట్రోల్, బి.ఎస్. 4 డీజిల్ తేలిక రకం మోటారు వాహనాలపై (4 వీలర్స్‌పై) ఎన్.సి.ఆర్. పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ రాజధాని పరిధిలోని ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలను విధించవచ్చు.
సవరించిన జి.ఆర్.ఎ.పి. షెడ్యూల్‌ను, కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. caqm.nic.in అనే లింక్ ద్వారా ఈ షెడ్యూల్‌ను చూడవచ్చు.
****
(Release ID: 1872036)
Visitor Counter : 171