సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెబుతున్న విధంగా @2047 భారతదేశం నిర్మాణాన్ని కొత్త యువ ఓటర్లు శాసిస్తారు .. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో కొత్త మరియు యువ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
26 OCT 2022 5:33PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెబుతున్న విధంగా @2047 భారతదేశం నిర్మాణాన్ని కొత్త యువ ఓటర్లు శాసిస్తారని కేంద్ర (స్వతంత్ర బాధ్యత)శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్ర, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశాస్త్రం, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్‌లో కొత్త మరియు యువ ఓటర్లను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఓటర్లలో 18-30 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న దాదాపు 55 మిలియన్ల మంది యువకులు మరియు మహిళలు ఉన్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య దాదాపు 37% వరకు ఉందని అన్నారు.
10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల రోజ్‌గార్ మేళా ప్రారంభించారని యువ ఓటర్లకు డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉద్యోగాలు పొందిన 75,000 మందికి నియామక పత్రాలు అందించారని అన్నారు. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించడం దాదాపు అసాధ్యమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పరిస్థితిని గుర్తించి యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా అంకుర సంస్థలు, ఇతర వ్యవస్థాపక మార్గాలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు.
ఎక్కువ ఉపాధి అవకాశాలు అందించే వ్యవసాయ, ప్రైవేటు రంగం, ఎంఎస్ఎంఈ వంటి రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి సూచించారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించేందుకు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. పరిశ్రమల అవసరాలు దృష్టిలో ఉంచుకుని శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇంతవరకు దేశవ్యాప్తంగా 1.25 కోట్ల మందికి వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత విధానాల వల్ల దేశంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. సరళీకృత డ్రోన్ విధానం అమలు, అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు రంగానికి అందుబాటులోకి తేవడం, ముద్ర యోజన కింద అందించిన 20 లక్షల కోట్ల విలువ చేసే రుణాల వల్ల యువతకి అపారమైన కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వివరించారు.
2014 లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యువశక్తి అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.“ 2018 జనవరి 1 సాధారణ రోజు కాదు. ఈ దశాబ్దంలో జన్మించిన వారు 18 వ సంవత్సరంలోకి అడుగుపెడతారు. వీరి జీవితాల్లో 2018 నిర్ణయాత్మక సంవత్సరంగా ఉంటుంది. 21వ శతాబ్దంలో మన దేశ విధి (భాగ్య విధాత) సృష్టికర్తలు కాబోతున్నారు. నేను ఈ యువకులందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను, వారిని గుర్తించి వారికి నా నివాళులర్పిస్తున్నాను. మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం మీకు ఉంది. గర్వించదగిన దేశం దాని అభివృద్ధి ప్రయాణంలో భాగం కావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తుంది”. అంటూ 2017 ఆగస్టు 15 వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు.
2019 ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొత్తగా 133 మిలియన్ మంది ప్రజలు హక్కు పొందారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారిలో 70 మిలియన్ల మంది యువకులు మరియు 63 మిలియన్ల మంది యువతులు ఉన్నారని అన్నారు. 72% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు అని మంత్రి వివరించారు. 2024 నాటికి 140 మిలియన్ మంది కొత్తగా ఓటు హక్కు పొందే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. భారతదేశ భౌగోళిక పరిస్థితి వల్ల అందుబాటులోకి వచ్చే అవకాశం వృధాగా పోకూడదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ఓటు వేసే 18 సంవత్సరాలు.వయస్సు వచ్చే వరకు వేచి ఉండకుండా 17 ఏళ్లు పైబడిన వారు ఓటర్ల జాబితాలో చేరేందుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం ఈ ఏడాది జూలైలో ప్రకటించిన విషయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ యువతకు, పరిపాలన యంత్రాంగానికి గుర్తు చేశారు.
కేవలం జనవరి 1 మాత్రమే కాకుండా ఏప్రిల్ 1, జూలై 1 మరియు అక్టోబర్ 1వ తేదీల్లో మూడు తదుపరి అర్హత తేదీలకు సంబంధించి యువత తమ ముందస్తు దరఖాస్తు దాఖలు చేయడానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలు రూపొందించాలని ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు మరియు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించింది. ఏడాదిలో 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు పొందేందుకు ఎన్నికల సంఘం అమలు చేస్తున్న విధానాలు దోహదపడతాయని మంత్రి చెప్పారు, దీని కోసం ఇటీవల త్రైమాసిక ఓటర్ల నమోదును అనుమతించడానికి సవరణలు చేయబడ్డాయి.
"డబుల్ ఇంజన్ సర్కార్" అభివృద్ధి కార్యక్రమాలు మరియు విజయాల గురించి యువతకు అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం మరియు యుపి ప్రభుత్వం సంయుక్తంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలల్లో 'యువ విజయ్ సంకల్ప్ ర్యాలీ' ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. .
***
(Release ID: 1871099)
Visitor Counter : 159