గనుల మంత్రిత్వ శాఖ
కేంద్ర గనుల శాఖలో కొత్తగా ఉద్యోగాలు పొందిన 88 మందికి నియామక పత్రాలు అందజేసిన ప్రధాన మంత్రి
Posted On:
22 OCT 2022 4:09PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోజ్‌గార్ మేళాలో భాగంగా, తొలి విడతలో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా శనివారం (2022 అక్టోబరు 22) పంపిన నియామక పత్రాలను కేంద్ర గనుల శాఖలో కొత్తగా ఉద్యోగాలు పొందిన 88 మంది అభ్యర్థులు అందుకున్నారు. గనుల మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు పొందిన 88 మంది అభ్యర్థులకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన రోజ్‌గార్ మేళాల్లో కేంద్ర మంత్రులు నియామక పత్రాలను అందజేశారు. ఖాళీలన్నింటినీ భర్తీ చేయడానికి దీని ద్వారా ఒక ముందడుగు పడింది.
కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 10 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని ప్రధాన మంత్రి చేసిన ప్రకటన ప్రకారం, అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు యుద్ధ ప్రాతిపదికన అన్ని ఖాళీలను భర్తీ చేయాలి. 2022 జులైలో మొదలైన ఈ ప్రక్రియను ఆయా మంత్రిత్వ శాఖలు/విభాగాలు 2023 డిసెంబర్‌లోగా ముగించాలి.
గనుల మంత్రిత్వ శాఖలో మొత్తం 4,673 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. నేరుగా, పదోన్నతుల ద్వారా వీటిని భర్తీ చేస్తారు. 2022 జులైలో నియామకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన గనుల మంత్రిత్వ శాఖ, 2022 సెప్టెంబర్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఇప్పటికే 127 నియామక పత్రాలను జారీ చేసింది.
ద్వైమాసిక ప్రాతిపదికన 'యూనిఫైడ్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఇష్యూయన్స్' ద్వారా నియామక పత్రాలను జారీ చేయాలని ఇప్పుడు నిర్ణయించారు.
తాజాగా ఇచ్చిన పత్రాలతో కలిపి, నియామక కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి గనుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మొత్తం నియామక పత్రాల సంఖ్య 215కి చేరుకుంది. అన్ని ఖాళీలను 2023 డిసెంబర్ నాటికి భర్తీ చేసే కార్యాచరణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ చేతిలో ఉంది.
******
(Release ID: 1870362)
Visitor Counter : 222