పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

సులభతర వాణిజ్య నిర్వహణలాగే సుఖమయ జీవనం కూడా ముఖ్యం


సుస్థిర పర్వతాభివృద్ధి శిఖరాగ్ర సదస్సు
ప్రారంభోత్సవ సమావేశంలో
కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ప్రసంగం..

పర్యావరణహిత జీవనశైలిపై
ప్రధాని దార్శనికతను ప్రస్తావించిన మంత్రి..

పర్యావరణహితమైన, బాధ్యాతాయుతమైన
పర్యాటకానికి స్థానికుల భాగస్వామ్యం
ఎంతో కీలకమని వ్యాఖ్య..

స్థానిక భాగస్వామ్య వర్గాలకు అవగాహన, శిక్షణకోసం
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖనుంచి
లడఖ్ పాలనా యంత్రానికి తగిన మద్దతు..

సౌరశక్తికి ప్రోత్సాహం కోసం
“ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒకే గ్రిడ్” అన్న
పి.ఎం. భావనను ప్రధానంగా ప్రస్తావించిన
భూపేందర్ యాదవ్

Posted On: 10 OCT 2022 5:14PM by PIB Hyderabad

     కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లోని లేహ్‌లో అక్టోబరు 10నుంచి 12వరకూ జరుగుతున్న  11వ సుస్థిర పర్వతాభివృద్ధి శిఖరాగ్ర సదస్సు, (ఎస్.ఎం.డి.ఎస్.-11) ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్  హాజరయ్యారు. 'సుస్థిర పర్వతాభివృద్ధి కోసం పర్యాటకాన్ని వినియోగించుకోవడం' అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తున్నారు. వాతావరణం సామాజిక-పర్యావరణ, సుస్థిరత సాధనలో పర్యాటక రంగం సహకారాన్ని సానుకూలంగా ఉపయోగించుకోవడం, పర్యావరణంపై పర్యాటక రంగం ప్రతికూల ప్రభావాలను తగ్గించడం వంటి అంశాలపై ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.

 

https://ci3.googleusercontent.com/proxy/NxZwf5gDC60Fk1hVMQ-iUW94xIGtcT3kbjzVGad_FzpWgf_NJpl5AFA1vwCy7noUWIqq88_Xu4iEau1SK-qLAIiw9R5OzEz8AN6-pqyFZ1lV5YQaV81SdxWxTg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WTQ6.jpg

 

https://ci5.googleusercontent.com/proxy/PtNBsmYdB4rb2sV2WdZoH1ssAhLbI1Cw-IGDKoI8CtMWfl2I0VvaShUdWG_znq5NsE1btyb9qSzc_XBTThR7dEGR6fNG0_u26QKztp-JDaIQy_5UnRhfc1xwGA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002R5JH.jpg

శిఖరాగ్ర సదస్సు ప్రారంభ సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ,  లడఖ్‌లోని అందమైన ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన పర్వతాల కారణంగా ఆ ప్రాంతాన్ని ఎప్పుడు సందర్శించినా  ఆ అనుభవం తాజాగా, నూతనంగా అనిపిస్తుందన్నారు. వైజ్ఞానిక శాస్త్రం, విధానాల ఏకీకరణ అనేది భారతీయ పర్వతారోహణ సంస్థ (ఐ.ఎం.ఐ.) యొక్క ప్రధాన కార్యక్రమం కావాలని అన్నారు.  వివిధ సంస్కృతుల, పరిసర పర్యావరణాల  ప్రత్యేకతలను ఏకీకృతం చేయడమే ఇలాంటి శిఖరాగ్స సదస్సుల ప్రధానాంశం కావాలని ఆయన సూచించారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పండిత గోవింద్ వల్లభ్ పంత్ జాతీయ హిమాలయ పర్యావరణ అధ్యయన సంస్థ (జి.బి.పి.ఎన్.ఐ.హెచ్.ఇ.) ఏర్పాటును, లేహ్ నగరంలో ఈ సంస్థ అనుబంధంగా ప్రాంతీయ కేంద్రం ఏర్పాటును ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. హిమాలయ పర్యావరణం మనుగడ లక్ష్యంగా పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలను ఈ సంస్థ తప్పనిసరిగా నిర్వహించేలా మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. హిమాలయాలు, పశ్చిమ కనుమలు, థార్ ఎడారి వంటి వివిధ ప్రత్యేక ప్రకృతి దృశ్యాలపై వైజ్ఞానిక, శాస్త్రీయ సమాజం ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. యువత సామర్థ్యాన్ని పెంపొందించడం అనేది ఈ కార్యక్రమంలో మరొక ముఖ్యమైన అంశమని అన్నారు. తద్వారా, కేవలం ఉపాధి కోసం అక్షరాస్యత అన్న అంశంపై మాత్రమే కాకుండా స్థానిక సంస్కృతి పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, యువతలో శాస్త్రీయ సమగ్రతను పెంపొందించడంపై వంటి విషయాలపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జి.బి.పి.ఎన్.ఐ.హెచ్.ఇ., జెడ్.ఎస్.ఐ., బి.ఎస్.ఐ., డబ్ల్యు.ఐ.ఐ. వంటి పరిశోధనా, అభివృద్ధి సంస్థలు అనేక అంశాలపై విస్తృత పరిశోధన, అధ్యయనం నిర్వహిస్తూ వస్తున్నాయన్నారు. వేగవంతమైన ఉత్పత్తికోసం మొక్కల జన్యుశాస్త్రం, భారతీయ వృక్షజాలం, జంతుజాలం ​​లెక్కల డిజిటలీకరణ, పర్యావరణ సంబంధమైన పొరపాట్లను సరిదిద్దడానికి దేశంలో చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడం వంటి పలు రకాల అంశాలపై ఈ సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయన్నారు.

  దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఆర్థిక అక్షరాస్యత, సమగ్రమైన సామర్థ్యాల నిర్మాణం లక్ష్యంగా స్కిల్ ఇండియా వంటి పథకాలు, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్, ఇ-శ్రమ్ పోర్టల్, ఉద్యమి, అసీమ్ (ఎ.ఎస్.ఇ.ఇ.ఎం.) తదితర పోర్టల్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌ ఇప్పటికే కోటి మంది దరఖాస్తుదారులను 10 లక్షల మంది యజమాన్య సంస్థలను కలిగి ఉందన్నారు. ఇప్పటివరకూ ఈ  పోర్టల్ 4.28 లక్షల ఉపాధి అవకాశాలను అందించిందని, ఇప్పటివరకు ఇదే అతిపెద్ద పోర్టల్. మరింత సామర్థ్యంతో ఈ పోర్టల్‌ను నవీకరిస్తున్నారని అన్నారు. సులభతర వాణిజ్య నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ఎంత ముఖ్యమో, సౌకర్యవంతమైన జీవనం కూడా మనకు అంతే ముఖ్యమని, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ లక్ష్యంకోసమే పనిచేస్తోందని భూపేందర్ యాదవ్ చెప్పారు. పర్యావరణహితమైన జీవన శైలిని ప్రపంచం యావత్తూ అనుసరించాలని గ్లాస్గో నగరంలో జరిగిన వాతావరణ సదస్సు (కాప్-26 సదస్సు)లో ప్రధానమంత్రి పిలుపునిచ్చారని ఆయన గుర్తుచేశారు. వనరులను విచక్షణారహిత వినియోగాన్ని కాక వివేచనతో కూడుకున్న వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఇటువంటి ప్రక్రియలకు సంబంధించిన భావనలు మన సంస్కృతీ,  సంప్రదాయాలలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. దుర్గమమైన హిమాలయ పర్వత ప్రాంతాల్లో కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య నివసించే ప్రజలు ఇలాంటి విలువలను కలిగి ఉంటారని, ఈ ప్రాంతం పర్యాటకానికి మాత్రమే కాకుండా సాంస్కృతిక సామరస్యానికి కూడా ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఒత్తిడి, నిరాశా నిస్పృహలు,  ఆందోళనతో నిండిన ఈ ప్రపంచంలో శాంతికి చిహ్నంగా ఉన్న బౌద్ధ విహారాలు వంటివి మనకు అందుబాటులో ఉన్న సానుకూల అంశాలని ఆయన అన్నారు.  

    పర్యావరణ దౌర్బల్యం, క్రీడలు, పర్వతారోహణ, సైక్లింగ్, శాంతి మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకుని దేశంలో పర్యాటకాన్ని వివిధ కోణాల్లో విస్తరింపజేయాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు.  అడవులు ఆనందానికి మాత్రమే కాదు శాంతికి ముఖ్యమైన మూలాలు అనే తీర్మానాన్ని ఇటీవల అమెరికాలో జరిగిన ప్రపంచ అటవీ సదస్సు ఆమోదించిందన్నారు. హిమాలయ ప్రాంతపు అడవులు ఎన్నో శతాబ్దాలుగా శాంతిని ప్రోత్సహిస్తూ వస్తున్నాయని. ప్రకృతి అన్వేషకులు, యాత్రికులు, ఆధ్యాత్మిక అన్వేషకుల కోసం హిమాలయాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. లడఖ్ లాగానే, హిమాలయాలలోని మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ మొదలైన ఇతర రాష్ట్రాలు కూడా పర్యాటకంలో విలీనం చేయవలసిన ప్రత్యేకతలను కలిగి ఉన్నాయని అన్నారు. పర్యావరణ హితమైన పర్యాటకాన్నిమాత్రమే కాక  బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం కూడా నేటి అవసరమని. అటువంటి కార్యక్రమాలను ఏకీకృతం చేయడానికి పర్యాటకంలో స్థానిక సంఘాల ప్రమేయం చాలా ముఖ్యమని అన్నారు.

   పర్యావరణ హితమైన మన కార్యకలాపాలన్నీ సంవత్సరం పొడవునా కొనసాగుతూ ఉండాలని, విద్యా సంస్థలు అందుకు అనుగుణమైన పాఠ్యాంశాలను కలిగి ఉండడం. సాంస్కృతిక- స్థానిక వారసత్వాన్ని పరిరక్షించడం, లడఖ్ వనరులను రక్షించడం, అపరిష్కృతంగా  ఉన్న అన్ని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక టూరిస్ట్ గైడ్‌ల బాధ్యత గురించి ఇలాంటి శిఖరాగ్ర సమావేశాలలో చర్చిస్తే  అది వారిపై కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందన్నారు. లడఖ్ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడానికి, పరివేష్ పోర్టల్‌లో పొందుపరిచిన వన్యప్రాణులకు సంబంధించిన అన్ని ప్రతిపాదనలు, అప్లికేషన్లను తమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే పరిష్కరించిందన్నారు. అన్ని పర్యావరణ అనుమతులను కేంద్రీకృత పద్ధతిలో ఏకీకృతం చేసేందుకు వీలుగా పరివేష్ పోర్టల్‌ను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అటవీ హక్కులు,  సంబంధిత ఇతర అంశాలపై స్థానిక భాగస్వామ్య వర్గాలకు అవగాహన, శిక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం  లడఖ్ పరిపాలనా యంత్రాగానికి  తమ మంత్రిత్వ శాఖ అన్నిరకాల మద్దతును అందజేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

  పలు రకాల శక్తి వనరులల్లో సౌరశక్తి అనేది అతి విస్తృతమైనదని, సౌరశక్తిని ప్రోత్సహించడానికి మన ప్రధానమంత్రి ప్రపంచవ్యాప్తంగా పలురకాల చర్యలు తీసుకున్నారని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమిని భారతదేశం ప్రారంభించిందని, కూటమిలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 106 మంది సభ్యదేశాలు ఉన్నాయని అన్నారు. "ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒకే గ్రిడ్" అనే భావనను ప్రధానమంత్రి గ్లాస్గో వాతావరణ సదస్సులో ప్రధానంగా ప్రస్తావించారని, ఈ ప్రతిపాదనను  అంతర్జాతీయ సమాజం కూడా ప్రశంసించిందని అన్నారు. వాతావరణ మార్పులతో పరిణమించే నష్టం, సంబంధిత  సమస్యను పరిష్కరించడానికి ప్రకృతి విపత్తుల ప్రతిఘటనా మౌలిక సదుపాయాల సంకీర్ణ కూటమి (సి.డి.ఆర్.ఐ.)ని భారతదేశం ఏర్పాటు చేసిందని, యునైటెడ్ కింగ్‌డమ్‌తో కలసి మనదేశం ఈ కూటమిని ఏర్పాటు చేసిందని అన్నారు.

   ప్రకృతి సుందర దృశ్యాలతో కూడిన సుదూర ప్రాంతాలను అనుసంధానించేందుకు చేపట్టిన అటల్ సొరంగ మార్గం పనులు,  జోజి లా సొరంగం వంటి వాటిని నిర్మించడంతో పర్వత ప్రాంతాల వాతావరణంపై కర్బన ఉద్గారాల ఒత్తిడి తగ్గగలదని కేంద్రమంత్రి తెలియజేశారు. మన దేశానికి సుస్థిర భవిష్యత్తును నిర్ధారించేందుకు సిసలైన, స్ఫూర్తిమంతమైన జీవన సూత్రాన్ని యువత అనుసరించాలని ఆయన సూచించారు. "కర్బన రహితమైన లడఖ్" కోసం ప్రధానమంత్రి కన్న కలలను సాకారంచేయగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. " జాతీయ హితం గురించి ప్రతి వ్యక్తి ఆలోచించినప్పుడు, ప్రతి దేశం ప్రపంచహితాన్ని లక్ష్యంగా చేసుకున్నపుడు, సుస్థిర అభివృద్ధి వాస్తవ రూపం దాల్చుతుంది" అని కేంద్ర మంత్రి తన ముగింపు ప్రసంగంలో ప్రధానమంత్రి వ్యాఖ్యలను ఉటంకించారు.  

   సుస్థిర పర్వతాభివృద్ధి శిఖరాగ్ర సదస్సు  (ఎస్.ఎం.డి.ఎస్.) అనేది భారతీయ పర్వతారోహక అధ్యయన సంస్థ (ఐ.ఎం.ఐ.) నిర్వహించే ప్రధాన వార్షిక కార్యక్రమం. భారతీయ హిమాలయ పర్వత ప్రాంతం (ఐ.హెచ్.ఆర్.) పరిధిలోని 10 పర్వత రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, నాలుగు కొండ ప్రాంతపు జిల్లాలను కలిగి ఉన్న పౌర సమాజం నేతృత్వంలోని వేదికగా ఇది పనిచేస్తోంది. కేంద్ర స్థాయిలో జరిగే ఈ  సదస్సుతో పాటుగా,  పర్వత ప్రాంత శాసనసభ్యుల సమావేశం, భారతీయ హిమాలయ యవజన శిఖరాగ్ర సదస్సును కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు.  

https://ci6.googleusercontent.com/proxy/e5qPz8OBVY4fICcNZlqa2YefjN7ZTQzzXAl0TU4yCoKlu-lYuZWK0IbmhvXVmEomjxTXzxjocfCVQ_cnbACdnUzNflf7Fhnj1Sn3Fw3KVBkH6nqu2zHzqh6o4w=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003V2V6.jpg

 

*****(Release ID: 1866619) Visitor Counter : 165


Read this release in: English , Urdu , Hindi , Punjabi