నౌకారవాణా మంత్రిత్వ శాఖ
దీన్ దయాల్ నౌకాశ్రయంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము.
సరికొత్త అభివృద్ధి బాటలో కాండ్లా దీన్ దయాల్ నౌకాశ్రయం
Posted On:
03 OCT 2022 6:04PM by PIB Hyderabad
గుజరాత్ రాష్ట్రం కాండ్లాలోని దీన్ దయాల్ నౌకాశ్రయం బలోపేతానికిగాను రూ.280 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల కారణంగా నౌకాశ్రయ మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరుగుతాయి. అంతే కాదు కార్యకలాపాల నిర్వహణ బలోపేతమై ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ది పెరుగుతుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయి అమల్లోకి రాగానే ఇక్కడ కార్గో నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. అంతే కాదు సమయం ఆదా అవుతుంది. చాలా తొందరగా నౌకలను ఖాళీ చేయించి అక్కడనుంచి పంపించేయడం జరుగుతుంది.
రూ. 69.51 కోట్ల ఖర్చుతో కార్గో జెట్టీ ప్రదేశంలో కొత్తగా డోమ్ ఆకారంలో గోడౌన్లను నిర్మించడం జరుగుతుంది. దీని కారణంగా మరిన్ని వస్తువులను గోడౌన్లలో వుంచవచ్చు. అధిక విస్తీర్ణ సదుపాయంతో గోడౌన్లు అందుబాటులోకి రావడంవల్ల అధిక మొత్తంలో వస్తువులను తరలించడానికిగాను ఆధునిక వాహనాలను, హైడ్రాలిక్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు.
కార్గో జెట్టీ ప్రాంతంలో 66 హెక్టార్ల విస్తీర్ణంలో రూ. 80 కోట్ల ఖర్చుతో ఆధునీకరణ పనులు చేపడతారు. దీని కారణంగా తుపాను సమయంలో వచ్చే వరద నీటిని సులువుగా తొలగించడం జరుగుతుంది. ఇంకా కాంక్రీట్ రోడ్లను, విద్యుత్‌కేబుల్స్ నిర్వహణ పైపులు, కార్మికులకోసం సదుపాయాలను కల్పిస్తున్నారు.
ఇక మరోప్రాజెక్టును తీసుకుంటే దీని ద్వారా 40 హెక్టార్ల స్థలంలో రూ.47 కోట్లతో ఆధునీకరణ పనులు చేపడతారు. రోడ్లను, వరద నీటినిర్వహణ నీటి పారుదల వ్యవస్థలను తయారు చేసుకుంటారు. కస్టమ్ బాండెడ్ ప్రాంతంలో సదుపాయాలుపెరుగుతాయి. తద్వారా 8.8 లక్షల ఎంటీ సామర్థ్యంగల వస్తువుల రవాణా చాలా సులువుగా జరుగుతుంది.
ప్రస్తుతమున్న ట్యూనా రోడ్డును రెండులేన్ల స్థాయినుంచి నాలుగులేన్లకు తీసుకుపోవడానికిగాను రూ. 87.32 కోట్లను ఖర్చు చేస్తున్నారు. తద్వారా కార్గో వస్తువుల రవాణా సులభతరమవుతుంది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. అంతే కాదు భవిష్యత్తులో పెరిగే కార్యకలాపాలు సులువుగా జరుగుతాయి. అంతే కాదు నౌకాశ్రయానికి జాతీయ రహదారికి మధ్యన కనెక్టివిటీ పెరుగుతంది. గతి శక్తి లక్ష్యాలకు అనుగుణంగా అప్రోచ్ రోడ్లు అభివృద్ధి చెందుతాయి. ప్రతిపాదిత జెట్టీలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి చేకూరుతుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము దీన్ దయాల్ నౌకాశ్రయ విజయాలను ప్రశంసించారు. వస్తు రవాణపరంగా ఈ నౌకాశ్రయం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని దేశవ్యాప్తంగా జరిగే నౌకల వస్తు రవాణాలో 40 శాతం కార్యకలాపాలు దీన్ దయాల్ నౌకాశ్రయంలోనే జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర నౌకా రవాణా శాఖ కృషిని ప్రశంసించారు. దీన్ దయాల్ నౌకాశ్రయంలో కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం అభినందనీయమని అన్నారు.
కేంద్ర నౌకా రవాణా శాఖ కింద పని చేసే దీన్ దయాల్ నౌకాశ్రయం గత ఏడాదితో పోలిస్తే 17.22 శాతం వృద్ధిని సాధించింది. వస్తు రవాణా కార్యకలాపాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. 2021-22 సంవత్సరానికిగాను గతంలో ఎన్నడూ లేని విధంగా 127.1 ఎంఎంటి కార్గో నిర్వహణ చేసింది. ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ ఎప్పటికప్పుడు బలోపేతమవుతూ ఈ నౌకాశ్రయం దేశానికి విశిష్టమైన సేవలందిస్తోంది.
ఇండియాలోని నౌకాశ్రయాలను అభివృద్ధి చేయడానికిగాను కేంద్ర నౌకాశ్రయాలు, నౌకా రవాణా, జల మార్గాల శాఖ చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. సాగరమాలా కార్యక్రమం కింద గుజరాత్ లో రూ. 57 వేల కోట్లతో 74 ప్రాజెక్టులను గుర్తించారు. వీటిలో రూ. 9 వేల కోట్ల విలువయ్యే 15 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. రూ 25 వేల కోట్ల విలువయ్యే 33 ప్రాజెక్టులు అమలు దశలో వున్నాయి. రూ. 22, 700 కోట్ల విలువయ్యే 26 ప్రాజెక్టులు అభివృద్ధి దశలో వున్నాయి.
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా రూ. 1300 కోట్ల విలువయ్యే వివిధ రంగాల ప్రాజెక్టుల నిర్మాణానికి పునాది వేశారు. వీటిలో ఆసుపత్రుల భవన నిర్మాణాలు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, నౌకాశ్రయాలకు సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర బాయి పటేల్ తోపాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు అధికారులు పాల్గొన్నారు.
****
(Release ID: 1865003)
Visitor Counter : 165