రక్షణ మంత్రిత్వ శాఖ
అగ్నివీర్స్ చెల్లింపు వ్యవస్థ, ‘స్పర్శ్’ మొబైల్ యాప్!
డి.ఎ.డి. 275వ వార్షికోత్సవం సందర్భంగా
పలు కీలక డిజిటల్ కార్యక్రమాలు శ్రీకారం..
లాంఛనంగా ఆవిష్కరించిన రక్షణ మంత్రి రాజనాథ్...
“పనిచేసే ఉద్యోగులకు, రిటైరైన వారికి,
వారి కుటుంబాలకు సేవలందించడానికే మా కృషి”
నాణ్యత, పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారం
తదితర అంశాలకే ప్రాధాన్యం
ఉంటుందన్న కేంద్రమంత్రి..
Posted On:
01 OCT 2022 1:04PM by PIB Hyderabad
న్యూ ఢిల్లీలో రక్షణ ఖాతాల శాఖ (డి.ఎ.డి.) 275వ వార్షికోత్సవాల సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు అనేక డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించారు. కేంద్రమంత్రి ప్రారంభించిన డిజిటల్ కార్యక్రమాల్లో, పెన్షన్ పరిపాలనా వ్యవహారాల వ్యవస్థ (రక్ష) (స్పర్శ్) మొబైల్ యాప్; అగ్నివీరుల చెల్లింపు వ్యవస్థ; రక్షణ ప్రయాణ వ్యవస్థ (డి.టి.ఎస్.)లో అంత్జాతీయ ఎయిర్ టికెట్ బుకింగ్ మాడ్యూల్; రక్షణ ఖాతాల వసూలు, చెల్లింపు వ్యవస్థ (దర్పణ్); రక్షణ పౌర చెల్లింపు వ్యవస్థ-రక్షణ ఖాతాల మానవ వనరుల నిర్వహణా వ్యవస్థ ఉన్నాయి. ఈ సందర్భంగా రక్షణమంత్రి మాట్లాడుతూ,... కొత్త డిజిటల్ కార్యక్రమాలతో రక్షణ శాఖ పనితీరులో పారదర్శకత, సమర్థత పెరుగుతుందని పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన్ని ప్రోత్సహించేందుకు ‘డిజిటల్ ఇండియా’ పేరిట ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం స్ఫూర్తిని ఎంతో శ్రద్ధతో ముందుకు తీసుకెళ్లినందుకు రక్షణ ఖాతాల శాఖను (డి.ఎ.డి.ని) రక్షణమంత్రి ప్రశంసించారు. కీలకమైన శాఖాపరమైన ప్రాజెక్ట్‌లను అమలు చేయడంలో ఆదర్శవంతమైన రీతిలో చొరవను ప్రదర్శించిన మూడు బృందాలకు కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. వారికి రక్షణ మంత్రి ప్రతిభా అవార్డు-2022 పురస్కారాలను కూడా ప్రదానం చేశారు. స్పర్ష్ అభివృద్ధి, పరీక్ష-అమలు; డి.ఆర్.డి.ఒ.-పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ (పి.ఎ.ఒ.) భారతి, ఇ-కాన్‌కరెన్స్ అమలు: యువర్ పి.ఎ.ఒ., కాల్‌అవే 24*7 వంటి కీలకమైన పథకాలను అమలు చేయడంలో చక్కని చొరవను ప్రదర్శించినందుకు గాను ఈ పురస్కరాలను ప్రదానం చేశారు.
స్పర్శ్ మొబైల్ యాప్: పెన్షనర్ అనుసంధానాన్ని ఈ యాప్ నిర్ధారిస్తుంది. పెన్షనర్ల మొబైల్ ఫోన్ల ద్వారా స్పర్శ్ పోర్టల్‌కు సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలను చేరువ చేస్తింది. సాయుధ బలగాల సిబ్బంది పెన్షన్ మంజూరు, పంపిణీకి సంబంధించిన ఆటోమేషన్ కోసం సమగ్ర వ్యవస్థ రూపంలో ఒక పోర్టల్‌ను (https://sparsh.defencepension.gov.in/) రక్షణ మంత్రిత్వ శాఖ అమలులోకి తెచ్చింది. క్లెయిమ్ దశనుంచి, పంపిణీ వరకు పెన్షన్‌కు, సంబంధిత ప్రక్రియలకు ఇది పూర్తి పరిష్కారంగా ఉంటుంది. పెన్షనర్లు ఈ పోర్టల్‌కు లాగిన్ చేసి తమకు సంబంధించిన అన్ని పెన్షన్ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. స్పర్శ్ అనే మొబైల్ యాప్‌ను ఒక మైలురాయిగా రక్షణమంత్రి అభివర్ణించారు. జీవించి ఉన్న సమయంలో సైనికులకు, సేవా విధుల్లో ఉన్న సిబ్బందికి, మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు ఉత్తమ సేవలను అందించడానికే ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఆయన అన్నారు. సరైన సమయంలో సరైన పింఛన్ పంపిణీపై తాము ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. త్వరితగతిన, నాణ్యమైన రీతిలో పెన్షనర్ల ఫిర్యాదులను పరిష్కరించడానికే తొలి ప్రాధాన్యత ఉండేలా చూడాలని రక్షణ మంత్రి డి.ఎ.డి.కి పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి ఎక్కడికక్కడ ఔట్‌రీచ్ కార్యక్రమాలను ‘రక్షా పెన్షన్ సమాధాన్’ను క్రమం తప్పకుండా నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. ఇదే విధంగా వారు నిరంతరం కృషి చేయాలని కోరారు.
అగ్నివీర్ చెల్లింపు వ్యవస్థ: ప్రభుత్వం చేపట్టిన పరివర్తనాత్మకమైన అగ్నిపథ్ పథకం ద్వారా త్వరలో సాయుధ బలగాల్లో చేరనున్న అగ్నివీరులకు వేతన చెల్లింపుల నిర్వహణా ప్రక్రియను సమర్థవంతంగా, సులభతరంగా నిర్వహిస్తుంది. అగ్నివీరుల క్లెయిమ్ ప్రాసెసింగ్, పే-రోల్ నిర్వహణను నిర్ధారించడానికి పూర్తి యాంత్రీకరణ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీతో ఒక ప్రత్యేకమైన, సురక్షితమైన పోర్టల్‌గా ఇది ఉంటుంది. ఇక అగ్నివీరుల కోసం రూపొందించిన కేంద్రీకృత పి.ఎ.ఒ. (ఆర్మీ) వ్యవస్థను కూడా రాజనాథ్ సింగ్ ఢిల్లీ కంటోన్మెంట్‌లో ప్రారంభించారు.
రక్షణ ప్రయాణ వ్యవస్థ: రైలు-విమాన టిక్కెట్ల బుకింగ్ ప్రక్రియనుంచి నగదు రహిత, కాగిత రహిత పద్ధతి వరకు రక్షణ సేవల సిబ్బందికి, పౌరులకు డిఫెన్స్ పోర్టల్‌లో తగిన సేవలను ఈ వ్యవస్థ అందిస్తుంది. ఎయిర్ ఎక్స్ఛేంజ్ వారెంట్ల స్థానంలో రక్షణ సేవల సిబ్బంది విదేశీ ప్రయాణాలకు సంబంధించిన విమాన టిక్కెట్ల బుకింగ్ సదుపాయాన్ని కూడా
అందిస్తుంది. జనరల్ సర్వీస్ లిస్ట్ (జి.ఎస్.ఎల్.) రసీదుకు, టికెట్ బుకింగ్ ప్రక్రియకు మధ్య వ్యవధిలో అంతరాన్ని ఇది తొలగిస్తుంది. ప్రయాణించనున్న సంబంధింత అధికారికి చివరి నిమిషంలో ఎదురయ్యే హడావుడిని నివారిస్తుంది.
దర్పణ్: డిఫెన్స్ అకౌంట్స్ రసీదులు, చెల్లింపు వ్యవస్థ అనేది థర్డ్ పార్టీ బిల్లు చెల్లింపు, అకౌంటింగ్ ప్రక్రియ కోసం రూపొందిన ఏకీకృత పరిష్కారం. వివిధరకాల అకౌంటింగ్ ప్రక్రియలకు, ఆర్థిక పనితీరుకు ఒక సమగ్రస్థాయి పరిష్కారంగా ఇది ఉపయోగపడుతుంది.
రక్షణ చెల్లింపు పౌర వ్యవస్థ: పూర్తిగా ఆధునికీకరించిన కేంద్రీకృత, స్వయంచాలక వ్యవస్థ ద్వారా రక్షణ పౌరులందరికీ వేతనాల పంపిణీని ఈ వ్యవస్థ రూపొందిస్తుంది. రక్షణ ఖాతాల యూనిట్లు, ప్రిన్సిపల్ డిఫెన్స్ అక్కౌంట్స్ కంట్రోల్/సెంట్రల్ డిఫెన్స్ కంట్రోల్ కార్యాలయాలు ఈ వ్యవస్థతో అనుసంధానమై ఉంటాయి. దీనితో ఆయా యూనిట్లు చెల్లింపు ప్రక్రియ తాజా స్థితిని పోర్టల్‌లోనే సరిచూసుకునే అవకాశం ఉంటుంది.
డిఫెన్స్ ఖాతాలు, మానవ వనరుల (హెచ్.ఆర్.) నిర్వహణా వ్యవస్థ:
ఈ అప్లికేషన్ వ్యవస్థ ప్రారంభం కావడంతో డిజిటల్ పరిజ్ఞానంతో పనిచేయగల మానవ వనరుల నిర్వహణా వ్యవస్థలో ఈ శాఖ ప్రవేశించినట్టయింది. ఇ-సర్వీస్ బుక్, లీవ్ మేనేజ్‌మెంట్, పే రోల్ జనరేషన్, ప్రమోషన్ వివరాలు వంటి పలు స్వయంసేవక మాడ్యూల్స్‌ను ఈ ప్లాట్‌ఫారమ్‌లో పొందుపరిచారు. ఇవి మొబైల్ యాప్ ద్వారా ఉద్యోగులకు ఎక్కడైనా ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి.
పి.ఎ.ఒ.-భారతి: సాయుధ బలగాల సిబ్బంది వేతనాలు, అలవెన్సుల చెల్లింపులు, క్లెయిమ్‌లకు సంబంధించిన సరైన సమాచారాన్ని ఈ వ్యవస్థ ద్వారా పొందడానికి వీలుంటుంది. దీనికి తోడుగా, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐ.వి.ఆర్.ఎస్.) ద్వారా, సిబ్బంది తమ ఫిర్యాదులను ఫోన్ ద్వారా నమోదు చేయవచ్చు. ఫిర్యాదులకు కూడా 48 గంటల్లో సమాధానాలను పొందవచ్చు. ఏడు చెల్లింపులు, ఖాతాల కార్యాలయాల్లో (పి.ఎ.ఒ.లలో) ఈ వ్యవస్థ అమలవుతూ వస్తోంది. త్వరలో మిగిలిన కార్యాలయాల్లో కూడా అమలు చేస్తామని రక్షణ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇలా డిజిటల్ కార్యక్రమాలను అవలంబించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'సంస్కరణ, పనితీరు, పరివర్తన' మంత్రాన్ని సాకారం చేసినందుకు రక్షణ ఖాతాల శాఖను (డి.ఎ.డి.ని) ఆయన ఎంతగానో ప్రశంసించారు. "సాంప్రదాయ విలువలతో అనుసంధానాన్ని కొనసాగిస్తూనే, ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా రక్షణ ఖాతాల శాఖ అభివృద్ధి చెందుతోంది" అని ఆయన అన్నారు.
ఆర్థిక వివేచన ద్వారా రక్షణసేవల శాఖ ఆర్థిక వనరులను నిర్వహించడంలో డి.ఎ.డి. పోషించిన కీలక పాత్రను కూడా రాజనాథ్ సింగ్ అభినందించారు. “భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతోంది. 2047 నాటికి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా అవతరించేందుకు 'అమృత్ కాల్'లో మందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నూతన విశ్వాసం, సంకల్పంతో దేశం పురోగమిస్తోంది. స్వావలంబనతో 'ఆత్మనిర్భర్' స్థాయిలో రక్షణ పరిశ్రమలు అత్యాధునిక ఆయుధాలు/పరికరాలతో బలమైన సైన్యాన్నికలిగి ఉంటేనే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వీలుంటుంది. జాతీయ భద్రతను పటిష్టం చేయడం తొలినుంచి మన ప్రాధాన్యతగా ఉంటోంది. 2022-23లో రక్షణ మంత్రిత్వ శాఖకు మొత్తం రూ.5.25 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించడం సాటిలేని మన సంకల్ప బలానికి నిదర్శనం. ఈ ప్రయత్నంలో రక్షణ ఖాతాల శాఖ తన వంతు పాత్ర పోషిస్తోంది'' అని రాజనాథ్ సింగ్ అన్నారు.
రక్షణ ఉత్పత్తిలో ‘ఆత్మనిర్భరత’ దృక్పథాన్ని సాకారం చేయడంలో రక్షణ మంత్రిత్వ శాఖ పోషించగల కీలక పాత్రను రాజ్‌నాథ్ సింగ్ ప్రధానంగా ప్రస్తావించారు. “2022-23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో 68 శాతం దేశీయ పరిశ్రమకు మూలధన సేకరణకు కేటాయించారు. రక్షణ తయారీ రంగంలో స్వావలంబన సాధించే విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను ఇది స్పష్టంగా సూచిస్తోంది. ప్రభుత్వ చేస్తున్న ఈ కృషికి మద్దతుగా సత్వర నిర్ణయాల ద్వారా రక్షణ శాఖ కూడా తగిన మద్దతు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే జాప్యం జరిగితే డబ్బు నష్టంతో పాటు, దేశ పోరాట తత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.” అన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖలోని వివిధ అంశాల పనితీరు, సమర్థతపై పరిశీలనకోసం రక్షణ మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీని గురించి ఆయన వివరించారు. మంత్రిత్వ శాఖలో జరుగుతున్న కృషిని నూతన, సృజనాత్మక దృక్కోణం నుండి ఈ కమిటీ ఆడిట్ ద్వారా సమీక్షిస్తుందన్నారు. ఈ ప్రక్రియలో డి.ఎ.డి. ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. దీనివల్ల సేవల సామర్థ్యం పెరగడమే కాకుండా వృథా ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. అకౌంటింగ్, బిల్లింగ్, చెల్లింపులు, అంతర్గత లెక్కల తనిఖీ అనేవి,.. రక్షణ మంత్రిత్వ శాఖలో (డి.ఎ.డి.) నిర్వహించే మూడు ప్రధాన పాత్రలు, తాజా సాంకేతిక పురోగతిని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక సలహాలు, బిల్లింగ్-చెల్లింపులపై కొత్త పద్ధతిని రూపొందించేందుకు అందుబాటులోని అవకాశాలను అన్వేషించాలని ఆయన డి.ఎ.డి.కి సూచించారు. తమ శాఖాపరమైన విధులను ఇదే ఉత్సాహంతో, అంకితభావంతో డి.ఎ.డి. కొనసాగిస్తుందని, దేశ రక్షణ ఆర్థిక నిర్వహణకు ఇది దోహదపడుతుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, సాయుధ బలగాల అధిపతి జనరల్ మనోజ్ పాండే, రక్షణసేవల ఆర్థిక సలహాదారు రసిక చౌబే, రక్షణ ఖాతాల అదనపు కంట్రోలర్ జనరల్ అవినాశ్ దీక్షిత్, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(Release ID: 1864320)
Visitor Counter : 244