రక్షణ మంత్రిత్వ శాఖ
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ అనిల్ చౌహాన్; దేశ ఆశలను నెరవేరుస్తామని & సవాళ్ళను కలిసి ఎదుర్కొని పరిష్కరిస్తామని ప్రతిజ్ఞ
Posted On:
30 SEP 2022 3:36PM by PIB Hyderabad
భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్- త్రివిధ దళాధిపతి)గా పివిఎస్ఎం. యువైఎస్ఎం, ఎస్ఎం, విఎస్ఎం జనరల్ అనిల్ చౌహాన్ 30 సెప్టెంబర్ 2022న బాధత్యలు స్వీకరించారు. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని విషయాలలోనూ రక్షణ మంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా, సైనిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా జనరల్ చౌహాన్ వ్యవహరిస్తారు. దానితో పాటుగా, ఆయన చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సిఒఎస్‌సి) శాశ్వత చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
బాధ్యతలు తీసుకునే ముందు మీడియాతో క్లుప్తంగా ముచ్చటించిన జనరల్ చౌహాన్, తనను సిడిఎస్‌గా నియమించడం తనకు గర్వకారణమైన విషయమని చెప్పారు. త్రివిధ దళాలు, ప్రభుత్వం, పౌరులు నూతన సిడిఎస్‌పై ఎన్నో ఆశలను, అంచనాలను పెట్టుకున్నారని, తన సామర్ధ్యాల మేరకు వాటిని నెరవర్చేందుకు ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్ళను త్రివిధ దళాలు సంయుక్తంగా ఎదుర్కొని, పరిష్కరిస్తాయని ఆయన అన్నారు.
అంతకుముందు, జనరల్ చౌహాన్ జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. అలాగే, సౌత్ బ్లాక్ లాన్లలో చీఫ్ ఆప్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌధరి, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే, వైస్ చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ ఘోర్మదే, సాయుధ దళాలకు చెందిన ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ఆయన త్రివిధ దళాల గౌరవ వందనాన్ని వీక్షించారు.
***
(Release ID: 1863865)
Visitor Counter : 231