హోం మంత్రిత్వ శాఖ
యువ ఎస్పీల 4వ జాతీయ సదస్సు.. పోలీస్ ఎక్స్-పో ప్రారంభ వేడుకలో ఇవాళ ప్రసంగించిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి శ్రీ నిత్యానంద రాయ్
“ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం.. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో సైబర్ నేరాల విచారణ-సైబర్ దాడుల నిరోధంపై మంత్రిత్వశాఖ నిశిత దృష్టి సారిస్తోంది”;
“కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో సైబర్ నేరాల సవాళ్లను ఎదుర్కోవడంపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పూర్తి నిబద్ధతతో ఉంది”;
“దేశంలోని 16,347 పోలీస్ స్టేషన్లలో నేరాలు-నేరగాళ్ల పర్యవేక్షణ నెట్‌వర్క్-వ్యవస్థ (సీసీటీఎన్‌ఎస్) అమలు; 99శాతం స్టేషన్లలో 100శాతం ఎఫ్‌ఐఆర్‌ల ప్రత్యక్ష నమోదు”;
“సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి అవుట్‌పోస్ట్ స్థాయిదాకా మౌలిక వసతుల కల్పన పూర్తి… సైబర్ నేరాలపై విశ్లేషణాత్మక ఉపకరణాల సృష్టి 40 శాతం వరకూ పూర్తి”;
“దేశవ్యాప్తంగా శాంతిసామరస్యాలకు భరోసా… శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు మార్గదర్శకత్వం.. మద్దతు ఇవ్వడంలో ‘బీపీఆర్ అండ్ డి’ కృషి ఆదర్శప్రాయం”;
“పోలీసులు జాతీయ శాంతిసామరస్యాల పరిరక్షణతోపాటు
సురక్షిత వాతావరణం కొనసాగేందుకు భరోసా కల్పిస్తారు”;
“సాంకేతిక పరిజ్ఞాన విస్తృత వినియోగం ద్వారా నేరగాళ్లు
తీవ్రస్థాయిలో ముప్పు కల్పిస్తూ సవాళ్లు విసురుతున్నారు”
Posted On:
29 SEP 2022 4:56PM by PIB Hyderabad
దేశంలోని యువ పోలీసు సూపరింటెండెంట్ల 4వ జాతీయ సదస్సు, పోలీస్ ఎక్స్ పో ప్రారంభ కార్యక్రమంలో ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ నిత్యానంద రాయ్ ప్రసంగించారు. పోలీసు పరిశోధన-అభివృద్ధి సంస్థ (బీపీఆర్ అండ్ డి) డైరెక్టర్ జనరల్‌సహా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల డైరెక్టర్/ఇన్‌స్పెక్టర్/డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరళ్లతోపాటు కేంద్ర సాయుధ బలగాల (సీఏపీఎఫ్), కేంద్రీయ పోలీసు సంస్థల (సీపీవో) ఇన్‌స్పెక్టర్/డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరళ్లు, పోలీసు శాఖలోని యువ పోలీసు సూపరింటెండెంట్లు (ఎస్పీ), కమాండెంట్లు, పరిశ్రమల ప్రతినిధులు, పలువురు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ- పోలీసు పరిశోధన-అభివృద్ధి సంస్థను ప్రశంసించారు. ఈ సదస్సుకు “సైబర్ నేరాల నిర్వహణ-డ్రోన్లు-డ్రోన్ల నిరోధంపై పరిశోధన-ఆవిష్కరణ” అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకోవడం ప్రస్తుత కాలానికి ఎంతయినా సందర్భోచితమని ‘బీపీఆర్ అండ్ డి’ని ఆయన అభినందించారు. ఈ సంస్థ ప్రారంభం నుంచీ ఉత్తమ పద్ధతులు, ప్రమాణాలను ప్రోత్సహిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. తద్వారా సామర్థ్య నిర్మాణం, పాలన-సంస్కరణాత్మక సంస్కరణలు, ఆధునికీకరణ, పోలీసు వ్యవస్థ ఉన్నతీకరణలో పాలు పంచుకుంటున్నదని గుర్తుచేశారు. దేశ సేవలో 52 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ఈ సంస్థ పూర్తిచేసుకున్నదని తెలిపారు. దేశవ్యాప్తంగా శాంతిసామరస్యాలకు భరోసా కల్పనలో, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు మార్గదర్శకత్వం వహించడమే కాకుండా తగిన మద్దతివ్వడంలో ‘బీపీఆర్ అండ్ డి’ కృషి ఆదర్శప్రాయమని మంత్రి కొనియాడారు.
ప్రభుత్వ పాలనలో పోలీసులు అత్యంత కీలక భాగం మాత్రమేగాక ప్రజా జీవనంలోని ప్రతి రంగంలో వారు తమ ఉనికిని చాటుకుంటుంటారని శ్రీ నిత్యానంద రాయ్ అన్నారు. పోలీసులు జాతీయ శాంతిసామరస్యాల పరిరక్షణతోపాటు సురక్షిత వాతావరణం కొనసాగేందుకు భరోసా కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు. తద్వారా దేశ ప్రగతి ప్రయాణంలో విడదీయరాని భాగంగా కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. చట్టాన్ని అమలు చేసే మన సంస్థలు రెండు కోణాల్లో మార్పులను నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాయని పేర్కొన్నారు. నానాటికీ పెరుగుతున్న కొత్త నేర సవాళ్ల పరిష్కారంలో సాంకేతికత అనుసరణ, నేర నమూనాలను మెరుగ్గా గుర్తించడంలో కృత్రిమ మేధస్సు తదితరాల వినియోగం ఇందులో మొదటి కోణమని చెప్పారు. ఇక వేగంగా మారిపోతున్న నేర ధోరణులు, నేర పద్ధతులపై అంతే వేగంగా అవగాహన పెంచుకుంటూ వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం రెండో కోణమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞాన పురోగమనాన్ని నేరగాళ్లు విస్తృతంగా వాడుకుంటూ సమాజానికి తీవ్రస్థాయిలో ముప్పు కలిగించడంసహా సవాళ్లు విసురుతున్నారని శ్రీ రాయ్ అన్నారు. ఈ సవాళ్లను పరిష్కరించడం, నేరస్థులకన్నా చట్టాల అమలు సంస్థలను సాంకేతికంగా ముందువరుసలో ఉంచడం, పౌరుల జీవితాలతోపాటు మౌలిక సదుపాయాలను రక్షించడం నేటి తక్షణావసరమని స్పష్టం చేశారు. సైబర్ దాడులు, రాన్సమ్-వేర్ దాడులు, గుర్తింపు అపహరణ, మౌలిక సదుపాయాల విచ్ఛిన్నం వంటివి సైబర్ రక్షణ రంగంలో ఎదురయ్యే నేరాలలో కొన్ని ప్రధాన విభాగాలని ఆయన అన్నారు.
సైబర్ నేరాలు, దాడులు సామాన్యుల జీవితాలపై పెను ప్రభావం చూపుతున్నాయని హోం శాఖ సహాయమంత్రి అన్నారు. అంతేకాకుండా సమాజాల మధ్య అశాంతి-అపనమ్మకం సృష్టికి, విద్వేష వ్యాప్తికి, సైబర్ మోసాలకు, నకిలీ-కల్పిత వార్తల వ్యాప్తికి సామాజిక మాధ్యమాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో మన చట్టాల, చట్టం అమలు సంస్థల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సైబర్ నేరాల విచారణ-సైబర్ దాడుల నిరోధంపై మంత్రిత్వశాఖ నిశితంగా దృష్టి సారిస్తోందని చెప్పారు. నేరాలు, ఘోరాలను ఎదుర్కొనడం కోసం వ్యూహాత్మక సంస్థల ఏర్పాటుకు, దోషులపై నిర్దిష్ట వ్యవధిలో విచారణ కోసం మన న్యాయవ్యవస్థ మెరుగుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు. పెరుగుతున్న సైబర్ నేరాల కేసులను సమన్వయంతో, సమర్థంగా పరిష్కరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ (ఐ4సి)ని ఏర్పాటు చేసిందని శ్రీ రాయ్ గుర్తుచేశారు. ఈ సమన్వయం కేంద్రంలో ఏడు భాగాలుండగా, జాతీయ సైబర్ పరిశోధన-ఆవిష్కరణల కేంద్రం (బీపీఆర్ అండ్ డి) కీలకమైనదని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసాలలో డబ్బు కోల్పోయిన పౌరులకు సకాలంలో సత్వర సహాయం దిశగా ప్రభుత్వం ‘1930’ ఉచిత ఫోన్ నంబరుతో ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. అలాగే ప్రజలు తమ ఫిర్యాదులు నమోదు చేసేందుకు ఒక పోర్టల్‌ను కూడా ప్రారంభించిందని ఆయన చెప్పారు.
కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో సైబర్ నేరాల సవాళ్లను ఎదుర్కొనడంపై తమ శాఖ పూర్తి నిబద్ధతతో ఉందని శ్రీ నిత్యానంద రాయ్ చెప్పారు. ఇందులో భాగంగా దేశంలోని 16,347 పోలీస్ స్టేషన్లలో నేరాలు-నేరగాళ్ల పర్యవేక్షణ నెట్‌వర్క్-వ్యవస్థ (సీసీటీఎన్‌ఎస్) అమలవుతున్నదని చెప్పారు. అంతేకాకుండా 99 శాతం స్టేషన్లలో 100 శాతం ఎఫ్‌ఐఆర్‌లు నేరుగా నమోదవుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి అవుట్ పోస్ట్ స్థాయిదాకా మౌలిక వసతుల కల్పన పూర్తయిందన్నారు. అదేవిధంగా సైబర్ నేరాలపై విశ్లేషణాత్మక ఉపకరణాల సృష్టి కూడా 40 శాతం వరకూ పూర్తయినట్లు ఆయన పేర్కొన్నారు.
మన అంతర్గత, సరిహద్దు, మారుమూల ప్రాంతాల భద్రతను బలోపేతం చేసే విషయంలో డ్రోన్ల వినియోగం ప్రయోజనకరం కాగలదని హోంశాఖ సహాయమంత్రి అన్నారు. ఈ మేరకు వాటిని యుద్ధ కార్యకలాపాలతోపాటు నిఘా, మారుమూల ప్రాంతాల్లో సమాచార మార్పిడి తదితరాల కోసం వాడుకోవచ్చునని ఆయన సూచించారు. అంతేగాక మందులు, ఆహారం, నిత్యావసరాల రవాణా, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో అన్వేషణ-రక్షణ కార్యకాలాపాల్లోనూ వినియోగించుకునే వీలుందన్నారు. భారత్ డ్రోన్ ఉత్సవం ప్రారంభం సందర్భంగా డ్రోన్ల వినియోగం విప్లవాత్మకం కాగలదని, వ్యవసాయ రంగ ఆధునికీకరణ దిశగా ఇదొక కొత్త అధ్యాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించడాన్ని గుర్తుచేశారు. అలాగే డిజిటల్ విధానంలో ఆస్తుల గుర్తింపు-నమోదు కూడా సాగుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో డ్రోన్ సేవల ద్వారా గ్రామాల్లో భూసార పరీక్ష ప్రయోగశాలల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను కూడా సృష్టించవచ్చునని పేర్కొన్నారు. దీనికి అదనంగా రైతులు, మత్స్యకారులు తమ ఉత్పత్తులను కనీస నష్టంతో సకాలంలో సరఫరా, రవాణా చేయడంలోనూ డ్రోన్లు సాయం చేస్తాయన్నారు. అదేవిధంగా పెద్దగా శ్రమించకుండానే పంటలపై పురుగుమందుల పిచికారీ కూడా సులభం కాగలదని చెప్పారు. కాగా, పరిశోధన ఆధారిత పరిష్కారాల రూపకల్పన దిశగా విద్యాసంస్థలు, పరిశ్రమలు, చట్టాల అమలు సంస్థల మధ్య ‘బీపీఆర్ అండ్ డి’ ఇప్పటికే సమన్వయం సృష్టించిందని ఆయన తెలిపారు.
***
(Release ID: 1863538)
Visitor Counter : 132