యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

అహ్మ‌దాబాద్‌లో రేపు జ‌రిగే 36వ జాతీయ క్రీడ‌ల మ‌హోత్స‌వంలో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, జాతీయ క్రీడ‌ల పోటీల‌ను ప్రారంభిస్తారు.

Posted On: 28 SEP 2022 6:15PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, రేపు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగే భారీ జాతీయ క్రీడామ‌హోత్స‌వంలో 36వ జాతీయ క్రీడ‌ల పోటీల‌ను ప్రారంభిస్తారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల‌నుంచి ఇక్క‌డికి వ‌చ్చి ఈ క్రీడ‌ల‌పోటీల‌లో పాల్గొంటున్న‌ క్రీడాకారుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. కేంద్ర యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్‌, ఇత‌రులు ఈ క్రీడ‌ల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు.
జాతీయ క్రీడ‌ల పోటీలు గుజ‌రాత్ రాష్ట్రంలో జ‌ర‌గ‌నుండడం ఇదే ప్ర‌థ‌మం. ఈ క్రీడా పోటీలు  సెప్టెంబ‌ర్ 29 వ తేదీ నుంచి 2022 అక్టోబ‌ర్ 12 వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతాయి. దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల‌నుంచి సుమారు 15,000 మంది క్రీడాకారులు, కోచ్‌లు, ఇత‌ర అధికారులు 36 క్రీడా అంశాల‌లో పాల్గొని ఇంత‌కు ముందెన్న‌డూ లేనంత స్థాయిలో ఈ జాతీయ క్రీడ‌ల‌ను విజ‌య‌వంతం చేయ‌నున్నారు. ఈ క్రీడాంశాల‌ను అహ్మ‌దాబాద్‌, గాంధీన‌గ‌ర్‌, సూర‌త్‌, వ‌డోద‌ర‌, రాజ్ కోట్‌, భావ్‌న‌గ‌ర్‌లలో ఏర్పాటు చేయ‌నున్నారు. అప్ప‌టి ముఖ్య‌మంత్రి, ప్ర‌స్తుత ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో గుజ‌రాత్ అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో అత్య‌ద్భుత స్థాయిలో క్రీడా మౌలిక స‌దుపాయాల‌ను సంత‌రించుకుంది. ఇది రాష్ట్రం అన‌తికాలంలోనే జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌న్న‌ద్ధం కావ‌డానికి దోహ‌ద‌ప‌డింది.

 

***(Release ID: 1863164) Visitor Counter : 165