ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ లోని ఏ ఐ ఐ ఎం ఎస్ (AIIMS) లో డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ అధ్యక్షతన ఘనంగా జరిగిన 67వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ రోగనిర్ధారణ మరియు నిర్వహణ సౌకర్యాలను అందించడంలో మాత్రమే కాకుండా మరణాలను తగ్గించడంలో మరియు అనారోగ్యం నుంచి గరిష్టంగా కోలుకోవడంలో కూడా గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించింది - డాక్టర్ భారతి పవార్
" ఏ ఐ ఐ ఎం ఎస్ న్యూఢిల్లీ ఇతర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌లతో తన విజ్ఞాన నిధి తో బలమైన మరియు ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడానికి మార్గదర్శి గా నడుస్తోంది"
Posted On:
25 SEP 2022 7:01PM by PIB Hyderabad
"దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ రోగనిర్ధారణ నిర్వహణ సౌకర్యాలను అందించడంలో మాత్రమే కాకుండా మరణాలను తగ్గించడంలో అలాగే ఎక్కువ మంది అనారోగ్యం నుంచి కోలుకోవడంలో కూడా అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శించింది" అని న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 67వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు అధ్యక్షత వహించిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. పరిశోధన విభాగంలో ప్రథమ శ్రేణి 10 విద్యా సంస్థల్లో ఏ ఐ ఐ ఎం ఎస్ ర్యాంకింగ్‌పై డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ సంతోషం వ్యక్తం చేశారు. పరిశోధనతో పాటు రోగి సంరక్షణ సేవా తత్పరత ఉన్న ఏకైక సంస్థ ఇదేనని ఆమె అన్నారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ జారీ చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ప్రకారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య సంస్థల్లో వరుసగా ఐదవ సంవత్సరం ప్రథమ స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమని ఆమె ప్రశంసించారు. రాబోయే సంవత్సరాల్లో కూడా ర్యాంకింగ్‌ను కొనసాగించాలని ఆమె అధికారులను కోరారు. “విజయం సాధించడం అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. మనం ఉన్నత ప్రమాణాలను కొనసాగించడమే కాకుండా కొత్త మైలురాళ్లను నెలకొల్పడానికి కృషి చేయాలి మరియు వాటిని సాధించడానికి కృషి చేయాలి” అని ఆమె తెలిపారు.
"ఏ ఐ ఐ ఎం ఎస్ న్యూఢిల్లీ ఇతర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌లతో తన విజ్ఞాన నిధి తో బలమైన ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడానికి మార్గదర్శి గా నడుస్తోంది" అని ఆమె పేర్కొంది.
"అందరికీ చేరువలో సంపూర్ణ ఆరోగ్యం అనే లక్ష్యం గురించి మాట్లాడేటప్పుడు, మనం దానిలో మూడు అంశాలను చేర్చాము. మొదటిగా, ఆధునిక వైద్య శాస్త్రానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన మరియు మానవ వనరుల విస్తరణ. రెండవది, సాంప్రదాయ భారతీయ వైద్య విధానంలో పరిశోధనను ప్రోత్సహించడం మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో దాని చురుకైన పాత్ర మరియు మూడవది ఆధునిక మరియు భవిష్యత్తు సాంకేతికత ద్వారా దేశంలోని ప్రతి వ్యక్తికి మరియు ప్రతి గ్రామానికి మెరుగైన మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడం”, అని ఆమె జోడించారు. మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ నాయకత్వం లో గ్రామ స్థాయి లో ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూనే, నివారణకు, సంరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ సమగ్రంగా పనిచేయడం కేంద్ర ప్రభుత్వ యోజన. పేదలు వైద్యం పై చేసే ఖర్చును తగ్గించడంతోపాటు వైద్యుల సంఖ్యను వేగంగా పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఆమె తెలిపారు.
“ ఎయిమ్స్ టుడే అండ్ విజన్ ఫర్ 2047” అనే అంశంపై ఎయిమ్స్ లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సందర్శించారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు.
కార్యక్రమంలో ఎయిమ్స్ న్యూఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాస్, అలాగే ఎయిమ్స్ అధ్యాపకులు పాల్గొన్నారు.
***
(Release ID: 1862168)
Visitor Counter : 115