పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సు నిర్వహణ గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో ప్రారంభించిన ప్రధాని
కేవలం నియంత్రణ మాత్రమే కాదు
అంతకు మించిన పాత్ర
కేంద్ర మంత్రిత్వ శాఖకు ఉందన్న మోదీ
గ్లాస్గోలో యావత్ ప్రపంచానికే మిషన్ లైఫ్
దార్శనికతను అందించిన ప్రధాని:
జాతీయ సదస్సులో భూపేందర్ యాదవ్ వెల్లడి
“జట్టుగా పనిచేసి స్వావలంబన భారత్ దృక్పథానికి
తగిన సేవలందిస్తాం”: కేంద్ర పర్యావరణ మంత్రి
మెరుగైన విధానాల రూపకల్పనలో కేంద్ర, రాష్ట్రాలకు
చక్కని సమన్వయాన్ని అందించనున్న సదస్సు
పర్యావరణంపై ఆరు చర్చాగోష్టులను నిర్వహించిన
రెండు రోజుల జాతీయ సదస్సు
Posted On:
24 SEP 2022 6:24PM by PIB Hyderabad
జాతీయ స్థాయి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రుల సమ్మేళనం గుజరాత్ రాష్ట్రంలోని ఏక్తానగర్‌లో జరిగింది. రెండు రోజుల ఈ సదస్సును నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రులు సదస్సులో పాల్గొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ స్వాగతోపన్యాసం, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రసంగంతో సదస్సు ప్రారంభమైంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే, ఇతర ప్రముఖులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. రెండు రోజుల ఈ జాతీయ సదస్సులో వివిధ రాష్ట్రాల అటవీ మరియు పర్యావరణ మంత్రులు, సంబంధిత రాష్ట్రాల కార్యదర్శులు, రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండలుల ప్రతినిధులు, ప్రధాన అటవీ సంరక్షణాధికారులు తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
వర్చువల్ పద్ధతిలో సదస్సును ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, భారతదేశం కేవలం పునరుత్పాదక ఇంధన రంగంలో భారీస్థాయి పురోగతిని సాధించడమే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, జీవావరణ శాస్త్రాన్ని నిరంతరం బలోపేతం చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. 2070 సంవత్సరానికల్లా ఉద్గారాలు వెదజల్లే కాలుష్య నియంత్రణలో నెట్ జీరో స్థాయిని సాధించే దిశగా మన అందరి కృషి కొనసాగాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. హరిత వృద్ధి, హరిత ఉద్యోగాల కల్పనపై దేశం దృష్టిని కేంద్రీకరించిందని అన్నారు. ఈ లక్ష్యాల సాధనలో రాష్ట్రాల పర్యావరణ మంత్రిత్వ శాఖల పాత్ర కూడా చాలా ప్రధానమైనదని ఆయన అన్నారు. "రాష్ట్రాలలో సాధ్యమైనంత వరకు వర్తులాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలని పర్యావరణ మంత్రులందరినీ నేను కోరుతున్నాను" అని ప్రధాన మంత్రి అన్నారు. ఘనవ్యర్థాల నిర్వహణపై ప్రచారానికి ఇది గణనీయంగా మద్దతు ఇస్తుందని, ఒకే సారి వినియోగించి వదలివేసే ప్లాస్టిక్ వస్తువులతో ఎదురయ్యే ముప్పు నుంచి మనకు కూడా విముక్తి కలిగిస్తుందని మోదీ పేర్కొన్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖల పాత్రను నియంత్రణ దోరణిలో చూడకూడదని ప్రధాని అభిప్రాయపడ్డారు. చాలా కాలంగా పర్యావరణ మంత్రిత్వ శాఖలు తమ పాత్రను నియంత్రణ ధోరణిలోని నిర్వహిస్తూ ఉండటం ఆందోళనకరమని ఆయన అన్నారు. అయితే, “పర్యావరణ మంత్రిత్వ శాఖ పాత్ర నియంత్రణ ధోరణిలో కాకుండా ఎక్కువగా పర్యావరణ ప్రోత్సాహకారిగానే ఉండాలని, అలాగే ఉంటుందని నేను భావిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు. వాహనాల స్క్రాపింగ్ విధానం, ఇథనాల్ కలపడం వంటి జీవ ఇంధన చర్యలు తదితర కార్యక్రమాలను రాష్ట్రాలు తమ సొంతం చేసుకోవాలని, వాటిని బలోపేతం చేయడానికి తగిన మద్దతును అందించాలని ఆయన కోరారు. ఈ చర్యలను ప్రోత్సహించడంలో వివిధ రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీతోపాటు, పరస్పర సహకారం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏక్తా నగర్‌లోని కేవడియాలో అందుబాటులో ఉన్న అధ్యయన అవకాశాలను గురించి ఆయన ప్రస్తావించారు. పర్యావరణాన్ని బలోపేతం చేయడం, కొత్తగా ఉపాధి అవకాశాల కల్పన, పర్యావరణాన్ని పెంచడానికి పర్యావరణ పర్యాటకాన్ని ఒక మార్గంగా తయారు చేయడం తదితర పరిష్కారాల గురించి ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. మన గిరిజన సోదర, సోదరీమణుల సాగిస్తున్న సంపద వృద్ధితో అటవీ సంపద ఎలా పెరుగుతుందో సూచించారు.
ప్రధానమంత్రి ప్రసంగం:
https://pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1861687
సెప్టెంబరు 23న జరిగిన సదస్సులో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రసంగించారు. దేశ పర్యావరణ అభివృద్ధి తత్వం, ప్రత్యేక కళలు, వాస్తుశిల్పం అభివృద్ధి తత్వాన్ని చూసి, ఇది పూర్తిగా శ్రేష్ఠ భారత్, ఉత్తమ భారత్ మాత్రమేనని మంత్రులు, అధికారులు ఇక్కడ సర్దార్ పటేల్ విగ్రహం సమక్షంలో పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని యాదవ్ అన్నారు. గ్లాస్గో పర్యావరణ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలన్నింటికీ మిషన్ లైఫ్ దార్శనితకను అందించారని పేర్కొన్నారు.
జాతీయ కార్యాచణ ప్రణాళిక, రాష్ట్రాల కార్యాచరణ ప్రణాళికలతో పాటు, మిషన్ లైఫ్‌పై నీతి ఆయోగ్ కార్యనిర్వహణ అధికారులతో చర్చను ఈ సదస్సులో చేపట్టారు. ప్రపంచంలోని పర్యావరణ భద్రతా నిర్వహణా కార్యక్రమంలో ప్లాస్టిక్ నిషేధం అంశం ప్రస్తావనకు వచ్చిందని, అయితే ఈ విషయంలో భారతదేశం అవసరమైన చర్యలు తీసుకుందని యాదవ్ తెలిపారు. దేశంలో అంతరిస్తున్న చిరుతల జాతిని పునరుద్ధరించడం ద్వారా దేశాన్ని పర్యావరణ సామరస్యం వైపు తీసుకెళ్లామని, ప్రధాని నాయకత్వం, దార్శనికతే ఇందుకు కారణమని కేంద్రమంత్రి యాదవ్ అన్నారు.
ఇక వన్యప్రాణుల రక్షణ, జీవవైవిధ్యం, చిత్తడి నేలల సంరక్షణ తదితర అంశాలపై కూడా పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సులో చర్చ జరిగింది. భారతదేశానికి 75వరకూ చిత్తడి నేలలకు రామ్‌సర్ సైట్ ప్రతిపత్తి లభించిందని కేంద్ర మంత్రి తెలియజేశారు. వాయు కాలుష్యంపై ఆందోళనతోపాటు వ్యవసాయక అటవీ అంశాన్ని సదస్సులో చర్చనీయాంశంగా చేర్చినట్లు తెలిపారు. కలసికట్టుగా ఒక బృందంగా పని చేయడం ద్వారా స్వావలంబన సాధించగలమనే ఆశాభావంతో ఈ రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించినట్టు కేంద్రమంత్రి తెలిపారు.
సమగ్ర హరిత ఆమోద వ్యవస్థ, వాతావరణ మార్పులపై, ప్లాస్టిక్‌పై, వ్యర్థాలపై పోరాటం జరపడం వంటి లక్ష్యాల సాధనకు సింగిల్ విండో వ్యవస్థ ఉండాలన్న అంశంపై దేశవ్యాపంగా ఉన్న పర్యావరణ మంత్రులు ఈ రోజు చర్చించారు.
pic.twitter.com/qZHo0lyIM7
— భూపేందర్ యాదవ్ (@byadavbjp) September 23, 2022
2022 సెప్టెంబరు 23, 24 తేదీల్లో జరిగిన సదస్సులో జీవితం, జీవనశైలి, వాతావరణ మార్పులు (వాతావరణ మార్పుల ప్రభావంపై నియంత్రణ, వాతావరణ కాలుష్యాల అదుపునకు వాతావరణ మార్పులపై రాష్ట్రాల కార్యాచరణ ప్రణాళికలను నవీకరించడం) తదితర అంశాలపై దృష్టి సారించేందుకు ఆరు సెషన్లలో చర్చగోష్టులను నిర్వహించారు. పరివేష్ (సమగ్ర హరిత ఆమోదం కోసం సింగిల్ విండో వ్యవస్థ); అటవీ నిర్వహణ; కాలుష్య నివారణ, నియంత్రణ; వన్యప్రాణుల నిర్వహణ; ప్లాస్టిక్కులు, వ్యర్థాల నిర్వహణపై చర్చగోష్టులను నిర్వహించారు.
ఈ నెల 23వ తేదీ జరిగిన మొదటి సెషన్‌లో పరివేష్ (ప్రో-యాక్టివ్ అండ్ రెస్పాన్సివ్ ఫెసిలిటేషన్ బై ఇంటరాక్టివ్ అండ్ వర్చువస్ ఎన్విరాన్‌మెంట్ సింగిల్-విండో హబ్)పై చర్చ జరిగింది. ఆమోదాల మంజూరు ప్రక్రియ వ్యవధిని తగ్గించాలనే ప్రధానమంత్రి దార్శినిక దృక్పథానికి అనుగుణంగా 2018వ సంవత్సరం ఆగస్టు నెలలో పరివేష్ వ్యవస్థను ప్రారంభించారు. 2014 నుంచి ట్రెండ్ అనాలిసిస్ ద్వారా, పర్యావరణ క్లియరెన్స్ (ఇ.సి.) అటవీ అనుమతి (ఎఫ్.సి.) మంజూరులో తీసుకున్న వ్యవధిని తగ్గించడంలో అనేక విధాన సంస్కరణలతో కలిపి పరివేష్ వ్యవస్థ ఎలా దోహదపడుతుందో చర్చలో వివరించారు.
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి సమయంలో, సేవలను పొందడం కోసం భౌతికంగా స్పృశించే ప్రాంతాలను, స్పర్శించే అవసరాన్ని తగ్గించడానికి మరింత సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే పరిష్కారాల అన్వేషణకు కొత్త తరహా సాధారణ పరిస్థితి మన సమాజాన్ని పురికొల్పింది. సత్వర హరిత ఆమోద ప్రక్రియలు, అనుసరణల కోసం పరివేష్‌పై వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం అవసరమని భావించారు, అందుకు అనుగుణంగా మొత్తం 16 మాడ్యూళ్లు,140కి మించిన మరిన్ని కీలక కార్యాచరణలతో పరివేష్ పరిధిని పెంచేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. కాన్ఫిగర్ చేయదగిన అడ్మిన్ మాడ్యూల్, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (డి.ఎస్.ఎస్.), మీ ఆమోదాలను తెలుసుకోండి (కె.వై.ఎ.), క్యాంపా(సి.ఎ.ఎం.పి.ఎ.) మేనేజిమెంట్., హెల్ప్‌డెస్క్ నిర్వహణ., లీగల్ రిపోజిటరీ, ఆడిటర్ నిర్వహణ, ఎంటిటీ లెడ్జర్, చెల్లింపు గేట్‌వే. పరివేష్ వర్క్‌ఫ్లో ఆటోమేషన్ ద్వారా దాదాపు 10,000కిపైగా రెగ్యులేటరీ భాగస్వామ్యవర్గాలవారు దీనితో అనుసంధానం అవుతారు.
పరివేష్ అనేది సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే, వృత్తిపరంగా నిర్వహించే సంస్థాగత యాంత్రిక వ్యవస్థ అని, గ్రీన్ క్లియరెన్స్‌లు, తదుపరి ఆమోద ప్రక్రియల నిర్వహణ కోసం ‘‘సింగిల్ విండో’’ వేదికగా పరివేష్ పనిచేస్తుందని పేర్కొన్నారు. "కనీస ప్రభుత్వ జోక్యం, గరిష్ట పాలన"ను బలోపేతం చేయడం లక్ష్యంగా పరివేష్ వ్యవస్థను సంపూర్ణంగా తీర్చిదిద్దుతున్నారు. పరివేష్ అభివృద్ధి పనులు ప్రస్తుతం పురోగతి దశలో ఉన్నాయి. 2022వ సంవత్సరం చివరి నాటికి దీన్ని ప్రారంభించాలని యోచిస్తున్నారు.
పరివేష్ వ్యవస్థపై చర్చ అనంతరం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జీవనశైలిపై స్ఫూర్తిదాయకమైన చర్చాగోష్టి జరిగింది. శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో చర్చను నిర్వహించారు. గ్లాస్గోలో ప్రధాని మోదీ నిర్దేశించిన లైఫ్ అనే ఇతివృత్తంపై ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. పర్యావరణ రక్షణపై భారతదేశం చేసే కృషి గుర్తింపును పొందిందని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజను అనుసరించే జీవనశైలిని ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. గాలి, నీరులో ఎటువంటి కాలుష్యంలేని వారి జీవావరణ వ్యవస్థను పట్టణ జీవనశైలిలో కూడా పాటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యావరణ పంచతత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి సహజ సూక్ష్మజీవులు, ఇతర జాతులను ఉపయోగించే ప్రకృతి వ్యవసాయం చేయాలనే భావన ఎంతో ప్రశంసనీయమని ఆయన అన్నారు.
పర్యావరణం, మనస్తత్వం ఎలా అనుసంధానంతో ఉన్నాయో రవిశంకర్ వివరించారు. ఎవరైనా ఒక వ్యక్తి ఉద్విగ్నతకు లోనైనప్పుడు, సామాజిక, లేదా భౌతిక వాతావరణంలో బాధ్యతాయుతంగా స్పందించే అవకాశం ఉండబోదన్నారు, మొక్కలు నాటడం, వ్యవసాయం చేయడం తదితర పనుల ద్వారా పర్యావరణం కోసం పనిచేయడం మనలో మానసిక ఒత్తిడిని తొలగిస్తుందని శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. పర్యావరణ రక్షణకు, మానసిక ఆరోగ్యం ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ చర్యలు అవసరమని ఆయన అన్నారు. నిరాశా నిస్పృహల్లో, బాధల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయాలని, గతంలో సాధించిన విజయాలను ప్రతిబింబించేలా వ్యవహరించడమే ఇందుకు సరైన మార్గమని ఆయన అన్నారు. చిరునవ్వులు చిందిస్తూ ఆరోగ్యంగా జీవించడానికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. సమావేశాన్ని ఉత్తేజపరిచేందుకు, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం 20 నిమిషాల పాటు ఆహ్వానితులతో ధ్యానం చేయించారు.
23న జరిగిన రెండవ చర్చాగోష్టిలో వాతావరణ మార్పులపై పోరాటం, లైఫ్ సెషన్ సారాంశంపై చర్చించారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జీవనశైలి (లైఫ్)ని పాటించే ఉద్యమంపై నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) పరమేశ్వరన్ అయ్యర్ ప్రసంగించారు. మిషన్ లైఫ్, దాని లక్ష్యాలు, ప్రభావాలు, మిషన్ లైఫ్‌ని జనోద్యమంగా మార్చడం ఎలా.. తదితర అంశాలను ఆయన వివరించారు. మిషన్ లైఫ్ అమలు ప్రక్రియను సులభతరం చేయడంలో కేంద్ర మరియు రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖలకు ఎంతో ముఖ్య పాత్ర ఉందని సి.ఇ.ఒ. అన్నారు. ఈజిప్టులో కాప్-27 పేరిట వాతావరణ సదస్సు జరగనున్న నేపథ్యంలో వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఫ్రేంవర్క్ ఒడంబడిక (యు.ఎన్.ఎఫ్.సి.సి.సి.)కు సంబంధించిన రిజిస్ట్రీలో జాతీయ స్థాయిలో నిర్ణయించిన సేవలను (ఎన్.డి.సి.లను) నవీకరించడం ఒక ముఖ్యమైన దశ అని ఆయన అన్నారు. మన పర్యావరణాన్ని సంరక్షించడానికి వ్యక్తిగత స్థాయిలో, సమాజ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై మనం ఆలోచించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు రోజువారీ సాధారణ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.మన సంస్కృతీ సంప్రదాయాలకు సుస్థిరత ఎంతో ప్రధానమైనదని, భారతదేశం ప్రపంచాన్ని సుస్థిరత వైపుగా నడిపిస్తోందని పేర్కొన్నారు. మిషన్ లైఫ్ కింద ప్రజలను భూగోళ ప్రయోజనకారులుగా మార్చే చర్యలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, బుద్ధిహీనత, విధ్వంస యోచన మానుకొని, వనరులను బుద్ధిపూర్వకంగా నిర్మాణాత్మకంగా ఉపయోగించుకునే దిశగా మనం ముందడుగు వేయాలని అన్నారు. మిషన్ లైఫ్ అనే పథకం భారతదేశం నేతృత్వంలోని ప్రపంచ స్థాయి జనోద్యమం అని, ఈ పథకం కింద పర్యావరణాన్ని రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా సాధారణ సాపేక్ష చర్యలు తీసుకోవచ్చునని అన్నారు. అయితే, ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని మాత్రం సృష్టించకూడదని, ఉద్యోగాల సృష్టిని, వృద్ధిని ప్రోత్సహించేలా ఉండాలని అన్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంస్థలను, వనరులను, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను మిషన్ లైఫ్ పథకం ప్రభావితం చేస్తుందని అయ్యర్ అన్నారు. దుకాణానికి, బజారుకు సరకుల కొనుగోలుకోసం వెళ్పినపుడు చేతి సంచీని వెంట తీసుకెళ్లడం, పళ్లతోమేటపుడు నీటి కుళాయిని నిలిపివేయడం, అవసరం లేనపుడు విద్యుత్ ఉపకరణాలను ఆఫ్ చేయడం, కాగితానికి ఇరువైపుల ప్రింటింగ్ చేయడం, వంటి సాధారణ జీవన చర్యల జాబితాను కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు; భారతదేశ జనాభాలో మూడింట రెండు వంతుల మంది ప్రజలను 2022-28నుంచి భూగోళహితంగా మార్చడం, ఆ పథకాన్ని ప్రపంచ స్థాయి జనోద్యమంగా మార్చడానికి కనీసం 80 దేశాలతో భాగస్వామ్యంగా పనిచేయడం మిషన్ లైఫ్ పథకం ఆశయం. ప్రారంభంలో 6 ప్రాధాన్యతా వర్గాలలో 75 జీవన చర్యలపై మిషన్ లైఫ్ దృష్టి సారిస్తుందని చెప్పారు; ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఇ-వ్యర్థాలు), ప్లాస్టిక్ వ్యర్థాలు, విద్యుత్ పొదుపు, నీటి ఆదా, రీసైక్లింగ్-పునర్వినియోగం, ఆహార వృధాను నివారించడం తదితర చర్యలను ఆయన సూచించారు. పై అంతస్తులకు వెళ్లేందుకు సాధ్యమైనంతవరకూ మెట్లను ఉపయోగించాలని, తక్కువ సంఖ్యలో పేపర్ ప్రింట్లు తీయాలని, ఎయిర్ కండీషనర్‌లను పొదుపుగా ఉపయోగించాలని సూచించారు. తమతమ నియోజకవర్గాల్లో లైఫ్ పథకాన్ని ప్రోత్సహించాలంటూ ఆయన మంత్రులను అభ్యర్థించారు. ఇతర వేదికలు, కార్యక్రమాలు, ప్రచారాలు, శిక్షణా కార్యక్రమాల సహాయంతో ఈ చర్యలు తీసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాలతో సహా ఆన్‌లైన్ ద్వారా, ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా పౌరులను భూగోళ హితంగా తీర్చిదిద్దాలని ఆయన మంత్రులను అభ్యర్థించారు. ప్రపంచ స్థాయి జనోద్యమంగా నిర్వహించే లైఫ్ పథకానికి భారతదేశ ప్రజలు నాయకత్వం వహిస్తారని ఆయన తన ప్రసంగం చివరిగా పేర్కొన్నారు, ఈ ఉద్యమంలో భాగంగా, వ్యక్తులు MyGov పోర్టల్‌లో తమ రోజువారీ జీవిత చర్యలకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తారు. ప్రపంచానికి సుస్థిరతకు ప్రతిరూపంగా ఒక ప్రపంచ స్థాయి నమూనాగా లైఫ్ దృక్ఫథం రూపుదాల్చాలని ఆయన అన్నారు. "వాతావరణ మార్పులపై రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలను నవీకరించడం (ఎస్,ఎ.పి.సి.సి.), వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం, వాతావరణ ప్రభావాలకు అనుగుణంగా జీవన శైలిని సవరించుకోవడం" తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.
వాతావరణ మార్పుల ప్రభావం ఉపశమనానికి, అనుసరణకు అవసరమైన విస్తృతమైన విధాన వ్యవస్థను వాతావరణ మార్పులపై రూపొందించిన జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్.ఎ.పి.సి.సి.) అందిస్తుంది. తాను రూపొందించిన జాతీయ స్థాయి పథకాల ద్వారా వాతావరణ మార్పులకు అనుగుణ్యమైన కార్యక్రమాలను, కీలక లక్ష్యాలను సాధించడానికి బహుముఖ, దీర్ఘకాలిక, సమగ్ర వ్యూహాలను కూడా సూచిస్తుంది. ఎన్.ఎ.పి.సి.సి.కి అనుగుణంగా తమ కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రణాళికలను వాతావరణ మార్పులపై రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక (ఎస్.ఎ.పి.సి.సి.) అని వ్యవహరిస్తారు. కాప్-26 పేరిట నిర్వహించిన వాతావరణ సదస్సులో పంచామృతం ప్రకటన, 'పర్యావరణం కోసం జీవనశైలి' పేరిట ప్రధానమంత్రి ఏకపదంతో పిలుపునిచ్చిన లైఫ్ పథకం నేపథ్యంలో 2021-30 కాలానికి సంబంధించిన జాతీయ నిర్ణయాత్మక సేవల సహకారాన్ని భారతదేశం 2022లో నవీకరించింది. వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక, (ఎన్.ఎ.పి.సి.సి.), వివిధ రాష్ట్రాల ఎస్.ఎ.పి.సి.సి.లను ఇపుడు సవరిస్తున్నారు. పారిస్ ఒప్పందం ప్రకారం భారతదేశం జాతీయ నిర్ణయాత్మక సేవలతో విలీనం చేయడానికి వీలుగా వాటి సవరణ ప్రక్రియ సాగుతోంది. భారతదేశంలో వెలువడే గ్రీన్ హౌస్ గ్యాస్ (జి.హెచ్.జి.) ఉద్గారాల పరిస్థితిని ఉటంకిస్తూ. ఇంధన రంగం ద్వారానే ఈ ఉద్గారాలా వెలువడుతున్నాయని, ఇతర పరిశ్రమలు, వ్యవసాయం, వ్యర్థాల రంగాలు, ఎస్.ఎ.పి.సి.సి. రూపకల్పన సమయంలో ఈ ఉద్గారాల సమస్యపై దృష్టి సారించాలని ప్రధానంగా ప్రస్తావించారు.
సవరించిన ఎస్.ఎ.పి.సి.సి. అనేది వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని కీలక రంగాలలో వాతావరణ మార్పుల ప్రభావం తగ్గింపు, అనుసరణపై దృష్టి సారించేదిగా ఉంటుంది. ఇలా వ్యూహాలు, విధానాలను ప్రతిబింబించేలా రాష్ట్ర విధాన పత్రం ఉంటుంది. శాస్త్రీయ పరిశోధన మరియు కీలక పర్యావరణ వ్యవస్థల బలహీనత, వాతావరణ మార్పుల అంచనా ప్రభావాలపై నివేదికలపై ఎస్.ఎ.పి.సి.సి. ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఎస్.ఎ.పి.సి.సి. పత్రాలలో సమర్థవంతమైన, స్వచ్ఛమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్ మొబిలిటీ (E-మొబిలిటీ), వ్యర్థాల నిర్వహణ, వాతావరణాన్ని తట్టుకునే మౌలిక సదుపాయాలు, అటవీ నిర్మూలన, స్థిరమైన పట్టణీకరణ, నీటి సంరక్షణ వంటి అనేక ఉపశమన చర్యలను చర్యలను పొందుపరుస్తున్నాయి. వాతావరణ ప్రమాదాలపై, బలహీనతలపై మంచి శాస్త్రీయ అవగాహనపై ఎస్.ఎ.పి.సి.సి. పత్రాలు ఆధారపడి ఉండాలి.
తగిన చర్యలు, విధానాల ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఏదైనా రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం తన గరిష్ట శక్తిమేరకు సాధించగలిగే ఆశయాన్ని ఎస్.ఎ.పి.సి.సి. ప్రతిబింబించాలి. విస్తృత అభివృద్ధి ప్రక్రియలో వాతావరణ సమస్యలను ప్రధాన స్రవంతిలో ఉంచేందుకు ఈ ఎస్.ఎ.పి.సి.సి.లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పైగా, పారిస్ ఒప్పందం మేరకు భారతదేశపు జాతీయ నిర్ణయాత్మక సేవలను సాధించడానికి ఇవి ఇతోదికంగా తోడ్పడతాయి. రాష్ట్రానికి సంబంధించి, ఆయా రంగాలకు సంబంధించి నిర్దిష్టమైన చర్యను, ఇతర సమయానుకూల చర్యలను ఎస్.ఎ.పి.సి.సి.లు రూపొందించాలి, ప్రణాళికా ప్రక్రియలతో సహా అవసరమైన సంస్థాగత సదుపాయాలను, విధానపరమైన మౌలిక సదుపాయాలను రూపొందించాలి.
ఇక ప్లాస్టిక్ నిర్వహణ, ఇతర వ్యర్థాల నిర్వహణ అనే అంశంపై మూడో చర్చాగోష్టిని కూడా ఈ సదస్సులో నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రదర్శన నిర్వహించడం ద్వారా ఈ చర్చాగోష్టిని ప్రారంభించారు. దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, నియంత్రణకు ఒక వ్యవస్థను అందించే 2016వ సంవత్సరపు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణా నిబంధనలను ఈ చర్చాగోష్టిలో ప్రధానంగా ప్రస్తావించారు. ఒకసారి వాడి పడవేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగంనుంచి భారతదేశానికి విముక్తి కలిగించడం, మిషన్ సర్క్యులర్ ఎకానమీ వైపు పయనించాలన్న ప్రధానమంత్రి దృక్పథాన్ని ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు. వర్తులాకార ఆర్థిక వ్యవస్థ సూత్రాలను అనుసరించి దేశంలో వ్యర్థాల నిర్వహణ కోసం నియంత్రణ వ్యవస్థను 2016లో సమగ్రంగా సవరించినట్టు కూడా ఈ చర్చ సందర్భంగా పేర్కొన్నారు. వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం. ఘన వ్యర్థాలు, ప్రమాదకర వ్యర్థాలు, జీవ-వైద్య వ్యర్థాలు, ఈ-వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు, కూల్చివేత వ్యర్థాలు దేశంలో గత 8 సంవత్సరాలలో గణనీయంగా పెరిగాయి.
వ్యర్థాల నిర్వహణకు నోచుకోని, లేదా చెత్తాచెదారంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చేపట్టిన వ్యూహంలో రెండు కీలక అంశాలు ఉన్నాయి (1.) ఎక్కువ చెత్త పోగు కావడానికి కారణమవుతూ, తక్కువ ప్రయోజనం కలిగిన ఒకసారి వినియోగం ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించడం (2.) ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌పై సదరు ప్లాస్టిక్ తయారీదారు బాధ్యతను పెంచడం (i)తద్వారా చెత్తాచెదారం, నిర్వహణ లేని ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, (ii) ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాలపై వర్తులాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం, (3) ప్లాస్టిక్‌లకు కొత్త ప్రత్యామ్నాయాల రూపకల్పనను, అభివృద్ధిని ప్రోత్సహించడం, కొత్త వ్యాపార నమూనాల అభివృద్ధి చేయడం, (4.) స్థిరమైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వైపు వెళ్ళడం. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ప్రక్రియపై తయారీదారు బాధ్యతను పెంచే వ్యవస్థను కేంద్రీకృత ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అమలు చేసినపుడు అది సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
వివిధ వ్యర్థ పదార్థాలకు కూడా ఉత్పత్తిదారు బాధ్యతను విస్తరింపజేయడం తప్పనిసరి చేసే నియమాలు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, టైర్ల వ్యర్థాలు, బ్యాటరీల వ్యర్థాలు వంటి వాటి విషయంలో వర్తులాకార ఆర్థిక వ్యవస్థ సూత్రాలను అమలును నోటిఫై చేశారు. వర్తులాకార ఆర్థిక విధానాలు పర్యావరణ ప్రయోజనాలను కలిగి ఉండటమే కాకుండా వనరుల పరిరక్షణకు దోహదపడతాయి. కాగా, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్స్ వస్తువులపై నిషేధం, అమలు కార్యకలాపాల గురించి వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సదస్సులో తెలియజేసాయి. గ్రామాల్లో మహిళా స్వయం సహాయక బృందాల సహాయంతో బార్తన్ భండార్ల ఏర్పాటు వంటి చర్యలను తీసుకోవడం ద్వారా నిషిద్ధ ప్లాస్టిక్ వస్తువులను దూరం పెట్టడానికి తీసుకున్న చర్యలను, తాము పాటించే ఉత్తమ పద్ధతులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ చర్చాగోష్టిలో తెలియజేశాయి. ప్లాస్టిక్ వస్తువులపై నిషేధాన్ని విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యానికి ఉన్న ప్రాముఖ్యతను సదస్సులో ప్రధానంగా ప్రస్తావించారు. రీసైక్లింగ్‌తో కూడిన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వంనుంచి సహాయం పొందాల్సిన ఆవశ్యకతను కూడా కొన్ని రాష్ట్రాలు ప్రస్తావించాయి. గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సమస్యపై కూడా సదస్సులో చర్చించారు.
ఏక్తానగర్‌లో #జాతీయ పర్యావరణ సమ్మేళనంConference నేపథ్యంలో జరిగిన సాంస్కృతిక సాయంత్రం కార్యక్రమంలో అన్ని వర్ణాలతో శోభించే గుజరాత్ రాష్ట్రాన్ని చూశాను. గిర్ అడవుల్లో స్థిరపడిన ఆఫ్రికన్ సిద్ధి తెగవారు సిద్ధి ధామల్ నృత్యాన్ని కన్నుల పండుగగా ప్రదర్శించారు, గుజరాత్ రాష్ట్రానికే సొంతమైన గర్భా, డాంగీ నృత్య రీతులను కళాకారులు చక్కగా ప్రదర్శించారు. pic.twitter.com/0odvt0ukbC
— భూపేందర్ యాదవ్ (@byadavbjp) సెప్టెంబరు 23, 2022
కేవడియాలోని సర్దార్ పటేల్ జూలాజికల్ పార్కును వేకువ సమయాన్నే సందర్శించాను. అరుదైన అనేక జాతుల జంతువులు, పక్షులు, మొక్కలకు నిలయమిది. జూపార్కును ఇంత బాగా నిర్వహించడం చాలా సంతోషదాయకం.
మీరు గనుక కేవడియాకు వెళ్తే, అక్కడ కొంతసేపైనా గడిపేందుకు ప్రయత్నించండి. ప్రకృతికిచేరువగా ఉంటే లభించే ఆనందాన్ని ఆస్వాదించండి. pic.twitter.com/c1cTe7FyF3
— భూపేందర్ యాదవ్ (@byadavbjp) సెప్టెంబరు 24, 2022
జాతీయ సదస్సు రెండవ రోజున జీవ వైవిధ్యం, చిత్తడి నేలల సంరక్షణ తోపాటుగా వన్య జీవుల నిర్వహణ తదితర అంశాలపై చర్చాగోష్టిని నిర్వహించారు.
దేశంలోని జీవవైవిధ్య స్థలాలు, జీవ భౌగోళిక మండలాలు, 16 అటవీ జాతి రకాలు, 54,733 పువ్వులు, పుష్పజాతులు, 1,03,258 రకాల జంతు జాతులు భారతదేశపు జీవవైవిధ్య సంపదకు తార్కాణంగా నిలిచాయి. చర్చాగోష్టిలో ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. జీవ వైవిధ్య రక్షణ లక్ష్యంగా, 2002వ సంవ్సరపు జీవ వైవిద్య చట్టం, జాతీయ జీవవైవిద్య ప్రాధికార సంస్థ (ఎన్.బి.ఎ.), రాష్ట్రాల జీవవైవిధ్య బోర్డులు (ఎస్.బి.బి.లు), కేంద్ర పాలిత ప్రాంతాల జీవవైవిధ్య మండలులు (యు.టి.బి.సి.లు), జీవ వైవిధ్య నిర్వహణా కమిటీలు (బి.ఎం.సి.లు), సంస్థాగత వ్యవస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు చర్చాగోష్టిలో ముఖ్యంగా ప్రస్తావించారు.
ప్రస్తుతం, 28 ఎస్.బి.బి.లు, 8 యు.టి.బి.సి.లు, 2,76,895 బి.ఎం.సి.లు,, 2,67,345 ప్రజా జీవ వైవిద్య రిజిస్టర్లు (పి.బి.ఆర్.లు) పనిచేస్తున్నాయి. జీవవైవిధ్య పరిరక్షణలో ప్రజా సంఘాల ప్రమేయం..., పరిపూర్ణ జీవనోపాధి, జీవవైవిధ్య పరిరక్షణ అనే రెండు లక్ష్యాల సాధనకు ఉపయోగపడుతుందని సదస్సులో ప్రధానంగా తెలిపారు. భారతదేశం యొక్క జీవవైవిధ్య విశిష్టత, పరిరక్షణ చర్యలను పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాలు ఎస్.బి.బి.లను, యు.టి.బి.సి.లను బలోపేతం చేయడానికి, పి.బి.ఆర్.లను పూర్తి చేయడానికి, ఎలక్ట్రానిక్-పి.పి.ఆర్.లకు మారడానికి మద్దతు ఇవ్వడం ద్వారా చురుకైన విధానాన్ని చేపట్టవచ్చని సదస్సులో పేర్కొన్నారు. ఇప్పటివరకు 14 రాష్ట్రాలు మాత్రమే బయోడైవర్సిటీ వారసత్వ ప్రాంతాలను (బి.హెచ్.ఎస్.లను) ప్రకటించాయి, ఇలాంటి మరిన్ని స్థలాలను ప్రకటించడానికి మిగిలిన 22 రాష్ట్రాలు అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇతర ప్రభావిత-ప్రాంత ఆధారిత సంరక్షణ చర్యలు (ఒ.ఇ.సి.ఎం.) ఇతర పరిరక్షణ చర్యలను గుర్తించడంలో రాష్ట్రాలు కూడా సహకరించాలని సదస్సులో కోరారు. చిత్తడి నేలల పరిరక్షణ, నిర్వహణ కోసం,, సామర్థ్యాల నిర్మాణం, ఔట్‌రీచ్, జాతీయ జలజీవుల వ్యవస్థ సంరక్షణకు సంబంధించిన జాతీయ ప్రణాళిక (ఎన్.పి.సి.ఎ.) అమలు, రామ్‌సర్ ఒడంబడిక తదుపరి ఏర్పాటుతో కూడిన నాలుగు-పాయింట్ల విధానాన్ని పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ చేపట్టింది.
భారతదేశంలో రామ్‌సర్ ప్రదేశాలుగా గుర్తింపు పొందిన చిత్తడి నేలల సంఖ్య 2013లో 26 కాగా, 2022 సంవత్సరానిక కల్లా ఈ సంఖ్య 75కి పెరిగింది. చిత్తడి నేలలు (పరిరక్షణ మరియు నిర్వహణ) నిబంధనలు-2010ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ చిత్తడినేలల సంరక్షణ ప్రాధికార సంస్థలు అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. నియమాల అమలు ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు కూడా విడుదల అయ్యాయి.
దేశంలోని చిత్తడి నేలల సంక్షిప్త పత్రాన్ని తయారు చేయడం, చిత్తడి నేల మిత్రలుగా స్వచ్ఛంద సేవకుల ప్రత్యేక వ్యవస్థను కలిగి ఉండటం, చిత్తడి నేల ఆరోగ్య కార్డులను సిద్ధం చేయడం, సమగ్ర నిర్వహణ ప్రణాళికను అభివృద్ధి చేయడం వంటి నాలుగు కోణాల విధానాన్ని ఎన్.పి.సి.ఎ. అమలులో ఉపయోగిస్తారు. చిత్తడి నేలల సమగ్ర పరిరక్షణ మరియు పునరుద్ధరణ లక్ష్యంతో 2020వ సంవత్సరం మార్చి నెలలో మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికన ఈ పథకం అమలు అవుతుంది. 2022వ సంవత్సరం మార్చి నెలాఖరు వరకూ దేశవ్యాప్తంగా 164 చిత్తడి నేలలకు ఎన్.పి.సి.ఎ. కింద ఆర్థిక సహాయం అందింది. చిత్తడి నేలలకు సంబంధించిన కీలక సమస్యలను, సవాళ్లను పరిష్కరించడానికి, సైట్ నిర్దిష్ట అవసరాల ఆధారంగా సమగ్రమైన మరియు దీర్ఘకాలిక ప్రణాళికను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నిర్వహణకోసం సమగ్ర నిర్వహణ ప్రణాళికలను కూడా ప్రవేశపెట్టాలి. 2020లో సమగ్ర నిర్వహణా ప్రణాళికలను (ఐ.ఎం.పి.లను) రూపొందించే దిశగా విధానం రూపాంతరం చెందడం వల్ల 60కి పైగా చిత్తడి నేలలు ఐ.ఎం.పి.ల పరిధిలోకి వచ్చాయి. ఇంకా, అన్ని రామ్‌సర్ సైట్‌లు మరియు ముఖ్యమైన చిత్తడి నేలల కోసం ఐ.ఎం.పి.లను రూపకల్పన చేస్తున్నారు. సమ్మిళిత పరిరక్షణ నిర్వహణ కోసం షాభగీతా వర్క్‌షాప్ ఇటీవల చేసిన సిఫార్సులను కూడా అమలు చేశారు. ఇది కాకుండా కాలుష్య నివారణ, నియంత్రణపై సమాంతరంగా చర్చాగోష్టులు (స్వచ్ఛమైన గాలికోసం జాతీయకార్యక్రమంపై దృష్టితో) జరిగాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు అనుబంధించిన సంస్థల అధిపతులతో సమావేశాలు కూడా జరిగాయి.
జాతీయ సదస్సు రెండవ రోజు రెండవ చర్చాగోష్టి,.. వ్యావసాయక-అటవీశాస్త్రం (ఆగ్రో ఫారెస్ట్రీ)పై జరిగింది. ఆగ్రో-ఫారెస్ట్రీ, ఫాం ఫారెస్ట్రీ అన్నవి, ప్రకృతి దృశ్యాలను, పర్యావరణ వ్యవస్థ సేవలను మరింత మెరుగుపరుస్తాయి, అదే సమయంలో దేశంలోని కలప డిమాండ్‌లో ఎక్కువ భాగాన్ని నెరవేర్చుతాయి. మరోవైపు, వాతావరణాన్ని తట్టుకునే రీతిలో రైతులకు ఆదాయాన్ని అందిస్తాయి. అటవీ భూముల వెలుపల వ్యవసాయ అటవీ వృక్షాలు, వాణిజ్య చెట్ల పెంపకం రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ఉపాధిని సృష్టించడానికి అద్భుతమైన అవకాశాలను అందిస్తాయి. ఆగ్రోఫారెస్ట్రీ రైతులకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది నేలను సుసంపన్నం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను అందించడానికి రైతులకు సహాయపడుతుంది. బహుళ పర్యావరణ, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను అందించడానికి, అడవులు, చెట్లతో ఆవరించిన విస్తీర్ణంలో మూడింట ఒక వంతును తీసుకురావాలనే జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి, వ్యవసాయ అటవీ విధానంలో ఒక నమూనా మార్పును చేపట్టాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఆగ్రోఫారెస్ట్రీ ప్రచారానికి, విస్తరణకు టాస్క్ ఫోర్స్‌ను, ఉమ్మడి అధ్యయన బృందాలను కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. నాణ్యమైన మొక్కల పెంపకం కోసం నర్సరీల గుర్తింపు, దేశవ్యాప్తంగా ట్రాన్సిట్ పర్మిట్ వ్యవస్థను స్వీకరించడం, మరిన్ని చెట్ల జాతులకు మినహాయింపు ఇవ్వడం, తాలూకాలో చిన్న ప్రాసెసింగ్ కేంద్రాలను ప్రారంభించేందుకు కలప ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు మార్గదర్శకాలను సడలించడం వంటి చర్యలను ఈ కమిటీ నివేదికలు సూచించాయి. స్వదేశీ కలప ధ్రువీకరణ వ్యవస్థ అభివృద్ధి, కలప-కలప ఉత్పత్తుల నాణ్యత నియంత్రణ, దేశీయ మార్కెట్ కోసం భారత ప్రమాణాల విభాగం (బి.ఐ.ఎస్.) వంటి జాతీయ ద్రువీకరణ ఏజెన్సీ ద్వారా, చెట్ల పెంపకందారులకు రుణ సదుపాయం, కేంద్రంలో నేషనల్ వుడ్ కౌన్సిల్ ఏర్పాటు మొదలైనవి ఈ నివేదిక సూచించింది. 2022వ సంవత్సరపు అటవీ (పరిరక్షణ) నియమాల ప్రకారం అక్రెడిటెడ్ పరిహారంతో కూడిన అటవీ పెంపకం వ్యవస్థను కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ తీసుకువచ్చింది, వ్యక్తులు తమ భూమిలో వృక్షసంపదను పెంచడానికి మరియు నష్టపరిహార అటవీ లక్ష్యాలను చేరుకోవాల్సిన వ్యక్తులకు విక్రయించడానికి ప్రోత్సహించడానికి. రైతులకు, చెట్ల పెంపకందార్లకు తోటలను అభివృద్ధి చేయడానికి వ్యవసాయ-అటవీ పెంపకాన్ని చేపట్టడానికి ఇది ప్రోత్సాహకంగా పని చేస్తుందని భావిస్తున్నారు. ఒకే దేశం-ఒకే ప్రోత్సాహం లక్ష్యంగా కలప-అటవీ ఉత్పత్తుల అంతర్రాష్ట్ర తరలింపు కోసం నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ (ఎన్.టి.పి.ఎస్.)ని అనుసరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అభ్యర్థించింది. రాష్ట్రాల రవాణా నియమాలు/చట్టాలలో ఎన్.టి.పి.ఎస్.ను స్వీకరించడానికి అవసరమైన సవరణలు చేయాలని ప్రధానంగా సూచించారు.
అగ్రోఫారెస్ట్రీని ఉద్యమ రూపంలో ప్రోత్సహించడానికి అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రులతో పాటు ఆయా శాఖల కార్యదర్శులు, ప్రధాన అటవీ సంరక్షణ అధికారులు తమ అభిప్రాయాలను, సూచనలను ఈ సదస్సులో, చర్చాగోష్టిలో పంచుకున్నారు. అడవుల వెలుపల ఉద్భవించే చెట్ల కలపను నరికివేయడం, రవాణా చేయడం, నాణ్యమైన మొక్కల పెంపకం పదార్థాల లభ్యత, కలప ఉత్పత్తులను గుర్తించడం, ధ్రువీకరించడం, కలప ఆధారిత పరిశ్రమల నాణ్యతా ప్రమాణీకరణ-ప్రోత్సాహం వంటి అంశాలపై ఇప్పటికే ఉన్న నిబంధనలలో సడలింపులు, విలువలతో కూడిన వ్యవస్థలపై వివరణాత్మక చర్చలు కూడా ఈ సదస్సులో జరిగాయి.
సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, వ్యక్తి సముద్రంలో ఒక బిందువు లాంటివాడని, వ్యక్తులతో కూడిన జట్టు (టీమ్) మాత్రం అపారమైన శక్తి, కలిగిన సముద్రం లాంటిదని అన్నారు. టీమ్ ఇండియా స్ఫూర్తే తమని ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ కేవలం పర్యావరణ పరిరక్షణకు మాత్రమే పరిమితం కాబోదని, దేశ అభివృద్ధిలో సమాన భాగస్వామిగా వ్యవహరిస్తుందని, పర్యావరణ పర్యాటకం, ఆగ్రో ఫారెస్ట్రీ ద్వారా మన జి.డి.పి. మనం మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి యాదవ్ అన్నారు. గాగా, గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో సభికులు మూడు ప్రతిజ్ఞలు చేశారు:
- వాతావరణ మార్పు వల్ల తలెత్తే ప్రపంచ సవాలును ఎదుర్కొనటానికి, ప్రధాన మంత్రి సమర్థ నాయకత్వంలో, పర్యావరణ అనుకూల జీవనశైలి లైఫ్‌ని ప్రోత్సహించగలమంటూ మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం.
- అటవీ జీవనం, అటవీ రక్షణ, హరిత మండలాలను పెంపొందిస్తామని మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం.
- మన దేశాన్ని స్వావలంబనతో తీర్చిదిద్దేందుకు కలప- కలప సంబంధిత ఉత్పత్తులను సంరక్షించేందుకు, వ్యవసాయ-వాణిజ్య అవకాశాలను గుర్తించేందుకు, శాస్త్రీయ మౌలిక సదుపాయాలకు సంబంధించిన విధాన వ్యవస్థను ప్రారంభించేందుకు, రైతుల, గిరిజన సమూహాలు, స్థానిక సంఘాల ఉపాధి అవకాశాలను, ఆదాయ మార్గాలను పెంపొందించడానికి మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం.
సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే, మంత్రిత్వశాఖ కార్యదర్శి లీనా నందన్, అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ సి.పి. గోయల్, DG ఫారెస్ట్ కూడా ప్రసంగించారు. చివరగా, సదస్సులో పాల్గొన్న గుజరాత్ మంత్రులకు, కార్యదర్శులు, ఇతర అధికారులకు కేంద్ర మంత్రి చౌబే హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
*****
(Release ID: 1862074)
Visitor Counter : 343