వ్యవసాయ మంత్రిత్వ శాఖ

తేనె ఉత్పాదనలో స్టార్టప్ కంపెనీల పాత్ర! వారణాసిలో జాతీయ చర్చాగోష్టి నిర్వహణ



ప్రధాని నిర్దేశించిన ‘ఆత్మనిర్భర భారత్’ లక్ష్యం కోసం
వ్యవసాయ శాఖ అవిరళ కృషి..

ఎన్.బి.హెచ్.ఎం. పథకం కింద అగ్రిస్టార్టప్‌లకు
ప్రోత్సాహంపై ప్రభుత్వ దృష్టి కేంద్రీకరణ.

చర్చాగోష్టిలో వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి
డాక్టర్ అభిలాక్ష్ లిఖీ వెల్లడి..

Posted On: 22 SEP 2022 5:34PM by PIB Hyderabad

   ‘తేనె విలువల వ్యవస్థలో వ్యవసాయ సంబంధమైన స్టార్టప్‌ కంపెనీల పాత్ర అనే అంశంపై వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ బీ బోర్డ్ (ఎన్.బి.బి.) ఈ రోజు వారణాసిలో జాతీయ స్థాయి చర్చాగోస్టిని నిర్వహించింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, వారణాసిలోని జాతీయ విత్తన పరిశోధన, శిక్షణా కేంద్రం (ఎన్.ఎస్.ఆర్.టి.సి.) సహకారంతో ఈ చర్చాగోష్టి జరిగింది. తేనెటీగల పెంపకందారులు, హనీ స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘాలు (ఎఫ్.పి.ఒ.లు), తేనెటీగల పెంపకం భాగస్వాములు, వివిధ మంత్రిత్వ శాఖలు/ప్రభుత్వ సంస్థలు/అధ్యయన సంస్థలు, రాష్ట్రాల ఉద్యానవన శాఖలు, రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు (ఎస్.ఎ.యు.లు)/కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాల (సి.ఎ.యు.ల) ప్రతినిధులు, సంబంధిత ఇతర అధికారులు ఈ చర్చాగోష్టిలో పాల్గొన్నారు

   కేంద్ర ఉద్యానవన శాఖ అదనపు కమిషనర్, ఎన్.బి.బి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.కె. పాట్లే ఈ చర్చాగోష్టిలో ప్రారంభోపన్యాసం చేస్తూ, తేనె విలువల వ్యవస్థలో వ్యవసాయ స్టార్టప్ కంపెనీల పాత్రను గురించి క్లుప్తంగా వివరించారు. తేనెటీగల పెంపకంలో నేషనల్ బీ కీపింగ్-హనీ మిషన్ (ఎన్.బి.హెచ్.ఎం.) నిర్వహించే పాత్రను గురించి ఆయన వివరించారు. ఈ విషయంలో తేనె ఉత్పాదనా స్టార్టప్ కంపెనీలు, ఎఫ్.పి.ఒ.లు నిర్వహించే పాత్ర గురించి కూడా ఆయన చెప్పారు. తేనె సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ ప్రక్రియ, బ్రాండింగ్ కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఎన్.బి.హెచ్.ఎం. పథకం అమలు గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ ఏర్పాట్లతో దేశంలో తేనెటీగల పెంపకం సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఎన్.బి.హెచ్.ఎం. పథకం కింద అందుబాటులో ఉన్న ఈ సదుపాయాలన్నింటినీ వినియోగించుకోవలసిందిగా, తేనె ఉత్పాదనా రంగంలోని స్టార్టప్ కంపెనీలను, వ్యవసాయ ఉత్పత్తిదార్ల సంఘాలను కోరారు. తేనె, తదితర ఉప ఉత్పత్తుల ద్వారా అదనపు ఆదాయం పొందేందుకు వీలుగా, తేనెటీగల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని సూచించారు.

   వారణాసి ఎన్.ఎస్.ఆర్.టి.సి. ఆవరణలో ఉంటున్న ఐ.ఆర్.ఆర్.ఐ. దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం (ఐ.ఎస్.ఎ.ఆర్.సి.) డైరెక్టర్ డాక్టర్ సుధాంశు సింగ్ మాట్లాడుతూ, దేశంలో తేనెటీగల పెంపక సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తేనె ఉత్పాదనా స్టార్టప్ కంపెనీలకు, వ్యవసాయ ఉత్పత్తిదార్ల సంఘాలకు మద్దతు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. భారతీయ వ్యవసాయ రంగం, తేనెటీగల పెంపకంలో పరిస్థితిని మరింత మెరుగుపరచాలంటే, చిన్నతరహా, మధ్యతరహా తేనెటీగల పెంపకందార్లపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాల్సి ఉందని, భారతీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగాన్ని వారే ప్రభావితం చేస్తున్నారని ఆయన అన్నారు. తేనెటీగల పెంపకం, తేనె ఉత్పాదనలో కీలకంగా పనిచేస్తున్న వ్యవసాయ ఔత్సాహిక ఉత్పత్తిదార్లకు, స్టార్టప్ కంపెనీలకు ఎన్.బి.హెచ్.ఎం. సహాయపడుతూ వస్తోందని అన్నారు. వ్యవసాయాన్ని,..  అంటే కృషిని ఆత్మనిర్భర కృషిగా మార్చేందుకు ఎఫ్.పి.ఒ.ల ఏర్పాటు, ప్రోత్సాహం అనేవి తొలి అడుగులు కావాలని ఆయన అన్నారు. ఎన్.బి.హెచ్.ఎం. పథకం అమలుతో తేనెటీగల పెంపకంలో వ్యవస్థీకృత ప్రక్రియ మరింత బలోపేతం కాగలదని, తేనె ఉత్పాదనా స్టార్టప్ కంపెనీలు కూడా పటిష్టపడగలవని ఆయన అన్నారు.

   కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశాన్ని పూర్తి స్వావలంబనతో ఆత్మనిర్భర భారత్‌గా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు వ్యవసాయ ప్రధానమైన స్టార్టప్ కంపెనీల, వ్యవసాయ ఉత్పత్తిదార్ల సంఘాల అభివృద్ధికోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందుకోసం ఎన్.బి.హెచ్.ఎం. పథకం కింద మద్దతు అందిస్తున్నదని, తేనెటీగల పెంపకాన్ని ఆకర్షణీయమైన ఉపాధి మార్గంగా మార్చుకునేలా ప్రభుత్వం తగిన ప్రేరణను అందిస్తున్నట్టు తెలిపారు. ఎన్.బి.హెచ్.ఎం. పథకం అమలుతో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంలో నైపుణ్యాల నవీకరణకు, తేనెతో పాటుగా, మైనం, ప్రొపోలిస్, రాయల్ జెల్లీ, తేనెటీగల విషం వంటి ఉప ఉత్పాదనల ప్రాసెసింగ్ కోసం అధునాతన మౌలిక సదుపాయాల ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు. క్వాలిటీ కంట్రోల్ లేబరేటరీల ద్వారా నాణ్యతా పెంపు ప్రక్రియకు, మెరుగైన సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఎన్.బి.హెచ్.ఎం. పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు.

   వారణాసిలోని ఎన్.ఎస్.ఆర్.టి.సి. సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎం.పి. యాదవ్ మాట్లాడుతూ, వ్యవసాయం, ఉద్యానవనం రంగాల్లో కొత్తగా ఆవిర్భవించే వ్యవసాయ స్టార్టప్ కంపెనీలు మరింత ముందుకు వచ్చేందుకు ఇలాంటి చర్చాగోష్టులు, అవగాహనా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. తేనెటీగల పెంపకం వంటి రంగాల్లో అవి సిద్ధపడేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. తేనెటీగల పెంపకంలో ప్రమేయం ఉన్న స్టార్టప్ కంపెనీలకు అన్ని విధాల మద్దతు అందిస్తామని చర్చాగోష్టిలో పాల్గొన్న వారికి ఆయన హామీ ఇచ్చారు.

  జాతీయ వ్యవసాయ, విస్తరణా నిర్వహణా సంస్థ (మేనేజ్-ఎం.ఎ.ఎన్.ఎ.జి.ఇ.)కు చెందిన స్టార్టప్ కంపెనీలు, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ట్రైబ్ గ్రోన్ ఎంటర్‌ప్రైస్; మధ్యప్రదేశ్ రాజధాని, భోపాల్‌కు చెందిన వనబంధు ఎన్.ఆర్.ఎం. (ఒ.పి.సి.) ప్రైవేట్ లిమిటెడ్; హర్యానాలోని రోహ్తక్‌కు చెందిన రఘుంటి బీ ప్రాడక్ట్స్; ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీకి చెందిన ముధు మఖీ వాలా ప్రతినిధులు; జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) అనుబంధించిన  బ్రిజ్ హనీఫెడ్ ఎఫ్.పి.ఒ.ల తరఫున సతీశ్ శర్మ; ఇన్నవేటివ్ బీ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున రంజీత్ కుమార్ తదితరులు చర్చాగోష్టిలో తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకున్నారు.  దేశంలో మార్కెట్ అవుతున్న తమ ఉత్పాదనలను గురించి వారు వివరించారు. వివిధ భాగస్వామ్య వర్గాల వారు ఏర్పాటు చేసిన తేనెల విలువల వ్యవస్థ ప్రాముఖ్యతను గురించి వారు ప్రధానంగా ప్రస్తావించారు. తేనెటీగల పెంపకం, ముడి తేనె ఉత్పాదన, తేనెటీగలకు ఆహారం అందించడం వంటి రంగాలను ఈ స్టార్టప్ కంపెనీలు ప్రోత్సహిస్తూ వస్తున్నాయి.

https://ci5.googleusercontent.com/proxy/n0gGfPwcR_53_FSEHPlwaLmGMa7XeJ5jBU9EFaBSJ3pqVmh1UphBMhXCEAL67_Pyyxsd_nRL-DWLdpbgLjWOUP_AjHeFixFPmDQflQ_ASHiGlkax6z4G--e4RQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001TDLH.jpg

https://ci3.googleusercontent.com/proxy/cf43Dyva_MWh_i67v42RNcp3FjP1uLluNwfxGN4HREsxFks9Qx4UBZwXrs-YUcMqbo3-SzO6tQMQ4Rq_ZetQ4Whh1e-ZUqBYZy1Zw6C-gHpCr5VvybPIGn7n0g=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0028XDP.jpg

****



(Release ID: 1861616) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Hindi