సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
"హైదరాబాద్ విమోచన దినోత్సవ" సంబురాలను ఏడాదిపాటు జరుపుకోవడానికి ఆమోదం తెలిపిన భారత ప్రభుత్వం
సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా
Posted On:
03 SEP 2022 7:50PM by PIB Hyderabad
భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన ఏడాది తర్వాత స్వేచ్ఛావాయువులు పీల్చిన తెలంగాణ గడ్డపై స్వాతంత్ర్య వజ్రోత్సవాలను (75 ఏళ్ల సంబురాలు) ఘనంగా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. "హైదరాబాద్ విమోచన దినోత్సవ" సంబురాలను ఏడాదిపాటు జరుపుకోవడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానుండగా.. తెలంగాణ ముఖ్యమంత్రి తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులను కూడా హైదరాబాద్ లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా హాజరుకావాలని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది..
సంవత్సర కాలం పాటు నిర్వహించే ఈ సంస్మరణ కార్యక్రమాలు సంస్ధానం విముక్తి కోసం, భారతదేశంలో సంస్ధానం విలీనం కావడానికి తమ జీవితాలను అర్పించిన వారందరికీ నివాళులర్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.భారత స్వాతంత్ర్య సంగ్రామంలో, సంస్ధానం విమోచనంలో మన పెద్దలు చేసిన త్యాగాలను, వారి శౌర్య, పరాక్రమాలను ప్రస్తుత తరానికి తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు ఏడాది తర్వాత అంటే 17 సెప్టెంబర్, 1948లో, హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది.
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా రాంజీ గోండ్ చేసిన పోరాటంతో సహా మొత్తం స్వాతంత్ర్యోద్యమంలో జరిగిన పోరాటాలకు సంబంధించిన దృష్టాంతాలతో చరిత్ర నిండి ఉంది; కొమరం భీం పోరాటం; 1857లో హైదరాబాదు నగరంలోని కోఠిలో బ్రిటిష్ రెసిడెంట్ కమీషనర్ నివాసంపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనుకున్న తుర్రేబాజ్ ఖాన్ శౌర్య పరాక్రమాలు మనకు ఉదాహరణలుగా నిలుస్తాయి.
భారత స్వాతంత్ర్యానంతరం ఈ పోరాటం ఉధృతంగా మారింది. వందేమాతరాన్ని ఆలపిస్తూ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయాలనే డిమాండ్ తో, ప్రజల ఆకస్మిక భాగస్వామ్యంతో, ఈ పోరాటం ఒక భారీ ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందింది.
‘ఆపరేషన్ పోలో’ పేరుతో నాటి కేంద్ర హోంమత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ త్వరితగతిన, సమయానుగుణంగా తీసుకున్న చర్యలవల్లే హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభించింది.
నిజాం ఆధీనంలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణ, మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతం, అందులో ఔరంగాబాద్, బీడ్, హింగోలి, జల్నా, లాతూర్, నాందేడ్, ఉస్మానాబాద్, పర్భనీ జిల్లాలు, ప్రస్తుత కర్ణాటకలోని కలబురగి, బళ్లారి, రాయచూర్, యాద్గిర్ ,కొప్పల్, విజయనగరం, బీదర్ జిల్లాలు ఉన్నాయి.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా సెప్టెంబర్ 17 ను విమోచన దినంగా జరుపుకుంటున్నాయి.
(Release ID: 1856582)
Visitor Counter : 634