జౌళి మంత్రిత్వ శాఖ
దేశంలో టెక్నికల్ టెక్స్‌టైల్స్ మార్కెట్ ప్రగతికి చర్యలు
మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ, సహకారాలకు
ఇదే తగిన తరుణమన్న కేంద్రమంత్రి దర్శనా జర్దోష్
ఈశాన్య ప్రాంతం మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో
టెక్నికల్ టెక్స్‌టైల్స్ వినియోగానికి విస్తృత అవకాశాలు..
మణిపూర్ సి.ఎం. ఎన్. బీరెన్ సింగ్ అభిప్రాయం
వ్యవసాయం, క్రీడలు, మౌలిక సదుపాయాలు,
హస్తకళల్లో వృద్ధిని సద్వినియోగం చేసుకోవాలని
పారిశ్రామిక రంగానికి వినతి
Posted On:
23 AUG 2022 6:03PM by PIB Hyderabad
సంప్రదాయబద్ధమైన జవుళి (టెక్స్‌టైల్) స్థానంలో సాంకేతిక నైపుణ్యంతో కూడిన టెక్నికల్ టెక్స్‌టైల్స్ ఉత్పాదనలను అభివృద్ధి చేసే లక్ష్యంతో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో టెక్నికల్ టెక్స్‌టైల్స్ పేరిట ఒక సదస్సును కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 23న నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ఈ సదస్సును ప్రారంభించారు. కేంద్ర జవుళి, రైల్వే శాఖల సహాయమంత్రి దర్శనా జర్దోష్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. మణిపూర్ రాష్ట్ర జవుళి, వాణిజ్యం, పరిశ్రమలు, సహకార శాఖల మంత్రి నేమ్చా కిప్గెన్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. జియో టెక్స్‌టైల్, ఆగ్రో టెక్స్‌టైల్స్ రంగాలకు చెందిన సాంకేతిక పరిజ్ఞానపరమైన ఉత్పాదనలు, వాటి వినియోగంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారు.
మణిపూర్ ప్రభుత్వం, భారత సైన్యం, సంబంధిత మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ పరిశోధనా సంఘాల ప్రతినిధులు, అధికారులు మరియు ప్రతినిధులతో సహా మొత్తం 150 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొన్నారు.
కేంద్రమంత్రి దర్శనా విక్రమ్ జర్దోష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, జవుళి రంగంలో సాంకేతిక పరిజ్ఞానపరమైన అప్లికేషన్‌ను, ఉత్పాదనలను ముందుకు తీసుకురావడంలో వివిధ మంత్రిత్వ శాఖల సహకార బృందం తీసుకున్న క్రియాశీలక చర్యలు అభినందనీయమని అన్నారు. దేశంలోని జవుళి రంగంలో ఈ అప్లికేషన్ వినియోగానికి తీసుకున్న చర్యలను కూడా ఆమె అభినందించారు. దేశంలో టెక్నికల్ టెక్స్‌టైల్స్ అభివృద్ధికి బాటలు వేయడంలో వివిధ మంత్రిత్వ శాఖల మధ్య పటిష్టమైన సమన్వయం, సహకారం కీలకపాత్ర వహిస్తాయని అన్నారు. అలాగే, జవుళి మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ మధ్య సమన్వయం, సహకార సంబంధాలు అవసరమని అన్నారు.
జవుళి రంగం అభివృద్ధి కోసం చేపట్టిన అనేక పథకాలను గురించి కేంద్రమంత్రి జర్దోష్ ప్రస్తావించారు. ఉత్పాదకతతో ముడివడిన బీమా పథకం (పి.ఎల్.ఐ.)తో పాటు, పి.ఎం. మిత్ర, కాటన్ బేస్డ్ టెక్స్‌టైల్స్ కేంద్రాన్ని టెక్నికల్ టెక్స్‌టైల్స్‌గా మార్చేందుకు నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్ (ఎన్.టి.టి.ఎం.) పథకం వంటి వాటిని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. “అనుమతుల మంజూరుకు సంబంధించి అతి తక్కువ నిబంధనలు, షరతులతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టేలా తగిన ప్రాధాన్యాన్ని రాష్ట్రాలకు అందించేందుకు గతిశక్తి నమూనా ఎంతగానో ఉపయోగపడుతోంద’’ని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో సులభతర వాణిజ్య నిర్వహణ, వాణిజ్యావకాశాలు గత కొన్నేళ్లలోనే గణనీయంగా పెరిగాయని ఆమె అభిప్రాయపడ్డారు.
కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి సంక్షోభ సమయంలో వ్యక్తిగత రక్షణ పరికరాలను (పి.పి.ఇ. కిట్లను), మాస్కులను దిగుమతి చేసుకునే స్థాయినుంచి, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎగుమతిదారు స్థాయికి భారతదేశం ఎదిగిందని, అమేరకు సామర్థ్యాలను విస్తృతం చేసుకోగలిగిందని అన్నారు. భారతదేశం అనతి కాలంలోనే ఈ రంగంలో స్వావలంబన సాధించి, ఆత్మనిర్భర భారత్‌గా ఎదిగిందని అన్నారు. పటిష్టమైన నైపుణ్యాల కల్పనా వ్యవస్థ, శిక్షణ కూడా టెక్నికల్ జవుళి మార్కెట్ అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించడానికి దోహదం చేశాయని ఆమె అన్నారు. ఈ రంగంలో శిక్షణకోసం రూ. 400కోట్లను కేటాయించినట్టు జర్దోష్ చెప్పారు. ఆయా శాఖల ద్వారా జియో టెక్స్‌టైల్స్, ఆగ్రోటెక్స్‌టైల్స్ ఉత్పాదనల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆమె మణిపూర్ ప్రభుత్వ అధికారులకు పిలుపునిచ్చారు.
ప్రారంభోత్సవ సమావేశంలో మణిపూర్ ముఖ్యమత్రి బీరెన్ సింగ్ మాట్లాడుతూ, టెక్నికల్ టెక్స్‌టైల్స్ వినియోగానికి సంబంధించి మణిపూర్‌కు ఉన్న సాధ్యాసాధ్యాలను, అవకాశాలను వివరించారు. మణిపూర్‌లో ప్రత్యేకించి ఇంఫాల్ నగరంనుంచి మావో ప్రాంతం వరకు గల మార్గంలో జియో టెక్స్‌టైల్స్ వినియోగానికి గల అవకాశాలను ఆయన వివరించారు. జియో టెక్స్‌టైల్స్ సాంకేతిక పరిజ్ఞానం ఇంఫాల్- జరీబామ్ లైన్లోని రైలు మార్గాలపై ఇప్పటికే వినియోగంలో ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, ప్రత్యేకించి మణిపూర్ రాష్ట్రంలో సంవత్సరం పొడవునా భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని, వరదలు, మట్టిచరియలు విరిగి పడటం, భూమికోత కారణంగా ఈ ప్రాంతాల్లో జియె టెక్స్‌టైల్స్, సింథటిక్ ఉత్పాదనల వినియోగానికి అవకాశం ఏర్పడుతోందని అన్నారు.
రాష్ట్రాల అవసరాలను అర్థం చేసుకుని, వాటికి ప్రభుత్వంతోపాటు, పారిశ్రామిక భాగస్వామ్య వర్గాలు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని, ఆయన అన్నారు. వినూత్నమైన మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకు మణిపూర్ రాష్ట్రాన్ని పర్యటించవలసిందిగా ఆయన అధికారులకు, పారిశ్రామిక వేత్తలకు విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో మణిపూర్ రాష్ట్రం గత ఐదేళ్లలో గణనీయంగా మార్పు చెందిందని బీరెన్ సింగ్ అన్నారు.
మణిపూర్ రాష్ట్రానికి మరింత రవాణా సౌలభ్యం కల్పించేందుకు ఇంపాల్-జరీబామ్ ప్రాంతం, ఇంపాల్-దిమాపూర్ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి నిర్వహణకోసం అంకితభావంతో పనిచేసే బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం, క్రీడలు, మౌలిక సదుపాయాలు, హస్తకళలు వంటి రంగాల్లో వృద్ధిని వేగవంతం చేసేందుకు గల అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేయాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు బీరెన్ సింగ్ పిలుపునిచ్చారు.
మణిపూర్ జవుళి, వాణిజ్యం, పారిశ్రామికాభివృద్ధి, సహకార శాఖల మంత్రి నిమ్చా కిప్గెన్ మాట్లాడుతూ, భారతదేశంలో, ప్రత్యేకించి దేశంలోని ఈశాన్య ప్రాంతంలో టెక్నికల్ టెక్స్‌టైల్స్ ప్రాధాన్యాన్ని గురించి వివరించారు. అభివృద్ధికి అవకాశం ఉన్న రంగాలను కలిగి ఉన్న ప్రాంతంగా ఈశాన్య ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు. భవిష్యత్తులో టెక్నికల్ టెక్స్‌టైల్స్ వినియోగం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, వ్యవసాయక, అటవీ రంగాలు, రైల్వే, ఆరోగ్యరక్షణ తదితర రంగాల్లో టెక్నికల్ టెక్స్‌టైల్స్ వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు.
మౌలిక సదుపాయాల్లో నాణ్యతను మెరుగుపరిచేందుకు నిర్మాణ రంగంలో టెక్నికల్ టెక్స్‌టైల్స్‌ను ప్రత్యేకించి జియో టెక్స్‌టైల్స్‌ను విస్తృతంగా ప్రోత్సహించాల్సిన తరుణం ఇప్పటికే ఆసన్నమైందని నిమ్చా కిప్గెన్ అభిప్రాయపడ్డారు. మణిపూర్‌తోపాటు, మిగతా ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక రంగాన్ని మెరుగుపరిచడంలో జియో టెక్స్‌టైల్స్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్నారు.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అర్మానే మాట్లాడుతూ, గత మూడేళ్లలో ప్రభుత్వం 30నుంచి 40కిలోమీటర్ల నిడివిమేర రోడ్లను నిర్మిస్తూ వస్తోందని, జియో టెక్స్‌టైల్స్‌ను వినియోగించేందుకు ఇది విస్తృత అవకాశాన్ని కల్పించిందని అన్నారు. జియో టెక్స్‌టైల్స్ వినియోగంతో రోడ్లను త్వరగా, నాణ్యతతో నిర్మించేందుకు అవకాశం ఏర్పడిందని అన్నారు. జియో టెక్స్‌టైల్స్ వినియోగంతో పేవ్‌మెంట్ల మన్నిక 30నుంచి 40ఏళ్లు పెరిగిందన్నారు. జాతీయ రహదారులు, ఇతర కట్టడాల నిర్మాణంలో జియో సింథటిక్ ఉత్పాదనలను వినియోగించేందుకు ప్రత్యేకంగా ఒక విభాగం ఉండాలని పేర్కొంటూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2020, డిసెంబరు 14వ తేదీన ఒక సర్క్యులర్‌ను జారీ చేసిందని అర్మానే తెలిపారు. రహదారుల అభివృద్ధి సంబంధిత అంశాల్లో విభిన్నమైన జియోటెక్స్‌టైల్స్ ఉత్పాదనల వినియోగానికి సంబంధించి అనేక నిబంధనలను, ప్రమాణాలను రూపొందించినట్టు ఆయన తెలిపారు.
రహదారుల పేవ్‌మెంట్లను బలోపేతం చేయడానికి వాలుగా ఉండే మార్గాల్లో ఒత్తిడిని తగ్గించడానికి, మురుగునీటి పారుదల వ్యవస్థ రక్షణ, స్థిరీకరణకు జియో టెక్స్‌టైల్స్ ఉత్పాదనలను వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ ఉత్పాదనల్లో ఎక్కువ భాగం భారతదేశంలోనే తయారవుతున్నాయని అన్నారు.
జియో సింథటిక్స్, జియోగ్రిడ్లు, జియోనెట్స్, నేచురల్ ఫైబర్స్ తదితర ఉత్పాదనల వినియోగానికి సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అనేక అధ్యయనాలను కూడా నిర్వహిస్తోందని అన్నారు. ఐ.ఐ.టి. హైదరాబాద్, ఐ.ఐ.టి. చెన్నైతో సహా పలు అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో ఈ మేరకు అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. భారతదేశంలో జియో టెక్స్‌టైల్స్ ఉత్పాదనలను వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు వివిధ విద్యాసంస్థలు, ప్రభుత్వం కలసికట్టుగా పనిచేయాల్సి ఉందని అన్నారు. ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు వీలు కల్పిస్తూ, టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖలతో ఒక కార్యక్రమాన్ని రూపొందించవచ్చని ఆయన సూచించారు.
ఎన్.టి.టి.ఎం. సంబంధించిన ఉత్పాదనలపై ఒక అధ్యయన కార్యక్రమాన్ని కేంద్ర జవుళి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజీవ్ సక్సేనా ఈ సదస్సులో సమర్పించారు. ఎన్.టి.టి.ఎం. పథకానికి సంబంధించిన నాలుగు విభాగాలను (పరిశోధన-ఆవిష్కరణ, నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ, మార్కెటింగ్, ఎగుమతి ప్రోత్సాహం) గురించి ఆయన వివరించారు.
ఈ పథకంకింద పలు కార్యక్రమాలను చేపట్టారు. స్పెషాల్టీ ఫైబర్స్-జియో టెక్స్‌టైల్స్, టెక్నికల్ టెక్స్‌టైల్స్ ఉత్పాదనలకు సంబంధించి 31 కొత్త హెచ్.ఎస్.ఎన్. కోడ్‌ల రూపకల్పన తదితర అంశాలతో 31 ప్రాజెక్టులను మంజూరు చేశారు. ఇందుకోసం రూ. 108కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఇదే ప్రాజెక్టు పరిధిలో,.. భారతీయ ప్రమాణాల విభాగం (బి.ఐ.ఎస్.), తదితర సంస్థలతో కలసి 500కు పైగా ప్రమాణాలకు రూపకల్పన చేస్తున్నారు.
****
(Release ID: 1854002)
Visitor Counter : 166