భారత ఎన్నికల సంఘం
ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రాల సి.ఇ.ఒ.ల సమావేశం!
ఎన్నికల ప్రక్రియలో తమ అనుభవాలను
కలబోసుకున్న అధికారులు...
ఎన్నికల నిర్వహణకు విజయవంతమైన ప్రక్రియలు
చేపట్టాలని సి.ఇ.సి. రాజీవ్ కుమార్ పిలుపు..
ఎన్నికల నిర్వహణలో సేవలందించిన
హోమ్, సి.ఎ.పి.ఎఫ్., రైల్వే అధికారులకు,
సిబ్బందికి కమిషన్ సత్కారం
Posted On:
10 AUG 2022 6:12PM by PIB Hyderabad
దేశంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రధాన ఎన్నికల అధికారులతో (సి.ఇ.ఒ.లతో) భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు ఒక సమావేశాన్ని నిర్వహించింది. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమొక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో జరిగిన ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సి.ఇ.ఒ.లు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
2021వ సంవత్సరంలో, 2022లో ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను, అమలు చేసిన పద్ధతులను గురించి అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రణాళిక, వ్యయ పర్యవేక్షణ, వోటర్ల జాబితా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి.) అప్లికేషన్లు, సమాచార వ్యవస్థ నిర్వహణ (డేటా మేనేజ్మెంట్), ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు/వి.వి.పి.టి.లు, ఎన్నికల నిర్వహణపై ఎస్.వి.ఇ.ఇ.పి. వ్యూహం, మీడియా మరియు కమ్యూనికేషన్ తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన కమిషనర్ (సి.ఇ.సి.) రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, అనేక సవాళ్లతో కూడిన పరీక్షా సమయంలో కూడా ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు (సి.ఇ.ఒ.లకు) అభినందనలు తెలిపారు. ఎన్నికల కమిషన్ నిజాయతీ, సమగ్రత విషయంలో ఎలాంటి రాజీలేని రీతిలో, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియలను వివిధ రాష్ట్రాలు నిక్కచ్చిగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని (ఐ.టి.ని) ఉపయోగించడానికి సి.ఇ.ఒ.లు స్వయంగా తీసుకోవలసిన చొరవను, సృజనాత్మక ఆవిష్కరణలను ప్రామాణికంగా అమలు చేయదగిన అంశాలతో సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని, డూప్లికేషన్‌ను నివారించడానికి వీటిని ఎన్నికల కమిషన్ ఐ.టి. వ్యవస్థలతో/యాప్‌లతో సమ్మిళితం చేయాల్సిన అవసరం ఉందని ఎన్నికల ప్రధాన కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహణా సామగ్రిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల నిర్వహణా సామగ్రిని, ఇంటర్నెట్ పోర్టల్‌ను గరిష్టస్థాయిలో వినియోగించుకునేందుకు, రాష్ట్రాల యంత్రాగాలు, ఎన్నికల కమిషన్ రూపొందించిన సమాచారంతో సులభంగా అందరికీ అనుసంధానం కలిగించేందుకు ఇది అవసరమని అన్నారు. ఇందుకు సంబంధించి జాతీయ స్థాయి, రాష్ట్రాల స్థాయిలోని ప్రకృతి వైపరీత్యాల ప్రతిస్పందనా దళం బృందాలతో సమన్వయం కోసం తగిన చర్యలు తీసుకోవలసిందిగా వివిధ రాష్ట్రాల సి.ఇ.ఒ.లను ఆదేశించినట్టు చెప్పారు. సమన్వయంకోసం సమావేశాలు నిర్వహించవలసిందిగా సూచించారు. అనుసంధాన వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు మారిపోతున్న నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లను జియో ట్యాగింగ్ చేయాల్సిన అవసరం ఉందని, రూట్ చార్జులను జిల్లా యంత్రాంగం సవరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
ఈ సమావేశం సందర్భంగా వోటర్లకు అవగానాకల్పనపై కూడా చర్చ జరిగింది. సి.ఇ.సి. రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణపై స్వీప్ వ్యూహాన్ని అట్టడుగు స్థాయిలో అమలుచేయాల్సిన అవసరం ఉందని, తక్కువ శాతం వోట్లు పోలయ్యే పోలింగ్ కేంద్రాలపై విశ్లేషణ జరగాలని, ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి వ్యవస్థాపరమైన మెరుగుదలకు, వోటింగ్ శాతం పెంచేందుకు గాను ఎపటికప్పుడు అభిప్రాయసేకరణను తనకు అందజేయాలని ఆయన సి.ఇ.ఒ.లను కోరారు.
ఎన్నికల కమిషనర్ అనూప్‌చంద్ర పాండే మాట్లాడుతూ, ఇప్పటికే పోలింగ్ జరిగిన రాష్ట్రాల్లో అనుసరించిన పద్ధతులు, ఉత్తమ విధానాలపై చర్చజరగాల్సిన అవసరం ఉందని, ఇవే పద్ధతులను ఇతర రాష్ట్రాల్లో కూడా అనుసరించవచ్చని అన్నారు. ఇదివరకు జరిగిన ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలు అమలు చేసిన ఉత్తమ పద్ధతులను గురించి ఆయన ఈ సందర్భంగా వివరించారు. తమిళనాడులో అమలు చేసిన ప్రణాళికల సమీకృతం, గోవాలో అమలుచేసిన చాట్‌బాట్ వ్యవస్థ, అస్సాంలో వినియోగించిన అవగాహనా నిర్వహణా వ్యవస్థ వంటి ప్రక్రియలను ఆయన ప్రస్తావించారు. దివ్యాంగ వోటర్లకోసం ఉత్తరాఖండ్ రాష్ట్రం చేపట్టిన ప్రత్యేక చర్యలను, వోటర్ల అవగాహన కోసం పోస్టల్ శాఖతో కలసి చేపట్టిన మేఘదూత్ పోస్ట్ కార్డు ప్రక్రియ, అనుభవ్ మొబైల్ యాప్ పేరిట పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను కూడా ఆయన ప్రస్తావించారు. ఎన్నికల ప్రక్రియ నిజాయతీని కాపాడే విషయంలో సి.ఇ.ఒ. బృందాలు ఎంతో జాగరూకతతో, నిఘాతో వ్యవహరించాల్సి ఉంటుందని, ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా చట్టప్రకారం చర్యలు తీసుకోవలసి ఉంటుందని పాండే చెప్పారు.
ఆధార్ వివరాల సేకరణకు ఎన్నికల కమిషన్ ఇటీవల చేపట్టిన కార్యక్రమాన్ని గురించి పాండే ప్రస్తావిస్తూ, ఈ వివరాల సేకరణలో ఎన్నికల కమిషన్ మార్గదర్శక సూత్రాలకు కచ్చితంగా కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. 2022 ఆగస్టు ఒకటవ తేదీన ఈ కార్యక్రమం చేపట్టినప్పటినుంచి 2.5కోట్ల మేర ఆధార్ వివరాలను స్వచ్ఛంద సేకరణ నిర్వహించడంలో సి.ఇ.ఒ.ల కృషి అభినందనీయమని అన్నారు.
2022వ సంవత్సరంలో జరిగిన వివిధ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా, పారదర్శకంగా జరిగేలా గణనీయమైన సేవలందించిన హోమ్ మంత్రిత్వ శాఖ అధికారులను, కేంద్ర సాయుధ పోలీసు బలగాలను, రైల్వే మంత్రిత్వ శాఖను ఈ సమావేశంలో ఎన్నికల కమిషన్ అభినందించింది. వారిని సముచిత రీతిన సత్కరించింది. ఎన్నికలను సజావుగా నిర్వహించే ప్రయత్నంలో భాగంగా, ఎన్నికల విధుల్లో ఉన్న వివిధ బలగాల సిబ్బంది దుర్గమమైన పర్వత ప్రాంతాల్లో కూడా ఒక రాష్ట్రంనుంచి, మరో రాష్ట్రానికి చాలా దూరాలు ప్రయాణించాల్సి వచ్చిందని కమిషన్ పేర్కొంది. 2022లో వివిధ రాష్ట్రాల శాసనసభల ఎన్నికల సందర్భంగా కాలబద్ధమైన రీతిలో వారు వేసుకున్ననిర్దిష్టమైన ప్రణాళికలు ఎంతైనా అభినందనీయమని ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఎన్నికల కమిషన్ నిర్వహించిన అన్ని ఎన్నికల్లోనూ విధుల నిర్వహణకోసం తరలించిన వివిధ బలగాల అడ్‌హాక్ కమాండెంట్లు, కమాండెంట్లకు గౌరవ భృతిని అందించినట్టు చెప్పారు.


ఈ సందర్భంగా ఎన్నికలపై ఎ-వెబ్ ఇండియా జోర్నల్ వెలువరించిన తాజా ప్రచురణను కూడా ఎన్నికల కమిషన్ ఆవిష్కరించింది. ఎ-వెబ్ సంఘానికి చెందిన ప్రతినిధులనుంచి పరిశోధనాత్మక వ్యాసాలను, అధ్యయన పత్రాలను ఈ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ప్రచురణ ద్వారా వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఎ-వెబ్ అనేది ప్రపంచంలోని వివిధ ఎన్నికల నిర్వహణా సంస్థలతో కూడిన అతిపెద్ద సంఘం.

ఎన్నికలు జరిగిన వివిధ రాష్ట్రాలకు చెందిన సి.ఇ.ఒ.లు ఈ సమావేశంలో ప్రసంగించారు. ఇటీవల వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ అనుభవాలను, అధ్యయనాలను, తాము అనుసరించిన సృజనాత్మక ఆవిష్కరణలను గురించి వారు వివరించారు. త్వరలో ఎన్నికలకు వెళ్లబోయే రాష్ట్రాలకు చెందిన సి.ఇ.ఒ.లు కూడా తమ ఎన్నికల సన్నాహాలను, తాము నిర్వహిస్తున్న ముందస్తు కార్యకలాపాలను గురించి వివరించారు. అలాగే, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోను వోటర్ల జాబితాను మెరుగుపరిచేందుకు తాము ప్రధానంగా చేపట్టిన కార్యక్రమాలను కూడా వారు వివరించారు.

ఎన్నికల కమిషన్‌కు చెందిన సీనియర్ అధికారులు, డైరెక్టర్ జనరల్స్, డిప్యూటీ ఎన్నికలకమిషనర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
******
(Release ID: 1850742)
Visitor Counter : 224