జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామీణ ప్రాంత గృహాలకు కుళాయిల ద్వారా నీటి సరఫరా

Posted On: 08 AUG 2022 3:53PM by PIB Hyderabad

దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి జల్ జీవన్ మిషన్- హర్ ఘర్ జల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. జల్ జీవన్ మిషన్ ప్రారంభం అయ్యే సమయానికి దేశంలో 3.23 కోట్ల గ్రామీణ గృహాలు కుళాయి ద్వారా నీరు పొందుతున్నాయి. జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన తర్వాత ఇంతవరకు గత 36 నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 6.70 కోట్లకు పైగా గృహాలకు  కుళాయి  కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. దీనితో కొళాయి కనెక్షన్లు కలిగిన గృహాల సంఖ్య 9.94 కోట్లకు చేరింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 19.11 కోట్ల  గృహాలలో 9.94 కోట్ల గృహాలు ( 51.99%) ప్రస్తుతం  కుళాయి   కనెక్షన్ కలిగి ఉన్నాయి. 

కర్ణాటక రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ప్రారంభం అయ్యే సమయానికి 24.51 లక్షల గృహాలు కుళాయి కనెక్షన్ కలిగి ఉండేవి. 03.08.2022 నాటికి 29.20 లక్షల గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. తాజా సమాచారం ప్రకారం కర్ణాటక రాష్ట్రం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 101.08 గృహాలలో 53.71 లక్షల గృహాలు (53.08%) కుళాయి ద్వారా నీటి సరఫరా పొందుతున్నాయి. 

జల్ జీవన్ మిషన్ మార్గదర్శకాల ప్రకారం   నీటి లభ్యత, నాణ్యతపై ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం/గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. పని అంచనా వ్యయం, డిజైన్ రూపకల్పనపై గ్రామ పంచాయతీ/ లేదా దాని ఉప కమిటీ (గ్రామీణ నీరు మరియు పారిశుధ్యం కమిటీ)/పానీ సమితి/వినియోగదారుల సంస్థ మొదలైన వాటికి ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం/గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం సహకారం అందిస్తాయి. పని చేపట్ట గల సామర్థ్యం గల సంస్థలను గుర్తించడం, ప్రారంభమైన పనుల నాణ్యతను తనిఖీ చేయడం, థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ తో నాణ్యత పరీక్షించడం లాంటి కార్యక్రమాలను మార్గదర్శకాల ప్రకారం నిర్వర్తించవలసి ఉంటుంది. జల్ జీవన్ మిషన్ పనుల నాణ్యత పరీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు  థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ఏజెన్సీలను గుర్తించాయి. 

పథకాలు సక్రమంగా అమలు జరిగేలా చూసేందుకు జల్ జీవన్ మిషన్ జాతీయ బృందాలు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాయి. పర్యటనలో గుర్తించిన అంశాలను ఈ బృందాలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించి అవసరమైన దిద్దుబాటు చర్యలను సూచిస్తాయి. 

కరువు పీడిత ప్రాంతాలు, నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు/ వర్షాభావ పరిస్థితి ఉన్న ప్రాంతాలు/ భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్న ప్రాంతాల్లో కూడా కుళాయి ద్వారా నీరు సరఫరా చేసేందుకు జల్ జీవన్ మిషన్  సుదూర ప్రాంతాల నుంచి భారీ పరిమాణంలో నీరు రవాణా చేసేందుకు, ప్రాంతీయ నీటి సరఫరా పథకాల అమలుకు విడిగా మార్గదర్శకాలు రూపొందించింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమగ్ర నీటి యాజమాన్య కార్యక్రమంతో పాటు జల వనరుల స్థాయి పెంచేందుకు, నీటి వనరుల పునరుజ్జీవనం, గొట్టపు బావుల నిర్మాణం లాంటి కార్యక్రమాలను అమలు చేసేందుకు అవసరమైన నిధులను గ్రామీణ స్థానిక సంస్థలు/పంచాయతీరాజ్ సంస్థలు/ఎంపీ లాడ్స్/ఎమ్మెల్యే లాడ్స్, రాష్ట్ర పథకాలు, సిఎస్ఆర్ నిధుల నుంచి సమకూర్చేందుకు 15వ ఆర్థిక సంఘం ప్రణాళిక రూపొందించింది. 

నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలలో రెండు విధాలుగా నీరు సరఫరా చేయాలని రాష్ట్రాలను ప్రోత్సహించడం జరుగుతోంది. దీని ప్రకారం ఒక పైప్ లైన్  ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేస్తారు. జల వనరులను పరిరక్షించేందుకు మరో పైప్ లైన్ ద్వారా ఇతర గృహ అవసరాలు/ మొక్కల పెంపకం/ మరుగుదొడ్లలో ఉపయోగించేందుకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. నీటి వనరులను రక్షించేందుకు చిన్న గొట్టాల ద్వారా నీరు వినియోగించేలా ఈ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను చైతన్యవంతులను చేయడం జరుగుతుంది. 

ఈ సమాచారాన్ని జల్ శక్తి సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ రోజు లిఖితపూర్వకంగా ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు.      

***

 


(Release ID: 1850093) Visitor Counter : 201
Read this release in: English , Urdu , Tamil