ఆర్థిక మంత్రిత్వ శాఖ
అటల్ పెన్షన్ యోజన కింద 21.07.2022 వరకూ నమోదు చేసుకున్న 4,31,86,423 మంది చందాదారులు
Posted On:
02 AUG 2022 7:38PM by PIB Hyderabad
పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ - పిఎఫ్ఆర్‌డిఎ), నుంచి అందుకున్న సమాచారం మేరకు 21.07.2022 వరకు అటల్ పెన్షన్ యోజన (ఎపివై) కింద నమోదు చేసుకున్న చందాదారుల సంఖ్య 4,31,86,423గా ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసాన్‌రావ్ కరాద్ మంగళవారం నాడు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
మరిన్ని వివరాలను వెల్లడిస్తూ, ఎపివై భారత ప్రభుత్వ పథకమని, దానిని 9 మే 2015లో ప్రారంభించి 1 జూన్ 2015 నుంచి ఆచరణలోకి తెచ్చారని మంత్రి చెప్పారు. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ బ్యాంకు ఖాతా కలిగి ఉన్న 18-40 సంవత్సరాల వయసు మధ్య ఉన్న భారత పౌరులందరికీ ఈ పథకం వర్తిస్తుందని అన్నారు.
ఎపివై అనేది స్వచ్ఛంద, కాలానుగుణ సహకార ఆధారిత పింఛను పథకం అని, ఇందులో చందాదారుడు 60 ఏళ్ళ వయస్సు వచ్చిన తర్వాత పింఛను పొందుతారని మంత్రి చెప్పారు. ఎపివై పథకం కింద ప్రతి చందాదారుడు 60 ఏళ్ళ వయస్సు వచ్చినప్పటి నుంచీ మరణించే వరకూ, వారు ఎంపిక చేసుకున్న చందా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా, కనీస పింఛనుగా నెలకు రూ. 1000లను లేదా రూ. 2000లను లేదా రూ. 3000లు లేదా రూ. 4000 లేదా రూ. 3000 పొందుతారు. చందాదారుడు మరణిస్తే, అతడి / ఆమె భాగస్వామికి భారత ప్రభుత్వం ఆ వ్యక్తి మరణించే వరకూ అదే పింఛను ఇచ్చేందుకు హామీ ఇస్తుంది. చందాదారు, జీవిత భాగస్వామి మరణించిన తర్వాత చందాదారు 60 ఏళ్ళవరకూ కూడబెట్టిన పింఛను సంపదను వారి నామినీ పొందుతారని మంత్రి వివరించారు.
***
(Release ID: 1847663)
Visitor Counter : 186