భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
అంటార్కిటికా మరియు ఆధారిత అనుబంధ పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడానికి భారతదేశం అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించే ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు, 2022 కు ఆమోదం తెలిపిన పార్లమెంట్
జూలై 22న లోక్ సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన భూ శాస్త్ర శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.
అంటార్కిటికా ప్రాంతంలో సైనిక కార్యకలాపాలను నిషేధించడం, మైనింగ్ కార్యకలాపాలు చట్ట వ్యతిరేక
కార్యకలాపాలను అరికట్టేందుకు వీలు కల్పించే విధంగా బిల్లుకు రూపకల్పన .. డాక్టర్ జితేంద్ర సింగ్
భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ కింద విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగిన ఇండియన్ అంటార్కిటిక్ అథారిటీ (ఐఏఏ) ఏర్పాటుకు బిల్లులో ప్రతిపాదన
Posted On:
01 AUG 2022 5:39PM by PIB Hyderabad
అంటార్కిటికా మరియు ఆధారిత అనుబంధ పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడానికి భారతదేశం అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించే ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు, 2022 కు ఈరోజు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. జూలై 22న లోక్ సభ ఆమోదం తెలిపిన బిల్లుకు ఈరోజు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్ర భూ శాస్త్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
బిల్లు లక్ష్యాలను కేంద్ర శాస్త్ర సాంకేతిక,భూ శాస్త్రం, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ (స్వతంత్ర) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. అంటార్కిటికా ఒప్పందం , అంటార్కిటిక్ ఒప్పందానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రోటోకాల్ (మాడ్రిడ్ ప్రోటోకాల్) కన్వెన్షన్, అంటార్కిటికా ప్రాంతంలో నివసిస్తున్న జంతుజాల పరిరక్షణకు భారతదేశం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ బిల్లును రూపొందించామని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
అంటార్కిటికా ప్రాంతంలో మిలటరీ కార్యకలాపాలను నిషేధించి, అంటార్కిటికా ప్రాంతంలో మైనింగ్ ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలన్న లక్ష్యంతో బిల్లును రూపొందించామని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. అంటార్కిటికా ప్రాంతంలో అణు పరీక్షలు/ పేలుడు జరగకుండా చూసేందుకు కూడా బిల్లు వీలు కల్పిస్తుంది. చట్టపరంగా, నిబంధనలకు లోబడి అంటార్కిటికా ప్రాంతంలో భారతదేశం చేపడుతున్న కార్యక్రమాలు మరింత పటిష్టంగా, సమర్థంగా అమలు చేసేందుకు అవసరమైన అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలు,నియంత్రణ చర్యలను రూపొందించేందుకు బిల్లు వీలు కల్పిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. అంటార్కిటికా ప్రాంతంలో పెరుగుతున్న పర్యాటక కార్యక్రమాల్లో భారతదేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి, అంటార్కిటికా ప్రాంతంలో మత్స్య సంపద అభివృద్ధికి అమలు జరుగుతున్న చర్యల్లో భారతదేశం పాల్గొనేలా చేసేందుకు కూడా బిల్లు అవకాశం కల్పిస్తుంది. ధ్రువ ప్రాంత నిర్వహణలో తన వంతు పాత్ర పోషించేందుకు భారతదేశానికి అవకాశం కల్పించడం ద్వారా అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక పరిశోధనలు, వీటికి సంబంధించిన అంతర్జాతీయ సహకార అంశాల్లో అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయతను పెంపొందించడానికి బిల్లు వీలు కల్పిస్తుంది.
అంటార్కిటికా ప్రాంతంలో జరుగుతున్న అధ్యయనాలు, పరిశోధనల్లో భారతదేశం పాల్గొంటున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంటార్కిటికాలో అధ్యయనాలు కొనసాగించి, అంటార్కిటికా ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ పరిరక్షణకు భారతదేశం కట్టుబడి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. అంటార్కిటికా ఒప్పంద వ్యవస్థలో సభ్య దేశంగా ఉన్న భారతదేశం తన బాధ్యతలను నిర్వర్తించేందుకు అంటార్కిటికా పై దేశీయ చట్టాన్ని కలిగి ఉండవలసి ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. అటువంటి చట్టాల వల్ల అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లో తలెత్తే వివాదం లేదా జరిగిన నేరాలను పరిష్కరించేందుకు భారతదేశ న్యాయస్థానాలకు అధికార పరిధిని అందిస్తుంది. అటువంటి చట్టం అంటార్కిటిక్ ఒప్పంద వ్యవస్థ విధానాలకు ప్రజలు గౌరవించేలా చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఇది విశ్వసనీయతను పెంపొందించడానికి మరియు దేశ స్థాయి పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ కింద ఇండియన్ అంటార్కిటిక్ అథారిటీ (IAA)ని ఏర్పాటు చేయాలని కూడా బిల్లు ప్రతిపాదించింది. అవసరమైన తగిన నిర్ణయాలను తీసుకునే అధికారం ఇండియన్ అంటార్కిటిక్ అథారిటీ కలిగి ఉంటుంది. బిల్లు కింద అనుమతించబడిన కార్యక్రమాలు మరియు కార్యకలాపాల అమలును సులభతరం చేస్తుంది. అంటార్కిటికా పరిశోధన మరియు యాత్రల స్పాన్సర్‌షిప్ మరియు పర్యవేక్షణ కోసం స్థిరమైన, పారదర్శకమైన మరియు జవాబుదారీ ప్రక్రియను అందిస్తుంది. అంటార్కిటికా పర్యావరణ రక్షణ మరియు సంరక్షణకు వీలు కల్పిస్తుంది. అంటార్కిటికా ప్రాంతంలో కార్యక్రమాలు మరియు కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ పౌరులు సంబంధిత నియమాలు మరియు అంతర్జాతీయంగా అంగీకరించబడిన ప్రమాణాలతో కట్టుబడి పనిచేసేలా బిల్లులో నిబంధనలు రూపొందించారు. ఇండియన్ అంటార్కిటిక్ అథారిటీ అధ్యక్షునిగా భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు.ఇండియన్ అంటార్కిటిక్ అథారిటీలో సంబంధిత భారత మంత్రిత్వ శాఖల నుంచి అధికారిక సభ్యులు ఉంటారు. ఏకాభిప్రాయంతో ఇండియన్ అంటార్కిటిక్ అథారిటీ నిర్ణయాలు తీసుకుంటుంది.
ప్రస్తుతం అంటార్కిటికాలో మైత్రి (1989లో ప్రారంభించబడింది ) మరియు భారతి (2012లో ప్రారంభించబడింది) పేరుతో రెండు కార్యాచరణ పరిశోధనా కేంద్రాలనుభారతదేశం కలిగి ఉంది. భారతదేశం ఇప్పటి వరకు అంటార్కిటికా కు 40 వార్షిక శాస్త్రీయ యాత్రలను విజయవంతంగా నిర్వహించింది. . నై-అలెసుండ్, స్వాల్‌బార్డ్, ఆర్కిటిక్‌లోని హిమాద్రి స్టేషన్‌తో భారతదేశం ఇప్పుడు ధ్రువ ప్రాంతాలలో బహుళ పరిశోధనా కేంద్రాలను కలిగి ఉన్న దేశాల సరసన స్థానం సాధించింది.
అంటార్కిటిక్ పర్యావరణ పరిరక్షణ మరియు సంరక్షణ కోసం మరియు ప్రత్యేకంగా, సముద్ర జీవ వనరుల సంరక్షణ మరియు పరిరక్షణ కోసం అంటార్కిటిక్ సముద్ర జీవ వనరుల పరిరక్షణ ఒప్పందంపై కాన్బెర్రాలో మే 20, 1980 న సంతకాలు జరిగాయి. భారతదేశం జూన్ 17, 1985న అంటార్కిటికా ఒప్పందాన్ని ఆమోదించింది . ఒప్పందం కింద ఏర్పాటైన అంటార్కిటిక్ సముద్ర జీవన వనరుల పరిరక్షణ కమిషన్‌లో భారతదేశం సభ్యత్వం కలిగి వుంది. అంటార్కిటిక్ ఒప్పందానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణపైఅంటార్కిటిక్ ఒప్పంద వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు అంటార్కిటిక్ పర్యావరణం మరియు ఆధారిత మరియు అనుబంధ పర్యావరణ వ్యవస్థల రక్షణ కోసం సమగ్ర పాలనను అభివృద్ధి చేయడానికి 4వ అక్టోబర్ 1991న మాడ్రిడ్‌లోఅవగాహనా ఒప్పందం కుదిరింది. జనవరి 14న అంటార్కిటిక్ ఒప్పందానికి పర్యావరణ పరిరక్షణపై ప్రోటోకాల్‌పై భారతదేశం సంతకం చేసింది.
అంటార్కిటికా 60 ñ దక్షిణ అక్షాంశానికి దక్షిణంగా ఉంది, ఇది సహజ రిజర్వ్ ప్రాంతంగా గుర్తింపు పొంది శాంతి మరియు విజ్ఞాన శాస్త్రానికి అంకితం చేయబడింది. అంతర్జాతీయ విభేదాలకు అంటార్కిటికా వేదికగా మారకూడదు.
***
(Release ID: 1847174)
Visitor Counter : 245