ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అటల్ బిహారీ వైద్య శాస్త్రాల సంస్థ (ఏబీవీఎంఎస్ ) స్నాతకోత్సవంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
దేశం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సంక్షేమ భారత్ నిర్మాణం సాధ్యమవుతుంది .. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
యువతకు నాణ్యమైన విద్య శిక్షణ అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి... డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
రానున్న 25 సంవత్సరాల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రణాళిక వైద్య నిపుణులకు అనేక అవకాశాలు కల్పించి, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తుంది
విలువలతో కూడిన సాంకేతిక విద్యను అందించినప్పుడు మాత్రమే సంక్షేమ భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది
దయ,సానుభూతితో రోగులతో మాట్లాడి వైద్యం అందించేందుకు వైద్య వృత్తిలో ఉన్నవారు కృషి చేయాలి
Posted On:
30 JUL 2022 3:22PM by PIB Hyderabad
డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈరోజు అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ABVIMS), ప్రముఖ వైద్య బోధన మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ 4వ వ్యవస్థాపక దినోత్సవం, స్నాతకోత్సవ కార్యక్రమాలు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగాయి. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కుమార్ పాల్ ముఖ్య అతిధిగా పాల్గొన్న కార్యక్రమానికి డాక్టర్ అతుల్ గోయెల్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
2018-2021 బ్యాచ్‌కు చెందిన మొత్తం 172 మంది విద్యార్థులు తమ ఎండీ/ఎంఎస్ మరియు డీఎం/ఎంసీహెచ్ డిగ్రీలు మరియు సర్టిఫికెట్‌లను అందుకున్నారు. 24 మంది విద్యార్థులు మెరిట్ సర్టిఫికేట్‌తో గోల్డ్ మెడల్స్, మరో 6 మంది విద్యార్థులు మెరిట్ సర్టిఫికేట్ అందుకున్నారు. తమ పిల్లలు కనబరిచిన ప్రతిభకు ఆస్పత్రికి చెందిన ఇద్దరు సిబ్బంది ప్రశంస పత్రాలను అందుకున్నారు. 21 వ స్నాతకోత్సవంలో అధ్యక్షోపన్యాసం చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు, అవార్డులు పొందిన విద్యార్థులకు డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. తమ పిల్లలను వైద్య విద్యలో చేర్పించిన తల్లిదంద్రులు, విద్యార్థులకు విద్య మరియు శిక్షణ అందించిన సిబ్బందిన, అధ్యాపకులను మంత్రి అభినందించారు. పొందిన విద్య, శిక్షణతో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వారు రాబోయే సంవత్సరాల్లో సమర్థులైన పరిశోధకులు , వైద్యులుగా ప్రజలకు సేవలు అందించేందుకు అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు.
నవ భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించాలని డాక్టర్ మాండవీయ కోరారు, వైద్య నిపుణులు, ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల రంగానికి చెందిన వారందరూ భారతదేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు మన శక్తి మేరకు కృషి చేయాలని అన్నారు. విదేశీపాలనలో కూడా భారతదేశం తన సామాజిక, సాంస్కృతిక మరియు సాంప్రదాయ విలువలు కోల్పోలేదని పేర్కొన్న డాక్టర్ మాండవీయ గతం నుంచి మంచి ఆలోచనలు పొంది దేశ పురోభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రానున్న 25 ఏళ్లలో భారతదేశ ఆరోగ్య అవసరాలు దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించామని మంత్రి తెలిపారు. దీనివల్ల వైద్య నిపుణులకు అపారమైన అవకాశాలను అందుబాటులోకి తీసుకు రావడమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు. దేశ వైద్య విధానంలో పొందుపరిచిన రెండు కీలక అంశాలను డాక్టర్ మాండవీయ వివరించారు. దేశంలో వివిధ వర్గాలను సంప్రదించిన తర్వాత ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు గల అవకాశాలు గుర్తించి 'భారతదేశంలో వైద్యం' అంశానికి వైద్య విధానంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. ఆరోగ్య సంరక్షణలో కేవలం దేశ ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకు మన నైపుణ్యం ఉపయోగపడేలా చూడాలన్న లక్ష్యంతో ' భారతదేశానికి ఉపశమనం' అంశాన్ని మరో ప్రాధాన్యతా రంగంగా గుర్తించి ఆరోగ్య విధానానికి రూపకల్పన చేశామని తెలిపారు. ఈ విధంగా, వసుధైక కుటుంబకం తత్వాన్ని ఆరోగ్య విధానంలో పొందుపరిచామని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు
కోవిడ్ మహమ్మారి అన్ని కోణాల్లో దేశానికి ప్రయోజనం కలిగించిందని డాక్టర్ మాండవీయ అన్నారు. “మహమ్మారిని భారతదేశం ఏ విధంగా ఎదుర్కొంటుంది అన్న సందేహాన్ని ప్రపంచ దేశాలు వ్యక్తం చేశాయి. ఈ సమయంలో మన నిపుణులు తమ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించి పరిస్థితికి తగ్గట్టుగా పనిచేసారు. ' స్వార్థం కంటే సేవ మిన్న' అన్న భారతదేశ సంప్రదాయాన్ని చాటి చెప్పేందుకు అన్ని వర్గాలు కలిసి ముందుకు వచ్చాయి." “ లాక్‌డౌన్ నిబంధనలు మరియు ఆరోగ్య సలహాలను పూర్తిగా పాటించడం జరిగింది. దీనితో మరుసటి సంవత్సరంలోనే సానుకూల వృద్ధి పథంలో తిరిగి పయనించిన మొదటి దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది" అని ఆయన వివరించారు.
"అందరికీ ఆరోగ్యం" లక్ష్యంగా కార్యాచరణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దీనికోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైన మరియు రోగి-స్నేహపూర్వక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి వివరించారు. ఆరోగ్య రంగం . దేశం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సంక్షేమ భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విద్య మరియు శిక్షణ అందించడానికి అధ్యాపకులు ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు విద్య పూర్తి చేసుకుని డాక్టర్లుగా మారిన విద్యార్థులందరూ కృషి చేయాలని కోరారు. విలువలతో కూడిన విద్యా వ్యవస్థ ప్రాముఖ్యతను మంత్రి ప్రస్తావించారు. విద్యార్థులు మర్యాద, నైతికత మరియు సానుభూతితో పనిచేసి ఉదాత్తమైన వైద్య వృత్తిలో ప్రవర్తనా నియమావళికి లోబడి చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులను అభినందించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ భవిష్యత్లో వారు తమ వృత్తిలో రాణించాలని రాణించాలని ఆకాంక్షించారు. ఏబీవీఐఎంఎస్ ఆస్పత్రి స్థాయి నుంచి వైద్య విద్యా సంస్థగా అభివృద్ధి సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏబీవీఐఎంఎస్ అత్యుత్తమ కేంద్రంగా రూపుదిద్దుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు, మార్గదర్శకులు కారణమని అన్నారు. ఉపనిషత్తులను ఉటంకించిన డాక్టర్ పాల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఉండాలని అన్నారు. సమాజానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ వంతు సహకారం అందించాలని దీనికోసం విద్య వ్యవస్థ పటిష్టంగా కాలానుగుణంగా ఉండాలని అన్నారు.
మహాత్మా గాంధీ ప్రబోధించిన ఏడు విలువలను పాటించాలని విద్యార్థులకు డాక్టర్ పాల్ సలహా ఇచ్చారు. వృత్తిలో రాణిస్తూనే నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. విలువలతో కూడిన నైపుణ్య సేవలను అందించడం వల్ల కేవలం రోగులకు మాత్రమే కాకుండా యావత్తు దేశానికి ప్రయోజనం కలుగుతుందని డాక్టర్ పాల్ అన్నారు. నైతిక విలువలతో కూడిన ప్రవర్తనను అలవరచుకుని విద్యార్థులు, అధ్యాపకులు దీర్ఘకాలంలో తమ సేవలను దేశానికి అంకితం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ మాట్లాడుతూ ఈ రోజు విద్యార్థుల కృషికి ఫలితం లభించిందని అన్నారు. యువ వైద్యులు, వారి అధ్యాపకులు మరియు తల్లిదండ్రుల జీవితంలో ఇది ఒక ముఖ్యమైన రోజు అని అన్నారు. మూడు కీలక అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ వైద్య నిపుణులు విధులు నిర్వర్తించాలని సూచించారు. సంవేద, సంవాద్ మరియు స్పర్ష్ అనే అంశాలు వైద్య వృత్తిలో కీలకంగా ఉంటాయని అన్నారు. జ్ఞానం, తాదాత్మ్యం తో పాటు భావ వ్యక్తీకరణ వైద్యుల చేతి స్పర్శ కీలకమని ఆయన అన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని సామాజిక-ఆర్థిక వైవిధ్యం ఉన్న దేశ ప్రజలకు సామర్థ్యం మేరకు సేవలందించడానికి నిపుణులు కృషి చేయాలని ఆయన అన్నారు.ఆర్ఎంఎల్ హాస్పిటల్ మరియు ఏబీవీఎంఎస్ వివరాలు:
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ 1932లో విల్లింగ్‌డన్ హాస్పిటల్‌గా స్థాపించబడింది. ఏళ్ల తరబడి ఆసుపత్రి అభివృద్ధి చెందింది. రోగులందరి అవసరాలను తీర్చడానికి ఆసుపత్రిలో వివిధ ప్రత్యేకతలు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 2008లో స్థాపించబడినప్పుడు హాస్పిటల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య ప్రారంభమైంది. ఇన్స్టిట్యూట్‌లో ఎంబీబీస్ విద్య 2019లో ప్రారంభించబడింది. ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం ఇన్‌స్టిట్యూట్‌కి అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌గా పేరు మార్చారు.
ఏబీవీఐఎంఎస్ (సంహిత) వార్షిక నివేదికను కూడా మంత్రి విడుదల చేశారు.
జీజీఎస్ఐపి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ మహేష్ వర్మ, డీజీహెచ్ఎస్ డాక్టర్ (ప్రొఫెసర్) అతుల్ గోయెల్, ఏబీవీఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ (ప్రొఫెసర్) బి.ఎల్. షేర్వాల్, ఏబీవీఎంఎస్ డీన్ డాక్టర్ (ప్రొఫెసర్ ) డాక్టర్ అశోక్ కుమార్, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1846700)
Visitor Counter : 201