కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఇ.పి.ఎఫ్. ట్రస్టీల కేంద్రీయ బోర్డు 231వ సమావేశం


2022, జూలై 29,30 తేదీల్లో నిర్వహణ

Posted On: 30 JUL 2022 5:10PM by PIB Hyderabad

   ఉద్యోగుల భవిష్య నిధి (ఇ.పి.ఎఫ్.) ట్రస్టీల కేంద్రీయ మండలి (సెంట్రల్ బోర్డు-సి.బి.టి.) 231వ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. 2022 జూలై 29, 30వ తేదీల్లో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కేంద్ర కార్మిక, ఉపాధికల్పన, పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ ఉపాధ్యక్షుడుగా, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి సునీల్ బర్త్‌వాల్, సభ్యకార్యదర్శి, కేంద్రీయ పి.ఎఫ్. కమిషనర్ నీలం శమీరావు ఈ సమావేశానికి సహాధ్యక్షులుగా  వ్యవహరించారు.

 

సి.బి.టి. సమావేశంలో ఈ దిగువ అంశాలపై చర్చ జరిగింది.

  • మానవ వనరులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పెన్షన్, పెన్షన్ వర్తింపు, సంబంధిత వ్యాజ్యాలు వంటి కీలకమైన అంశాలపై నాలుగు తాత్కాలిక కమిటీలు సమర్పించిన సిఫార్సుల విషయంలో సాధించిన ప్రగతి, తదితర వివరాలను చర్చకు పెట్టారు.
  • ఆర్థిక వ్యవహారాలు, పెన్షన్, మినహాయింపు సంస్థలపై నియమించిన స్థాయీ సంఘాలను ప్రక్షాళన చేయాలని కేంద్రీయ మండలి తీర్మానించింది. ప్రతి స్థాయీ  సంఘానికీ సబ్జెక్టు నిపుణుడితో అనుసంధానం కల్పించాలని కూడా తీర్మానించారు. మానవ వనరుల అంశానికి సంబంధించి ఒక స్థాయీ సంఘాన్ని నియమించాలని నిర్ణయించారు.
  • ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇ.పి.ఎఫ్.ఒ.)లో గ్రూప్ బి. అధికారుల బదిలీని ఆమోదించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసే విధానాన్ని నిర్ణయించారు. నిబంధనలు, ప్రతిభ ప్రాతిపదికగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ఈ అధికారుల బదిలీ అంశాన్ని కూడా ఆమోదించారు.
  • ఇ.పి.ఎఫ్.ఒ.లో వ్యాజ్యాల నిర్వహణ కోసం, సంబంధిత వ్యవహారాలకోసం 35మంది ప్రొఫెషనల్ యువ న్యాయవాదులను పరిశోధక బాధ్యతలకోసం వినియోగించుకునే ప్రతిపాదనను ఆమోదించారు. ఇ.పి.ఎఫ్.ఒ.లో వ్యాజ్యాల నిర్వహణను వృత్తిపరమైన నైపుణ్యంతో చేపట్టేందుకు ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యం, వృత్తిపరమైన శిక్షణ కలిగిన యువ న్యాయవాదులు సహాయపడతారు.
  • జమ్ము కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో ఇ.పి.ఎఫ్. కార్యాలయాల్లో అదనపు పోస్టుల ఏర్పాటుకు కేంద్రీయ బోర్డు ఆమోద తెలిపింది. 1952వ సంవత్సరపు ఇ.పి.ఎఫ్.-ఎం.పి. చట్టాన్ని మరింత మెరుగ్గా అమలు చేసే లక్ష్యంతో ఈ నియామకాలకు ఆమోదం తెలిపారు. జమ్ము కాశ్మీర్-లడఖ్ ప్రాంతాలను 2019లో కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తరవాత ఇదివరకే ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు.
  • ఇ.పి.ఎఫ్.ఒ. సెక్యూరిటీల సంరక్షణ సంస్థగా సిటీ బ్యాంకును మూడేళ్ల పాటు నియమించాలని సెలెక్షన్ కమిటీ చేసిన సిఫార్సుకు కేంద్రీయ మండలి ఆమోదం తెలిపింది. కొత్త సంరక్షణ సంస్థ బాధ్యతలు చేపట్టేంత వరకూ  ప్రస్తుత సంరక్షణ సంస్థ అయిన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు నియామక గడువును పొడిగించే ప్రతిపాదననను కూడా బోర్డు ఆమోదించింది.
  • ప్రస్తుత ఇ.పి.ఎఫ్.ఒ. ఎక్‌స్టర్నల్ కాంకరెంట్ ఆడిటర్‌ గడువు 2022 మార్చి నెలాఖరుకు ముగిసిపోయింది. అయితే, కొత్త ఎక్‌స్టర్నల్ కాంకరెంట్ ఆడిటర్‌ పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు ప్రస్తుత ఆడిటర్‌ను కొనసాగించే ప్రతిపాదనకు సెంట్రల్ బోర్డు ఆమోదం తెలిపింది.

 

  • పెన్షన్‌కు సంబంధించి ఇ.పి.ఎఫ్. చేసిన కృషిని బోర్డు అభినందించింది. అనేక సంస్కరణలతో ఇ.పి.ఎఫ్.ఒ. పెన్షనర్లకు సకాలంలో పెన్షన్ అందేందుకు అవకాశం ఏర్పడింది. పెన్షనర్లు మరింత సౌకర్యవంతంగా తమ జీవన్ ప్రమాణ్ (లైఫ్ సర్టిఫికెట్ల)ను నవీకరించుకునేందుకు కూడా అవకాశం కలిగింది. పెన్షనర్లకోసం ఇ.పి.ఎఫ్.ఒ. సేవలను మరింత మెరుగుపరిచే కృషిలో భాగంగా చేపట్టిన కేంద్రీకృత పెన్షన్ బట్వాడా విధానానికి బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

 

  • 2047వ సంవత్సరపు ఇ.పి.ఎఫ్.ఒ. దార్శనిక పత్రాన్ని గురించి బోర్డు సభ్యుల మధ్య పరస్పరం చర్చ జరిగింది. వ్రతి ఐదేళ్లకు ఒకసారి చొప్పున 2047వరకూ ఇ.పి.ఎఫ్.ఒ.  సాధించాల్సిన లక్ష్యాలను ఈ దార్శనిక పత్రంలో నిర్దేశించారు. ఈ ముసాయిదాపై సమీక్ష జరిపి మెరుగుదలకోసం తగిన సూచనలు చేయాల్సి ఉంటుందని బోర్డు సభ్యులకు ఈ సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

 

  • ప్రస్తుతం సుప్రీంకోర్టు సమక్షంలో ఉన్న  పెన్షన్ వ్యాజ్యం (ఎక్కువ వేతనానికి ఎక్కువ పెన్షన్‌ చెల్లింపుపై) ప్రస్తుత పరిస్థితిని గురించి బోర్డుకు సభ్యులు తెలియజేశారు. ఈ అంశంపై విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని సమావేశంలో తెలిపారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00145XI.jpg

 

   ట్రస్టీల సెంట్రల్ బోర్డు సమావేశం అనంతరం ఒక బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షన్-ఇ.డి.ఎల్.ఐ.  క్యాలిక్యులేటర్లను బోర్డు చైర్మన్ ఆవిష్కరించారు. అర్హులకు పెన్షన్ ప్రయోజనాలను, డెత్ లింక్డ్ ఇన్సూరెన్స్  ప్రయోజనాలను లెక్కించుకునే  ఆన్‌లైన్ సదుపాయాన్ని పెన్షనర్‌కు, కుటుంబ సభ్యులకు ఈ క్యాలిక్యులేటర్ అందిస్తుంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00276RG.jpg

   వేలిముద్రలు, కంటిపాప వివరాలను బయోమెట్రిక్ పద్ధతిలో నమోదు చేయడంలో వృద్ధ్యాప్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న పెన్షనర్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లకోసం ఫేస్ ఆథెంటిఫికేషన్ టెక్నాలజీ సదుపాయాన్ని కూడా సి.బి.టి. చైర్మన్ ప్రారంభించారు. 

 ఇ.పి.ఎఫ్.ఒ. శిక్షణా విధానాన్ని కూడా సి.బి.టి. చైర్మన్ ఆవిష్కరించారు. ఇ.పి.ఎఫ్.ఒ.ను ప్రపంచ ప్రమాణాలతో కూడిన సామాజిక భద్రతా సంస్థగా తీర్చిద్దాలన్న దార్శనిక దృక్పథానికి తగినట్టుగా  సంస్థ అధికారులను, సిబ్బందిని పోటీ తత్వంతో, ప్రతిస్పందనాత్మకంగా తయారు చేసే లక్ష్యంతో ఈ విధానాన్ని రూపొందించారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0039THH.jpg

   వ్యాజ్యాల నిర్వహణకు సంబంధించి ఇ.పి.ఎఫ్.ఒ.ను సమర్థవంతమైన, ప్రతిస్పందనా పూర్వకమైన సంస్థగా తయారు చేసే లక్ష్యంతో రూపొందించిన న్యాయ సంబంధమైన పత్రాన్ని కూడా ఆయన వెలువరించారు. పెన్షన్ సంబంధిత వ్యాజ్యాలను సమన్వయంతో, కాలబద్ధమైన పద్ధతిలో నిర్వహించేందుకు ఇది దోహదపడుతుంది.

   ఉడిపిలో నిర్మింప తలపెట్టిన ఇ.పి.ఎఫ్.ఒ. ప్రాంతీయ కార్యాలయం భవనానికి చైర్మన్ వర్చువల్ పద్ధతిలో ఆన్‌లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉడిపి శాసనసభ్యుడు కె. రఘుపతి స్థానికంగా భూమిపూజ నిర్వహించారు.

  అలాగే, బళ్లారిలో ప్రాంతీయ కార్యాలయం భవన సముదాయానికి సంబంధించిన కార్యక్రమాన్ని సి.బి.ఐ. చైర్మన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. స్థానికంగా జరిగిన కార్యక్రమంలో బళ్లారి సిటీ శాసనసభ్యుడు గాలి సోమశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు.

 

***



(Release ID: 1846696) Visitor Counter : 166


Read this release in: English , Urdu , Hindi