ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వాలి – ఉపరాష్ట్రపతి


• ఇది జాతి ఐక్యత, సమగ్రతలను బలోపేతం చేస్తుంది

• ఈశాన్య ప్రాంతం పర్యాటక స్వర్గధామం; ఈ అందమైన ప్రాంతం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

• సేంద్రీయ వ్యవసాయంలో ఈశాన్యభారతం దేశానికి మార్గనిర్దేశం చేస్తోంది

• 'నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్' యాత్రికులతో ఉపరాష్ట్రపతి

Posted On: 26 JUL 2022 12:42PM by PIB Hyderabad

భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ముందుగా దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విదేశాల్లో పర్యటించటం కంటే ముందు మన దేశంలో ఉన్న అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళి, అక్కడి జీవన విధానాన్ని, గొప్పతనాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఇలాంటి పర్యాటకాల వల్ల ప్రజల మధ్య సంస్కృతి, అభిప్రాయాల మార్పిడి జరిగి జాతి ఐక్యత, సమగ్రత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. 

“నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్” పేరిట ఈశాన్య భారతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో పర్యటించిన 18 రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మహిళలు సహా 75 మంది బైకర్లతో న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సంభాషించారు. ఇటీవలి తన ఈశాన్య రాష్ట్రాల పర్యటనను గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, అందమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప సంస్కృతి మరియు ప్రజల సహానుభూతి కలిగిన ఈశాన్య రాష్ట్రాలు పర్యాటక స్వర్గధామం అని తెలిపారు. ఇంత సుందరమైన పర్యాటక కేంద్రం గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదన్న ఆయన, పర్యాటక ప్రాంతాల మీద ఆసక్తి ఉన్న వారు ముందుగా ఈశాన్య భారతంలో పర్యటించి, మన సంస్కృతిలో వైవిధ్యాన్ని ఆస్వాదించటంతో పాటు అక్కడి ప్రకృతి అందాల గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని సూచించారు. 

సేంద్రీయ వ్యవసాయ రంగంలో భారతదేశానికి మార్గనిర్దేశం చేస్తున్న ఈశాన్య రాష్ట్రాలను అభినందించిన ఉపరాష్ట్రపతి, వారు పాటించే ఉత్తమ పద్ధతుల నుంచి నేర్చుకుని క్రమంగా స్థిరమైన సేంద్రీయ వ్యవసాయం దిశగా ప్రతి ఒక్కరూ మళ్ళాలని సూచించారు. ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రవాణా విషయంలో అభివృద్ధి గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో నూతన శకానికి నాంది పలికిందని గుర్తు చేశారు. 

ఈ పర్యటన నిర్వాహకులను అభినందించిన ఆయన, రహదారి భద్రత గురించి కూడా వారు దృష్టి సారించడం మంచి పరిణామం అని తెలిపారు. భారతదేశంలో చిన్న చిన్న పొరపాట్ల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

***


(Release ID: 1844920) Visitor Counter : 175