సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్తరాది ప్రధాన విద్యుత్ కేంద్రంగా జమ్ము కాశ్మీర్‌లోని కిష్టవర్!


ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తయితే అక్కడ
6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం..

కిష్టవర్ ర్యాలీనుద్దేశించి వర్చువల్ పద్ధతిలో
కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ప్రసంగం..
ప్రతికూల వాతావరణం కారణంగానే
వర్చువల్ ఉపన్యాసం..

జమ్ము కాశ్మీర్‌ను 65ఏళ్లపాటు ఏలిన
గతకాలపు ప్రభుత్వాలు,..
చీనాబ్ ప్రకృతి వనరుల వినియోగంలో
విఫలమయ్యాయన్న జితేంద్ర సింగ్..

అభివృద్ధి ప్రాజెక్టుల అన్‌స్కిల్డ్ ఉద్యోగాల్లో
స్థానికులకు వందశాతం రిజర్వేషన్,
స్కిల్డ్ ఉద్యోగాల్లో స్థానిక ప్రతిభకే ప్రాధాన్యం
ఇస్తామని కేంద్రమంత్రి ప్రకటన..

Posted On: 15 JUL 2022 5:28PM by PIB Hyderabad

    ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ ప్రాజెక్టుల పనులు పూర్తయితే, జమ్ము కాశ్మీర్‌లోని కిష్టవర్ కేంద్రం 6,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని,  ఉత్తర భారతదేశపు ప్రధాన విద్యుత్ కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని కేంద్ర సైన్స్ టెక్నాలజీశాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  భూగోళ శాస్త్రాలు, ప్రధానమంత్రి కార్యాలయం వ్యవహారాలు, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుఇంధనం, అంతరిక్ష పరిశోధనా శాఖలను కూడా స్వతంత్ర హోదా గల సహాయమంత్రిగా జితేంద్ర సింగ్ పర్యవేక్షిస్తున్నారు.

   ప్రతికూల వాతావరణం కారణంగా కిష్టవర్ ర్యాలీకి వెళ్లలేకపోయిన డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్ము నుంచి వర్చువల్ పద్ధతిలో ఆన్‌లైన్ ద్వారా  ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, కిష్టవర్ కేంద్రంలో ఉత్పత్తి జరిగే అదనపు విద్యుత్తును జమ్ము కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని ఇతర ప్రాంతాలకే కాక, ఇతర రాష్ట్రాలకు కూడా విక్రయించనున్నట్టు చెప్పారు. జమ్ము కాశ్మీర్‌ను దాదాపు 65 సంవత్సరాలపాటు పరిపాలించిన ఇదివరకటి ప్రభుత్వాలు సుసంపన్నమైన చీనాబ్ నది సహజ వనరులను సక్రమంగా వినియోగించుకోలేక పోవడం శోచనీయమని అన్నారు.

     వెయ్యి మెగావాట్ల పకల్ దుల్ ప్రాజెక్టు, 624 మెగావాట్ల కిరూ ప్రాజెక్టు, 540 మెగావాట్ల క్వార్ ప్రాజెక్టు, 930 మెగావాట్ల కిర్తాయ్ ప్రాజెక్టు.., ఇవన్నీ పరస్పరం సమీప ప్రాంతాల్లోనే ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం, జమ్ము కాశ్మీర్ కేంద్రపాలిత యంత్రాంగం కలసి,.. ఉమ్మడిగా పునరుద్ధరించిన 850మెగావాట్ల రత్లే ప్రాజెక్టు కూడా వీటికి సమీపంలోనే ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటి కారణంగా కిష్టవర్ ప్రాంతం ఉత్తరభారతదేశంలోనే పెద్ద విద్యుత్ కేంద్రాల్లో ఒకటిగా రూపుదాల్చిందని జితేంద్ర సింగ్ అన్నారు. ఈ విద్యుత్ ప్రాజెక్టుల అన్‌స్కిల్డ్  ఉద్యోగాల్లో స్థానికులకు వందశాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించారు. ప్రాజెక్టులకు అవసరమైన నైపుణ్యంతో కూడిన సిబ్బంది విషయంలో కూడా స్థానికులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు.

    2014వ సంవత్సరానికి ముందు కాలంలో కిష్టవర్ ప్రాంతానికి రోడ్డు ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉండేదని,  చిన్నపాటి మట్టిచరియలు విరిగి పడినా, దొడా-కిష్టవర్ రహదారి మూసుకుపోయేదని అన్నారు. అయితే ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. జమ్మునుంచి కిష్టవర్ ప్రాంతానికి రోడ్డు ప్రయాణ వ్యవధి 2014లో ఏడు గంటలు కాగా ఇపుడు అది ఐదు గంటలకంటే తక్కువకు పడిపోయిందని అన్నారు.   గత ఎనిమిదేళ్లలో కిష్టవర్ ప్రాంతం విమానయాన చిత్రపటంలో చోటు సంపాదించిందని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉడాన్ పథకం కింద అక్కడ విమానాశ్రయం మంజూరైందని అన్నారు. కిష్టవర్ ప్రాంతానికి ఒక ఆయుష్ ఆసుపత్రి వచ్చిందన్నారు. ఇక రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) పథం కింద పాడార్ ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయ పాఠశాల వచ్చిందని, ఈ పనిచేయడానికి ఇదివరకటి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని అన్నారు. ఇదివరకటి దోడా జిల్లాలో కిష్టవర్ ఒక భాగమని అన్నారు. ఇదే జిల్లాలోని భదేర్వాలో భారతదేశపు తొట్టతొలి సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ రాబోతున్నదని, దోడాలో కేంద్రం ఆర్థిక సహాయంతో ఒక వైద్య కళాశాల ఇప్పటికే మొదలైందని ఆయన అన్నారు. కిలానీ-శుద్ధమహదే వ్ రహదారితోపాటుగా, కొత్తగా మూడు జాతీయ రహదారులు, మచైల్ యాత్రా మార్గంలో అనేక డిగ్రీ కళాశాలలు, మొబైల్ టవర్లు మోదీ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని ఆయన అన్నారు.

  పొరుగు ప్రాంతమైన భదేర్వాలో ఊపందుకున్న ఆరోమా మిషన్, వంగవర్ణ విప్లవం, మరువం సాగు వంటి వాటిల్లో స్టార్టప్ కంపెనీలను ప్రారంభించేందుకు గల అవకాశాలను యువత గరిష్టస్థాయిలో వినియోగించుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు.

   కేంద్రంలో ఇప్పటివరకూ వచ్చిన ప్రభుత్వాల హ్రస్వదృష్టి కారణంగా, గత 60-65 సంవత్సరాల కాలంలో జమ్ము కాశ్మీర్, ఈశాన్యరాష్ట్రాలు, ఇతర పర్వత ప్రాంత రాష్ట్రాలు, ఎన్నో రకాలుగా కష్టాలుపడ్డాయని కేంద్రమంత్రి అన్నారు. అయితే, 2014లో మోదీ ప్రభుత్వం రాగానే పరిస్థితి మారిపోయిందన్నారు. దేశంలో ఎక్కువగా అభివృద్ధి చెందిన ఇతర ప్రాంతాలతో సమానంగా, ఈశాన్య ప్రాంతం, జమ్ము కాశ్మీర్, ఇతర వెనుకబడిన ప్రాంతాలను కూడా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతిని కేంద్రమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.  

  భారతదేశంలో కొత్త తరహా పని సంస్కృతిని తీసుకువచ్చిన ఘనత ఎప్పటికీ ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందన్నారు. నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చే పథకాలను, ప్రజాసంక్షేమ లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలను జాతి, వర్ణ, కుల, మత విచక్షణ లేకుండా అందరికీ అందేలా రూపొందించారని అన్నారు. గరీబ్ కల్యాణ్ అన్న యోజన, జన్ ధన్ యోజన, ఉజ్వల, శౌచాలయ, పి.ఎం. ఆవాస్, హర్ ఘర్ జల్, హర్ ఘర్ బిజిలీ, ఆయుష్మాన్ భారత్ వంటి విప్లవాత్మక పథకాలు కిష్టవర్ వంటి దుర్గమమైన పర్వత ప్రాంతాలతో సహా దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికీ చేరాయని జితేంద్ర సింగ్ అన్నారు. గతంలో కంటే భిన్నంగా ఎలాంటి వివక్షకు తావులేని రీతిలో ప్రజలు సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను అందుకోగలుగుతున్నారన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు కోట్లాదిమంది ప్రజలకు తీవ్రమైన పేదరికంనుంచి విముక్తి కలిగించాయని, ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని ప్రసాదించాయని జితేంద్ర సింగ్ అన్నారు.

   రానున్న పాతికేళ్లలో భారతదేశం సాగించబోయే పయనంలో కిష్టవర్, ఈశాన్య ప్రాంతం, ఇతర పర్వత ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. అభివృద్ధిలో సంతృప్త స్థాయి సాధించిన రాష్ట్రాలకంటే మిన్నగా, ఈ  ప్రాంతాలే భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రశ్రేణి దేశంగా తీర్చిదిద్ది, ముందుకు తీసుకెళ్తాయని అన్నారు. 2017వ సంవత్సరంలో భారతదేశం వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి ఇది జరుగుతుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.

 

****


(Release ID: 1841998)
Read this release in: English , Urdu , Hindi