గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన
Posted On:
14 JUL 2022 8:16PM by PIB Hyderabad
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించిన కేంద్ర బృందం తెలంగాణ రాష్ట్రంలో 2022 జూన్ తొమ్మిది నుంచి 12 వరకు పర్యటించింది. తన పర్యటనలో కేంద్ర బృందం పలు అంశాలను గుర్తించింది. అనుమతి లేని పనులు చేపట్టడం (ఆహార ధాన్యం ఆరబెట్టే ప్లాట్‌ఫారమ్ నిర్మాణం), చిన్న తరహా నీటి చెరువుల్లో పూడిక తీయడం, మైదాన ప్రాంతాల్లో కందకాలు చేపట్టడం వంటి పనులను మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టినట్టు కేంద్ర బృందం పర్యటన లో వెల్లడైంది. కొండ ప్రాంతాలకు మాత్రమే అనువైన కందకాల తవ్వకాలను విభజించి మైదాన ప్రాంతాల్లో అమలు చేసినట్టు కేంద్ర బృందం గుర్తించింది. ఉన్నత స్థాయిలో సాంకేతిక అనుమతులు పొందకుండా మార్గదర్శకాలు ఉల్లంఘించి పనులు చేపట్టేందుకు వీటిని విభజించి నిర్మించారని కేంద్ర బృందం గుర్తించింది.
నిబంధనలకు విరుద్ధంగా, అవకతవకలతో పనులు చేపట్టినట్టు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరును మరింత లోతుగా పరిశీలించేందుకు మరికొన్ని బృందాలను పంపాలని నిర్ణయించింది. బృందాలు సమర్పించే నివేదికలు ఆధారంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జరుగుతున్న అవకతవకలపై దిద్దుబాటు చర్యలను అమలు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో 15 జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తాయి.
నిజామాబాద్, పెద్దపల్లి,మెదక్,సిద్ధిపేట,సూర్యాపేట,కరీంనగర్,నాగర్ కర్నూల్,నిర్మల్,జయశంకర్ భూపాలపల్లి,మహబూబాబాద్,సంగారెడ్డి,రంగారెడ్డి,ఆదిలాబాద్,రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తాయి. డైరెక్టర్/డిప్యూటీ కార్యదర్శి హోదా కలిగిన అధికారి అధ్యక్షతన ఏర్పాటయ్యే బృందంలో ఒక ఇంజినీరుతో సహా ముగ్గురు సభ్యులు ఉంటారు.
ఒకో జిల్లాలో రెండు బ్లాకుల్లో ఉండే 4-6 గ్రామ పంచాయతీ లలో కేంద్ర బృందం పర్యటించి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన చెరువుల పూడికతీత, కందకాల నిర్మాణం, రోడ్ల వెంబడి మొక్కలు నాటడం లాంటి పనులను పరిశీలిస్తుంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత , జవాబుదారితనం అంశాలపై దృష్టి సారించి కేంద్ర బృందాలు తమ పర్యటన సాగిస్తాయి.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సమీక్షిస్తూ వస్తోంది. క్షేత్ర స్థాయిలో పథకం సక్రమంగా లక్ష్యాల మేరకు అమలు జరిగేలా చూసి, లోటుపాట్లను సవరించి మార్గదర్శకాల మేరకు పథకం పారదర్శకంగా అమలు జరిగేలా చూసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చర్యలు అమలు చేస్తున్నది.
మార్గదర్శకాలు, నిబంధనలకు లోబడి పథకం అమలు జరిగేలా చూసే ప్రాథమిక బాధ్యత రాష్ట్రంపై ఉంటుంది. దీనికోసం రాష్ట్ర రాజధానిలో పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, రాష్ట్ర స్థాయి అధికారి తనిఖీ చేయడం సామాజిక ఆడిట్ నిర్వహించడం, వివాదాల పరిష్కారానికి అధికారి నియామకం లాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థలు సక్రమంగా పని చేయకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
***
(Release ID: 1841595)
Visitor Counter : 327