రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
2023 నాటికి దేశంలో పట్టణ ప్రాంతంలో మొట్టమొదటి ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ రహదారి ..శ్రీ నితిన్ గడ్కరీ
మొట్టమొదటి ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ రహదారిగా రూపుదిద్దుకుంటున్న ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి ..శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
11 JUL 2022 10:56AM by PIB Hyderabad
హర్యానాలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారిని దేశంలో మొట్టమొదటి ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ రహదారిగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితీష్ గడ్కరీ వెల్లడించారు.
ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ రహదారిగా రూపుదిద్దుకోనున్న ద్వారకా ఎక్స్‌ప్రెస్ వల్ల ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ రహదారి (స్వర్ణ చతుర్భుజంలోని ఢిల్లీ-జైపూర్-అహ్మదాబాద్-ముంబై విభాగంలో భాగం)పై వాహన ఒత్తిడి తగ్గుతుందని శ్రీ గడ్కరీ ట్వీట్ చేశారు. ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ రహదారి గుండా పశ్చిమ ఢిల్లీ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించే వాహనాల వల్ల విపరీతమైన రద్దీ ఏర్పడుతూ తరచు వాహనాలు నిలిచిపోతున్నాయి. జాతీయ రహదారి 8 మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాహనాల్లో 50% నుంచి 60% కొత్తగా నిర్మిస్తున్న రహదారిపైకి మళ్లిస్తామని శ్రీ గడ్కరీ వివరించారు. దీనివల్ల సోహ్న రోడ్డు, గోల్ఫ్ కోర్స్ రోడ్, ఎయిర్ ఎక్సటెన్షన్ మార్గాల్లో ట్రాఫిక్ పరిస్థితి మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. 2023లో ప్రారంభమయ్యే నూతన ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ రహదారితో ఢిల్లీ-ఎన్ సీ ఆర్ మార్గంలో వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని శ్రీ గడ్కరీ అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రపంచ ప్రమాణాలతో రహదారులను అభివృద్ధి చేసే అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నదని శ్రీ గడ్కరీ తెలిపారు. దేశంలో అన్ని ప్రాంతాలను రహదారులతో అనుసంధానం చేసి అనుసంధానం ద్వారా అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని అన్నారు.
ఢిల్లీలోని ద్వారకా నుంచి హర్యానాలోని గురుగాం వరకు 29 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణం చురుగ్గా సాగుతోంది. రహదారిలో 19 కిలోమీటర్ల మార్గం హర్యానాలో, మిగిలిన 10 కిలోమీటర్లు ఢిల్లీలో ఉంటాయి. దీనికి 9,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు.
16-లేన్ యాక్సెస్-నియంత్రిత హైవేగా ద్వారకా ఎక్స్‌ప్రెస్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని శ్రీ గడ్కరీ వివరించారు. దీనికి ఇరువైపులా కనీసం 3-లైన్ల సర్వీస్ రహదారులు ఉంటాయని శ్రీ గడ్కరీ వివరించారు.
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రధాన జంక్షన్‌లలో 4 బహుళ-స్థాయి ఇంటర్‌ఛేంజ్‌లు (టన్నెల్/అండర్‌పాస్‌లు, ఎట్-గ్రేడ్ రోడ్, ఎలివేటెడ్ ఫ్లైఓవర్ తో పాటు ఫ్లైఓవర్ పైన మరో ఫ్లైఓవర్) ఉంటాయని శ్రీ గడ్కరీ చెప్పారు. రహదారి నిర్మాణం కోసం దేశంలో పట్టణ ప్రాంతంలో తొలిసారిగా పొడవైన (3.6 కి.మీ) మరియు విశాలమైన (8 లేన్) పట్టణ రహదారి సొరంగ నిర్మాణం జరుగుతుందని శ్రీ గడ్కరీ వెల్లడించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే జాతీయ రహదారి -8 (ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే)లో శివ్-మూర్తి నుంచి ప్రారంభమవుతుంది. ద్వారకా సెక్టార్ 21, గురుగ్రామ్ సరిహద్దు మరియు బసాయి మీదుగా సాగి ఖేర్కి దౌలా టోల్ ప్లాజా దగ్గర ముగుస్తుందని శ్రీ గడ్కరీ వివరించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీ తగ్గించాలన్న ప్రధాన లక్ష్యంతో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి రూపకల్పన చేశామని శ్రీ గడ్కరీ తన ట్వీట్ లో తెలిపారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం పూర్తయితే ద్వారకా లోని 25వ సెక్టార్ లో నిర్మిస్తున్న ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు నేరుగా చేరుకునేందుకు మార్గం అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఇంతేకాకుండా ఐజిఐ విమానాశ్రయానికి వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుందని వివరించారు. ప్రపంచ స్థాయి రహదారిగా రూపుదిద్దుకుంటున్న ద్వారా ఎక్స్‌ప్రెస్‌వే లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అధునాతన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టోల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, సిసిటివి కెమెరాలు, నిఘా మొదలైన అత్యాధునిక ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్ (ఐటిఎస్) ఈ ప్రపంచ స్థాయి రహదారిలో భాగంగా ఉంటాయని ఆయన అన్నారు.
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీ గడ్కరీ అన్నారు. నిర్మాణంలో తొలగించే దాదాపు 12,000 చెట్లను ఇతర ప్రాంతాలకు రవాణా చేసి నాటేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశామని శ్రీ గడ్కరీ చెప్పారు. నిర్మాణ రంగంలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా ఉంటుందని శ్రీ గడ్కరీ వర్ణించారు. మొట్టమొదటి సారిగా ఒక స్తంభం మీద 34 మీటర్ల వెడల్పు 8-లేన్ హైవే నిర్మాణం జరుగుతున్నదని మంత్రి వెల్లడించారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 2 లక్షల మిలియన్ టన్నుల ఉక్కు (ఈఫిల్ టవర్ నిర్మాణానికి వినియోగించిన ఉక్కు కంటే 30 రెట్లు ఎక్కువ ఉక్కు ) మరియు 20 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ (బుర్జ్ ఖలీఫా నిర్మాణం తో పోలిస్తే 6 రెట్లు ఎక్కువకాంక్రీట్ ) అవసరముంటుందని అంచనా వేశామని శ్రీ గడ్కరీ వివరించారు.
****
(Release ID: 1840752)
Visitor Counter : 212