ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బి) అధిపతుల సమావేశం
ఆర్‌ఆర్‌బిలలో అమలు జరుగుతున్న నిర్వహణా, పరిపాలన సంస్కరణలు మరియు పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్య పరిశ్రమల కోసం అమలు జరుగుతున్న కిసాన్ క్రెడిట్ స్కీమ్ (కెసిసి) పనితీరును సమీక్షించిన ఆర్థిక మంత్రి
జూలై చివరి నాటికి ఆన్‌బోర్డ్ అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్‌ను ప్రారంభించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన ఆర్థిక మంత్రి
సాంకేతికత అంశాల్లో ఆర్‌ఆర్‌బిల పురోగతికి సహకరించాలని ఐబీఏ, లీడ్ బ్యాంకులకు సూచించిన ఆర్థిక మంత్రి
పెండింగ్ లో ఉన్న కెసిసి దరఖాస్తుల పరిష్కారానికి కార్యాచరణ కార్యక్రమాన్ని సిద్ధం చేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి
Posted On:
07 JUL 2022 8:50PM by PIB Hyderabad
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బి)లో అమలు జరుగుతున్న నిర్వహణా, పరిపాలన సంస్కరణలు మరియు పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్య పరిశ్రమల కోసం అమలు జరుగుతున్న కిసాన్ క్రెడిట్ స్కీమ్ (కెసిసి) పనితీరును కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ( ఆర్‌ఆర్‌బి ) అధిపతుల సమావేశంలో సమీక్షించారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్య పరిశ్రమల కోసం అమలు జరుగుతున్న కిసాన్ క్రెడిట్ స్కీమ్ (కెసిసి) పనితీరును కూడా మంత్రి సమీక్షించారు. ఆర్‌ఆర్‌బిల పనితీరును శ్రీమతి నిర్మలా సీతారామన్ వాటి స్పాన్సర్ బ్యాంకుల అధిపతులు , ఆర్‌ఆర్‌బి ల చైర్మన్లతో సమీక్షించారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన రుణ సౌకర్యం అందించి, ఆర్థిక స్వావలంబన సాధన దిశలో ఆర్‌ఆర్‌బిలు పోషిస్తున్న కీలక పాత్రను మంత్రి ప్రస్తావించారు. ఆర్‌ఆర్‌బిల పనితీరును మెరుగు పరిచి వాటిని మరింత బలోపేతం చేసేందుకు, మహమ్మారి అనంతరం నెలకొన్న పరిస్థితుల నుంచి అధిగమించేందుకు అవసరమైన నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని స్పాన్సర్ బ్యాంకులకు ఆర్థిక మంత్రి సూచించారు. ఆర్‌ఆర్‌బిలు సాంకేతిక పురోగతి సాధించే అంశంలో ప్రధాన పాత్ర పోషించాలని ఐబీఏ మరియు స్పాన్సర్ బ్యాంకులకు శ్రీమతి సీతారామన్ సలహా ఇచ్చారు.
ఆర్‌ఆర్‌బిలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను చర్చించి, అన్ని బ్యాంకుల్లో అవి మేలు జరిగేలా చూసేందుకు ఒక వర్క్‌షాప్ నిర్వహించాలని శ్రీమతి సీతారామన్ సూచించారు.
జూలై నెలాఖరులోగా అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని శ్రీమతి సీతారామన్ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించారు.
పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్య రంగానికి కెసిసి జారీ పురోగతిని శ్రీమతి సీతారామన్ సమీక్షించారు. సమావేశంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసన్‌రావ్ కరద్ పాల్గొన్నారు.
కెసిసి రుణాల ప్రయోజనాలను అత్యధిక సంఖ్యలో రైతులకు అందించే లక్ష్యంతో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. 2.5 కోట్ల మంది రైతులకు 2 లక్షల కోట్ల రూపాయల కెసిసి రుణాలను అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందింది. జూలై 1, 2022 నాటికి 3.26 కోట్ల మంది రైతులకు (19.56 లక్షల పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్య రైతులతో సహా) కెసిసి పథకం కింద 3.70 లక్షల కోట్ల రూపాయల రుణ పరపతిని అందించడం జరిగింది.
ఆర్థిక వ్యవస్థలో పశుసంవర్ధక మరియు మత్స్య పరిశ్రమల పాత్రను ఆర్థిక మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రంగాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ లో ఉన్నకెసిసి ధరఖాస్తుల పరిష్కారానికి కార్యాచరణ కార్యక్రమాన్ని సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. పశువుల పెంపకం, చేపల పెంపకం రంగాల్లో ఉన్న రైతులకు కెసిసి రుణ పరపతిని అందించేందుకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని బ్యాంకులకు ఆర్థిక మంత్రి సూచించారు.
పశుసంవర్ధక మరియు మత్స్య రంగాలకు కెసిసి రుణాలను అందించేందుకు బ్యాంకులు చేస్తున్న కృషిని శ్రీ రూపాల ప్రశంసించారు. కెసిసి పథకం కింద రుణాలు మంజూరు చేసేటప్పుడు చిన్న మత్స్యకారులు మరియు పశువుల పెంపకంలో నిమగ్నమై ఉన్న వారి ప్రత్యేక అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
పథకం ప్రయోజనాలు సాధ్యమైనంత ఎక్కువ మందికి అందేలా చూసేందుకు సంబంధిత వర్గాలతో పథకం పనితీరుపై తరచు సమీక్ష నిర్వహించాలని శ్రీమతి సీతారామన్ అధికారులను ఆదేశించారు. సమీక్షల వల్ల పథకం ప్రయోజనాలు గరిష్ట సంఖ్యలో అర్హులైన లబ్ధిదారులకు అందుతాయని మంత్రి అన్నారు.
(Release ID: 1840040)
Visitor Counter : 186