ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక మంత్రిత్వ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల ఐకానిక్ వారోత్సవాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి
రుణ అనుసంధాన ప్రభుత్వ పథకాల కోసం రూపొందించిన 'జన్ సమర్థ్" జాతీయ పోర్టల్‌ను ప్రారంభించిన ప్రధాని
పెరిగిన ప్రజల భాగస్వామ్యం దేశ అభివృద్ధికి , పేదలకు సాధికారత కల్పించేందుకు అవకాశం ఇచ్చింది: ప్రధాన మంత్రి
Posted On:
06 JUN 2022 3:05PM by PIB Hyderabad
ఆర్థిక మంత్రిత్వ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల ఐకానిక్ వారోత్సవాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' (ఆకాం) వేడుకల్లో భాగంగా ఆర్థిక మంత్రిత్వ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు 2022 జూన్ 6 నుంచి 12 వరకు ఐకానిక్ వారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఐకానిక్ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి. నిర్మలా సీతారామన్, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ రావు ఇంద్రజిత్ సిగ్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసన్‌రావ్ కరద్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా రుణ అనుసంధాన ప్రభుత్వ పథకాల కోసం రూపొందించిన 'జన్ సమర్థ్" జాతీయ పోర్టల్‌ను ప్రధానమంత్రి ప్రారంభించారు.
గత ఎనిమిది సంవత్సరాల కాలంలో రెండు మంత్రిత్వ శాఖలు అమలు చేసిన వివిధ కార్యక్రమాలపై ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు.
1, 2, 5, 10 మరియు 20 రూపాయల నాణేల ప్రత్యేక సిరీస్‌ను ప్రధాని విడుదల చేశారు. ఈ ప్రత్యేక నాణేలు ఆకాం లోగో,ఇతివృత్తంతో వీటిని రూపొందించారు. దృష్టి లోపం ఉన్నవారు కూడా సులభంగా గుర్తించే విధంగా వీటిని రూపొందించారు.
ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాన మంత్రి స్వాతంత్ర్యం కోసం జరిగిన సుదీర్ఘ సంగ్రామంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఉద్యమానికి భిన్నమైన కోణాన్ని జోడించి స్ఫూర్తిని రగిలించారని అన్నారు.కొందరు సత్యాగ్రహ మార్గాన్ని,మరికొందరు ఆయుధాలు ధరించి ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. కొందరు విశ్వాసం మరియు ఆధ్యాత్మికత మార్గాల ద్వారా ఉద్యమంలో పాల్గొన్న సమయంలో మరికొందరు స్వాతంత్య్ర జ్వాల ప్రకాశవంతంగా ఉండడానికి మేధో సంపత్తి అందించారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు స్వాతంత్ర సమర యుద్ధంలో పాల్గొన్న వారందరిని స్మరించి గౌరవించాలని ఆయన పేర్కొన్నారు.
75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో దేశాభివృద్ధికి తమ స్థాయిలో సహకారం అందించేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్ఛారు. దేశం కోసం స్వాతంత్ర సమరయోధులు కన్న కలలు సాకారం చేసేందుకు కొత్త శక్తితో కృషి చేసి, దేశాభివృద్ధికి సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేయాలని ఆయన అన్నారు.
గత ఎనిమిదేళ్లలో భారతదేశం వివిధ కోణాల్లో పని చేసిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రజా భాగస్వామ్యం పెరగడంతో దేశాభివృద్ధి వేగంగా జరిగి దేశంలో అత్యంత పేద ప్రజలకు సాధికారత కల్పించిందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదలు గౌరవంగా జీవించే అవకాశాన్ని స్వచ్ఛ భారత్ అభియాన్ కల్పించిందని ప్రధాని వ్యాఖ్యానించారు. పక్కా గృహాలు, విద్యుత్, గ్యాస్, నీరు, ఉచిత చికిత్స వంటి సౌకర్యాలు పేదల గౌరవాన్ని పెంపొందించి జీవన సౌకర్యాలను మెరుగుపరిచాయని ప్రధానమంత్రి అన్నారు.కరోనా కాలంలో అమలు చేసిన ఉచిత రేషన్ పథకం 80 కోట్ల మందికి పైగా దేశ ప్రజలను ఆకలి బాధల నుంచి దూరం చేసిందని అన్నారు. " తమకు ఏమీ అందలేదన్న భావన నుంచి బయటపడిన ప్రజలు తమకు అన్నీ అందుతాయన్న మనస్తత్వం అలవరచుకుని నూతన విశ్వాసాన్ని పొందారు " అని ప్రధానమంత్రి అన్నారు.
గతంలో ప్రభుత్వాలు అమలు చేసిన కేంద్రీకృత పాలన వల్ల దేశం తీవ్రంగా నష్టపోయిందని ప్రధాని అన్నారు. కానీ నేడు ప్రజలకు అవసరమైన విధానాలకు ప్రాధాన్యత భారతదేశం 21 వ శతాబ్దపు ప్రజా కేంద్రీకృత పాలనా విధానం తో ముందుకు సాగుతోందని అన్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందేందుకు ప్రజలు ప్రభుత్వం వద్దకు వెళ్ళవలసి వచ్చేదని అన్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం ప్రజల వద్ద ప్రభుత్వం వెళ్తున్నదని అన్నారు. ప్రభుత్వ పథకాల కోసం వివిధ మంత్రిత్వ శాఖలు మరియు వెబ్‌సైట్‌లను సందర్శించి పదేపదే తిరగాల్సిన అవసరం లేదని వివరించారు. రుణ ఆధారిత ప్రభుత్వ పథకాల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన జన్ సమర్థ్ నేషనల్ పోర్టల్ ప్రారంభించడాన్ని ఈ దిశలో ఒక పెద్ద అడుగుగా ప్రధానమంత్రి వర్ణించారు. ఈ పోర్టల్ విద్యార్థులు, రైతులు, వ్యాపారవేత్తలు, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు ఎంతగానో సహాయపడి, వారి కలలను సాకారం చేసుకోవడంలో తోడ్పడుతుందని ఆయన తెలిపారు.
స్పష్టమైన లక్ష్యాలు కలిగిన సంస్కరణను అయినా చిత్తశుద్ధితో అమలు చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని ప్రధాని అన్నారు. గత ఎనిమిదేళ్లలో దేశం చేపట్టిన సంస్కరణల్లో దేశ యువత ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని అమలు చేశామని ప్రధానమంత్రి అన్నారు. ఇది వారి సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి సహాయపడుతుందని అన్నారు. " యువత తమకు నచ్చిన, కావలసిన కంపెనీని సులభంగా నెలకొల్పి, దానిని సులభంగా ప్రారంభించి సులభంగా నిర్వహించుకోవచ్చు. భారతీయ కంపెనీలు ముందుకు సాగడమే కాకుండా కొత్త శిఖరాలను సాధించేలా చూసేందుకు 30 వేలకు పైగా సమ్మతిని తగ్గించడం, 1500 కంటే ఎక్కువ చట్టాలను రద్దు చేయడం మరియు కంపెనీల చట్టంలోని అనేక నిబంధనలు నేర రహిత వాటిగా పరిగణించడం లాంటి చర్యలను అమలు చేసాం ” అని ఆయన వివరించారు.
సరళీకరణ పై దృష్టి సారించి ప్రభుత్వం సంస్కరణలను అమలు చేసిందని ప్రధాన మంత్రి అన్నారు. కేంద్రం మరియు రాష్ట్రంలో అనేక పన్నుల వలయాల స్థానంలో ఇప్పుడు జీఎస్టీ అమలు జరుగుతున్నదని వివరించారు. ఈ సరళీకరణ ఫలితం ఇప్పుడు దేశంలో స్పష్టంగా కనిపిస్తున్నదని శ్రీ మోదీ అన్నారు. ఇప్పుడు జీఎస్టీ వసూళ్లు ప్రతినెలా లక్ష కోట్ల రూపాయలు దాటడం సాధారణమైపోయిందని అన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లకు కొత్త సౌలభ్యాన్ని తీసుకువచ్చిన జిఇఎమ్ పోర్టల్ ప్రభుత్వానికి విక్రయించడం చాలా సులభతరం చేసిందని ఆయన అన్నారు. పోర్టల్ ద్వారా జరిగిన కొనుగోళ్ల మొత్తం 1 లక్ష కోట్లు దాటిందని ప్రధాని తెలియజేశారు. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు రూపొందిన పోర్టల్‌ను ప్రధానమంత్రి ప్రస్తావించారు. పెట్టుబడి అవకాశాలకు సంబంధించిన సమాచారం కోసం రూపొందించిన ఇన్వెస్ట్ ఇండియా పోర్టల్, వ్యాపార లాంఛనాల కోసం రూపొందించిన సింగిల్ విండో క్లియరెన్స్ పోర్టల్ వివరాలను వివరించిన ప్రధానమంత్రి 'ఈ సిరీస్‌లో జన్ సమర్థ్ పోర్టల్ దేశ యువత అంకుర సంస్థలకు సహకరిస్తుంది' అని ప్రధానమంత్రి అన్నారు.
"సంస్కరణల బలం, సులభతర, సరళీకృత విధానాలతో ముందుకు సాగినప్పుడు కొత్త లక్ష్యాలను సాధించవచ్చు. భారతదేశం కలిసి పనిచేస్తే ప్రపంచానికి భారతదేశం మార్గం చూపించగలదు అన్న అంశాన్ని మనం గత 8 సంవత్సరాల కాలంలో నిరూపించాము. ప్రపంచం ఇప్పుడు భారతదేశాన్ని పెద్ద మార్కెట్ గా మాత్రమే కాకుండా సామర్థ్యం కలిగి సమూల మార్పులకు అవసరమైన వినూత్న నిర్మాణాత్మక పరిస్థితులు కలిగిన దేశంగా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం భారతదేశం కలిగి ఉందని అనేక ప్రపంచ దేశాలు భావిస్తున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గత ఎనిమిదేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు సామాన్య ప్రజల ఆలోచన దృక్పధంలో తెచ్చిన మార్పు వల్ల ఇది సాధ్యమైందని అన్నారు. యుపిఐ అంశాన్ని ప్రస్తావించిన " అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వం ప్రభుత్వం ప్రోత్సహించింది. సుపరిపాలన కోసం అమలు చేసిన సాంకేతిక అంశాలను ప్రజలు గౌరవించి ఆమోదించి పాటించారు" అని అన్నారు.
ఐకానిక్ వారోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వాత్ర్రం రోజులపాటు వారోత్సవాలు సాగుతాయని తెలిపారు. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు దేశానికి అందించిన సేవలను ఈ వారోత్సవాల్లో గుర్తు చేయడం జరుగుతుందని అన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా 1947 నుంచి నేటి వరకు భారతదేశం ఆర్థిక రంగంలో సాధించిన ప్రగతి గుర్తు చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
" ప్రజలతో మమేకం కావడం ద్వారా ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు గత 75 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాధించిన ప్రగతిపై ప్రజలను చైతన్యవంతులను చేయడం జరుగుతుంది. అందరికీ ఆర్థిక సేవలు అందించేందుకు అమలు చేస్తున్న చర్యలపై ఒక వీడియోను ( రూపాయ కా రోచక్ సఫర్ ) పెఱ్ఱుతో నిర్మించడం జరిగింది. ప్రభుత్వం అమలు చేసిన విధానం వల్ల సామాన్య ప్రజలకు రుణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి." అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
" సామాన్య ప్రజలకు ప్రయోజనం కలిగించే అనేక కార్యక్రమాలు గత ఎనిమిది సంవత్సరాలుగా అమలు జరుగుతున్నాయి. వీటిని ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సామాన్య మానవునికి సేవ చేయాలన్న ప్రధానమంత్రి అభిమతానికి అనుగుణంగా జన్ సమర్థ్ రూపుదిద్దుకుంది" అని శ్రీమతి సీతారామన్ వివరించారు.
ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని అమలు చేసిన కార్యక్రమాలు ఫలితాలు అందించాయని ఆర్థిక మంత్రి తెలిపారు.
ఆహార భద్రత, అసాధారణ పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన నిధులు సామాన్య మానవునికి అందేలా చేశామని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ పరిస్థితిని ఎదుర్కొన్న అంశాన్ని మంత్రి గుర్తు చేశారు.
గత 8 సంవత్సరాల కాలంలో ఆర్థిక విధానాలు రూపొందించడంలో మంత్రిత్వ శాఖను ప్రోత్సహించి, మార్గనిర్దేశం చేసినందుకు ప్రధానమంత్రికి ఆర్థిక కార్యదర్శి డాక్టర్ టివి సోమనాథన్ ధన్యవాదాలు తెలిపారు. ఐకానిక్ వారోత్సవాల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బలాలు మరియు విజయాలను వివరించడానికి, ప్రజల నుంచి సూచనలు సలహాలు తీసుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 2047 నాటి భారతదేశానికి కొత్త ఆలోచనల ద్వారా సుపరిపాలన అందించాలన్న కలను సాకారం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.
జన్ సమర్థ్ పోర్టల్
13 ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తు సమర్పణ, 125కి పైగా ఎంఎల్ఐ లను (అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల తో సహా) ఎంచుకోవడానికి సింగిల్ విండో సౌకర్యాన్ని “జన్ సమర్థ్” అందిస్తుంది. CBDT, GST, UDYAM, NeSL, UIDAI, CIBIL మొదలైన వాటిని త్వరితగతిన పరిశీలించడం ద్వారా తక్కువ సమయంలో రుణాలు మంజూరు అయ్యేలా “జన్ సమర్థ్” సహకరిస్తుంది. వ్యవసాయం, జీవనోపాధి మరియు విద్య లాంటి 13 ప్రభుత్వ పథకాల రుణ సహాయం పొందే అంశాన్ని “జన్ సమర్థ్” సులభతరం చేస్తుంది. ఇప్పటికే 13 రంగాలు జన్ సమర్థ్ పోర్టల్‌లో ఉన్నాయి. త్వరలో మరిన్ని రంగాలను చేర్చడం జరుగుతుంది. “జన్ సమర్థ్” పోర్టల్ అర్హతను పరిశీలించి, సూత్రప్రాయంగా అనుమతి మంజూరు చేసి ఎంచుకున్న బ్యాంకుకు దరఖాస్తును పంపుతుంది. ప్రతి దశలో లబ్ధిదారులను అప్‌డేట్ చేస్తుంది. బ్యాంకు శాఖలకు అనేకసార్లు సందర్శించాల్సిన అవసరం ఉండదు.
రూపాయ కా రోచక్ సఫర్:
జన్ సమర్థ్ పోర్టల్:
ఆర్థిక , కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిజిటల్ ప్రదర్శన:
***
(Release ID: 1831709)
Visitor Counter : 256