సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న - కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధికి దారి తీస్తుందని ప్రధానమంత్రి విశ్వసించారు : శ్రీ అమిత్ షా
ప్రతి రాష్ట్రానికి ఒక సంస్కృతి, ఒక భాష, ఒక ప్రత్యేకమైన వంటకం ఉంటాయి; ఇన్ని తేడాలు ఉన్నప్పటికీ భారతదేశ ఆత్మ ఒకటే ఉంది; ఆ ఆత్మ దేశాన్ని ఐక్యంగా ఉంచుతోంది : శ్రీ అమిత్ షా
తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను భారత ప్రభుత్వం అందిస్తోంది : శ్రీ జి.కె. రెడ్డి
Posted On:
02 JUN 2022 10:28PM by PIB Hyderabad
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ రోజు న్యూఢిల్లీ లోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో - కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి; విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి; కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ కూడా పాల్గొన్నారు.
తెలంగాణా దినోత్సవ వేడుకలను "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" లో చేర్చి దాని సంస్కృతిని యావత్ దేశానికి చాటిచెప్పినందుకు శ్రీ జి. కిషన్ రెడ్డి ని ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా అభినందించారు. ప్రతి రాష్ట్రానికి ఒక సంస్కృతి, ఒక భాష, ఒక ప్రత్యేకమైన వంటకం ఉంటాయనీ, ఇన్ని తేడాలు ఉన్నప్పటికీ భారతదేశానికి ఒక ఆత్మ ఉందనీ, ఆ ఆత్మ భారత దేశాన్ని ఐక్యంగా ఉంచుతోందనీ ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి 2014-15 నుంచి 2021-22 మధ్య కేంద్ర ప్రభుత్వం 2,52,202 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు, హోంమంత్రి వెల్లడించారు. రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధికి దారితీస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృఢంగా విశ్వసిస్తున్నారని, శ్రీ అమిత్ షా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్ర ఒక పోరాటంతో కూడుకున్నదని కేంద్ర మంత్రి అన్నారు.
మంత్రి ప్రసంగం పై పూర్తి పత్రికా ప్రకటన కోసం ఇక్కడ నొక్కండి
తెలంగాణ రాష్ట్రానికి భారత ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని, తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోళ్ళే ఇందుకు నిదర్శనమని కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2014-2015 లో తెలంగాణ రైతులకు అందించిన ఎం.ఎస్.పి. విలువ 3,400 కోట్ల రూపాయలుగా ఉండగా, 8 సంవత్సరాల తర్వాత ఈ రోజు, తెలంగాణ వరి రైతులకు బదిలీ చేసిన ఎం.ఎస్.పి. విలువ 26,600 కోట్ల రూపాయలు అంటే దాదాపు 8 రెట్లు పెరిగిందని కూడా ఆయన వివరించారు. అదేవిధంగా, తెలంగాణ రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, కేంద్ర మంత్రి తెలియజేశారు.
భారత ప్రభుత్వం 'తెలంగాణ దినోత్సవం' లేదా 'తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం' ను సముచిత రీతిలో జరుపుకోవడం ఇదే మొదటిసారి.
ఈ సంవత్సరం తన ఎనిమిదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశపు అత్యంత చిన్న వయసులో ఉన్న తెలంగాణా రాష్ట్ర సంస్కృతి, వారసత్వం, నిర్మాణ వైభవం తో పాటు మరుగున పడిన వీరుల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకులు గీతాలు ఆలపించారు. తెలంగాణకు చెందిన జానపద నృత్యకళాకారుల తో పాటు ఢిల్లీ లోని కథక్ కేంద్రానికి చెందిన కళాకారులు తెలంగాణా రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించారు.
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్, 2వ తేదీన అధికారికంగా ఏర్పడింది. ఆ రోజు ను 'తెలంగాణ దినోత్సవం' లేదా 'తెలంగాణ అవతరణ దినోత్సవం' గా జరుపుకుంటారు. ఈ ఏడాది స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, భారత దేశ అద్భుత చరిత్ర, దాని ప్రజలు, సంస్కృతి, విజయాలను భారత ప్రభుత్వం స్మరించుకుంటూ, ఉత్సవాలు జరుపుకుంటోంది. 2021 మార్చి, 12వ తేదీన ప్రారంభమైన "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" వేడుకలు, మన 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవానికి 75 వారాల కౌంట్-డౌన్ ను ప్రారంభించాయి. ఈ వేడుకలు 2023 ఆగస్టు, 15వ తేదీన ముగుస్తాయి.
***
*****
(Release ID: 1830678)
Visitor Counter : 190