ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సేవా, సుశాసన్, గరీబ్ కల్యాణ్! -ఎమిదేళ్లలో ప్రభుత్వం సాధించిన లక్ష్యాలు-



ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో
ఈ మూడు లక్ష్యాలపైనే దృష్టి...

పేదలసేవ, నిమ్నవర్గాలరక్షణ కోసం
అభివృద్ధి పథకాలు మొదలు..
రైతు సంక్షేమం, ప్రజల సులభతర జీవనం,
మౌలిక-ఆరోగ్య రక్షణ సదుపాయాలు,
జాతీయ భద్రత మెరుగుదలకు
లభించిన గణనీయ ప్రాధాన్యం..
యువత, సాంకేతిక పరిజ్ఞాన సారథ్యంలో
అభివృద్ధి ప్రక్రియకు,
సులభతర వాణిజ్య నిర్వహణ మెరుగుదలకు
దక్కిన ప్రోత్సాహం..


ఎమిదేళ్ల ప్రభుత్వ చారిత్రిక విజయాలను గుర్తుచేస్తూ,
-సబ్‌కా వికాస్ మహా క్విజ్- కార్యక్రమం ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 31 MAY 2022 3:38PM by PIB Hyderabad

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో ప్రజా ప్రయోజనాలతో కూడిన ప్రభుత్వ పాలనా ప్రక్రియలో గణనీయమైన పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. గత ఎనిమిదేళ్ల కాలంలో ప్రధానమంత్రి పిలుపునిచ్చిన సంస్కరణ, పనితీరు, పరివర్తన నినాదం ప్రాతిపదికగా ప్రభుత్వ పాలనా ప్రక్రియ కొనసాగింది. వివిధ రగాల్లో అనేక చారిత్రాత్మక విధానాలు, పథకాలు, కార్యక్రమాలు అమలులోకి వచ్చాయి. చివరి లబ్ధిదారుడికి కూడా ప్రయోజనాలు అందించడం, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు చేరుకోవడం వంటి లక్ష్యాలతో ఈ విధానాలను, కార్యక్రమాలను చేపట్టారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం పథకాల, ఆరోగ్య రక్షణ సదుపాయాల స్థాయిని పెంచడం, రైతుల సంక్షేమం సక్రమంగా జరిగేలా చూడటం, నిమ్నవర్గాలకు రక్షణ కల్పించడం తదితర అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తూ కేంద్రప్రభుత్వం ఈ విధానాలను అమలు జరిపింది. దీనికి తోడు, యువజన సారథ్యంతో, సాంకేతిక పరిజ్ఞాన సారథ్యంలో కూడా భారతదేశం ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని అభివృద్ధిని చవిచూసింది. దేశంలో సులభతర వాణిజ్యాన్ని విస్తరింపజేసే లక్ష్యంతో వివిధ రకాల సంస్కర

ణలు కూడా అమలోకి వచ్చాయి. జాతీయ భద్రతను ఇనుమడింపజేయడం, దేశంలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేశారు. మహిళా సానుకూల విధానాలు కూడా దేశాభివృద్ధిలో ప్రధాన పాత్రపోషించాయి. కీలకమైన రక్షణ రంగంలో కూడా మహిళల భాగస్వామ్యానికి ప్రోత్సాహం లభించింది.

 

  తొలిరోజు నుంచి పేదలకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలు - నిమ్నవర్గాల ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, వారి అభ్యున్నతి కోసం సబ్‌కా సాత్, సబ్‌కా, వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అంటూ,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు పలు ప్రభుత్వ విధానాలకు ప్రాతిపదికగా మారింది. పి.ఎం ఉజ్వల యోజన, పి.ఎం. స్వనిధి పథకం, జలజీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. పేదలకు మౌలిక సదాపాయాలను అందించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయి.  పి.ఎం.జన్‌ ధన్‌ యోజన పథకం కింద 45కోట్లమంది ప్రజలు బ్యాంకింగ్ సేవల రంగం పరిధిలోకి వచ్చారు. దీనితో రూ. 22.6లక్షల కోట్ల మేర సొమ్ము ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి.) ద్వారా లబ్ధిదారులైన ప్రజల ఖాతాల్లోకి చేరింది.

  అదనంగా, కోవిడ్ వ్యాప్తి సమస్యతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పి.ఎం. గరీబ్ కల్యాణ్ అన్న యోజన వంటి ప్రభుత్వ పథకాల ద్వారా దేశంలోని అట్టడుగు వర్గాలకు చెందిన 80కోట్ల మందిపైగా ప్రజలకు రేషన్ సరకుల పంపిణీ జరిగింది.  వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో పి.ఎం. కిసాన్ వంటి పథకాలు కీలకపాత్ర పోషించాయి. దేశవ్యాప్తంగా 11కోట్ల మంది రైతుల్లో ఒక్కొక్కరికి ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రు. 6,000 అందించారు. పి.ఎం. ఫసల్ బీమా యోజన కింద బీమా పరిహారం కింద రూ. 1.2లక్షల కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. వ్యవసాయ మార్కెట్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు 167 కిసాన్ రైల్ రూట్లను ఏర్పాటు చేశారు.

 అందరికీ మెరుగైన ఆరోగ్య రక్షణ - కోవిడ్-19 వ్యాప్తి సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా ఇదివరకు ఎన్నడూ కనివినీ ఎరుగని విపత్కర పరిస్థితి ఏర్పడింది. దీనితో వైద్య సదుపాయాలపై తీవ్రమైన ఒత్తిడి, భారం పెరిగినప్పటికీ, జాతీయ విపత్తు అయిన ఈ మహమ్మారి సంక్షోభాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. మహమ్మారి వ్యాప్తి సమయంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య రక్షణ సదుపాయాలను పెద్దఎత్తున సమాయత్తం చేశారు. పలు ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. దేశంలో వ్యక్తిగత రక్షణ పరికరాల (పి.పి.ఇ. సూట్ల) తయారీ సామర్థ్యాన్ని సున్నా స్థాయినుంచి  ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారు స్థాయికి మెరుగురపరిచారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల పంపిణీ కార్యక్రమానికి భారతదేశమే వేదికగా నిలిచింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాక్సీన్ల పంపిణీ కోసం డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రపంచంలోనే తొలిసారిగా వినియోగించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిగా డిజిటైజేషన్ సదుపాయంతో అమలు జరిపారు.

  ఆర్థిక ప్రగతిలో ఆరోగ్య రక్షణకు కీలక పాత్ర ఉన్నట్టుగా పరిగణించిన ప్రభుత్వం, ఆయుష్మాన్ భారత్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం అమలుతో దేశంలోని 3.26కోట్ల మంది పౌరులు వైద్య సదుపాయాలను అందుకున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో మందులను అందించేందుకు దేశవ్యాప్తంగా 8,700 జన ఔషధీకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా ప్రజల తమ మందుల ఖర్చులో 50నుంచి 90శాతం వరకూ ఆదా చేయగలిగారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య రక్షణ సదుపాయాల బట్వాడాను మరింత విస్తరించాల్సిన ఆవశ్యకతను గుర్తిసూ, ఆరు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలను (ఎయిమ్స్‌ను) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలను 55శాతం పెంచింది.

   సులభతర జీవనం కోసం మెరుగైన మౌలిక సదుపాయాలు సులభ జీవన సదుపాయాల మెరుగుదలకోసం గత ఎమిదేళ్లలో ప్రభుత్వం ఎంతో అంకితభావంతో పనిచేసింది. మారు మూల ప్రాంతాలను అనుసంధానం చేయడమే లక్ష్యంగా, చిట్టచివరి ప్రాంతానికి ప్రయోజనం అందేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధికోసం ఎన్నో చర్యలు తీసుకున్నారు. మారు మూల ప్రాంతాల్లో కూడా ఇదివరకెన్నడూ లేని రీతిలో అభివృద్ధి చోటుచేసుకుంది. అటల్ సొరంగ మార్గం, బోగిబీల్ వంతెనతో పాటుగా, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో విమానాశ్రయాల నిర్మాణం వంటివి ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

  దీనికి తోడుగా, వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) వంటి చారిత్రాత్మక పన్ను సంస్కరణలు దేశంలో చేసుకున్నాయి. దీనితో పన్ను చెల్లింపుదార్లపై భారం తగ్గి, వారు తమ నెలవారీ ఖర్చుల్లో దాదాపు 4శాతం వరకూ ఆదా చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద దేశంలో డిజిటైజేషన్ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. పన్నుల దాఖలు, బీమా క్లెయిములు, ప్రభుత్వానికి సంబంధించిన కాగితాల పనులను మరింత క్రమబద్ధం చేయడం, సరళీకృతం చేయడం జరిగాయి. దీనితో దేశంలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

సులభతర వాణిజ్య నిర్వహణ ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం మందగమనంలో సాగుతున్నపుడు భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ.లు) పెరిగాయి. పెట్టుబడిదారులకు, వాణిజ్యానికి సానుకూలమైన విధానాలు అమలులోకి వచ్చాయి. 2021-22వ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 83 బిలియన్ల అమెరికన్ డాలర్ల మేర ఎఫ్.డి.ఐ.లు దేశానికి సమకూరడానికి ఈ విధానాలే దోహదం చేశాయి.  ఉత్పాదనతో ముడివడిన ప్రోత్సాహక పథకాల అమలు, తగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రపంచంలోనే తక్కువ స్థాయిలో కార్పొరేట్ పన్నుల అమలు, పెట్టుబడులను సాధనకు జాతీయ స్థాయిలో సింగిల్ విండో పద్ధతి తదితర చర్యలతో దేశంలో ఎఫ్.డి.ఐ. సంఖ్య గణనీయంగా పెరిగింది.

   ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా రూపొందిన భారతదేశంలో యూనికార్న్ స్థాయిలో వంద భారీ స్టార్టప్ కంపెనీలు, 70,000కుపైగా ఇతర స్టార్టప్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. దీనికి తోడుగా, దేశంలో విద్యా సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రతి వారం ఒక విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఒక ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎం. అమలులోకి వచ్చాయి. దేశంలోని యువతకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది.

  భారతదేశం ఇపుడు అగ్రరాజ్యం హోదాను అందుకునే దిశగా ముందుకు సాగుతోంది. భారతదేశ వాణికి ప్రాధాన్యం లభిస్తోంది. సమప్రాధాన్యం కలిగిన భాగస్వామిగా గుర్తిస్తున్నారు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా, భారతదేశపు శక్తి సామర్థ్యాలను మనం ఇపుడు పూర్తిగా వెలికి తీస్తున్నాం. ప్రజల సారథ్యంలో సాగే ప్రభుత్వ పాలనా ప్రక్రియతో అభివృద్ధి పథంలో దేశం పురోగమిస్తోంది.

     ఎమిమిదేళ్లలో  ప్రభుత్వం చారిత్రాత్మక విజయాలను గుర్తు చేసుకునేందుకు పౌరుల భాగస్వామ్యానికి వీలు కలిగించే క్విజ్ కార్యక్రమాన్ని మైగవ్ (MyGov) పోర్టల్ ప్రారంభించింది. దేశంలో చోటుచేసుకునే  అభివృద్ధిని అధ్యయనం చేయడానికి  వీలుగా సబ్‌కా వికాస్‌ మహా క్విజ్ పేరిట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  క్విజ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు https://www.mygov.in/ లింకును సందర్శించండి.

****


(రిలీజ్ ఐడి: 1830007) సందర్శకుల సూచీ సంఖ్య : : 159
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri