హోం మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల విపత్తు నిర్వహణ శాఖల సహాయ కమిషనర్లు మరియు కార్యదర్శుల వార్షిక సదస్సు ప్రారంభం
నైరుతి రుతుపవనాల రాకకు ముందు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సూచించిన కేంద్ర హోం కార్యదర్శి
విపత్తులను నివారించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించిన విధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి... కేంద్ర హోం కార్యదర్శి
Posted On:
18 MAY 2022 6:22PM by PIB Hyderabad
రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల విపత్తు నిర్వహణ శాఖల రిలీఫ్ కమిషనర్లు మరియు కార్యదర్శుల వార్షిక సదస్సు ను కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. రాబోయే నైరుతి రుతుపవనాల కాలంలో సంభవించే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంసిద్ధతను సమీక్షించడానికి ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తున్నారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈ కాన్ఫరెన్స్ భౌతిక విధానంలో జరుగుతోంది.
సదస్సును కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంశాఖ కార్యదర్శి వరదలు, తుఫానులు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అన్నారు. ఏడాది పొడవునా ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను 24x7 సౌకర్యాలను అభివృద్ధి చేసి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రతిస్పందన ప్రణాళిక సిద్ధం చేసి, సామర్థ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. విపత్తుల వల్ల ప్రస్తుత తరాలకు మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా కలిగే నష్టాలు నివారించడానికి దీర్ఘకాలికంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేస్తున్న విపత్తు నిర్వహణ వ్యవస్థ చర్యల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలకు కలుగుతున్న నష్టం గణనీయంగా తగ్గిందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. 2014 తర్వాత విపత్తు నిర్వహణ విధానం లో పెద్ద మార్పు వచ్చిందని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతకుముందు విపత్తు నిర్వహణ విధానం కేవలం సహాయ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైందని అన్నారు. అయితే ఇప్పుడు ప్రజల ప్రాణాలను రక్షించే అంశానికి విపత్తు నిర్వహణ విధానం ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. వేడిగాలులు, పిడుగులు వంటి ఘటనలు జరిగినప్పుడు వీలైనంత వరకు ప్రాణ నష్టం తగ్గించాలని కేంద్ర హోంమంత్రి సూచించారని అన్నారు. నష్టాలను మరింత తగ్గించడానికి సరైన చర్యలు తీసుకోవడం, వనరులను సకాలంలో సమకూర్చుకునే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రాణనష్టాన్ని దాదాపు సున్నా కి తగ్గించే లక్ష్యంతో ప్రమాద స్థాయిని తగ్గించడానికి, తక్షణ ఉపశమనానికి ప్రయత్నాలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
విపత్తు సమయంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు మొదటగా స్పందిస్తాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పట్టణ స్థానిక సంస్థలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు, అగ్నిమాపక సేవ మరియు పౌర రక్షణ సేవల సామర్థ్యాన్ని పెంచాలని ఆయన రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో నగర, జిల్లా స్థాయిలలో సామర్థ్యాలను పెంపొందించే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
ఇటీవలి కాలంలో వరదలతో పాటు తుఫానులు , అడవుల్లో మంటలు, వేడి గాలుల పరిస్థితులు మరియు పిడుగుపాట్లు ఎక్కువగా వస్తున్నాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. వీటిని నివారించి ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థ, కీలక సంస్థల మధ్య సమన్వయాన్ని సమన్వయాన్ని సాధించాలని ఆయన అన్నారు. స్థానిక, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చునని అన్నారు.
వివిధ విపత్తులను ఎదుర్కొనేందుకు రూపొందించి అమలు చేస్తున్న వివిధ చర్యలను వివిధ రాష్ట్రాలు సదస్సులో వివరిస్తాయి. ఉత్తమ నిర్వహణ అభ్యాసాలను పంచుకుంటాయి. 27 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ , నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గాలు, కేంద్ర సాయుధ దళాలు , భారత వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) మరియు సాయుధ దళాలతో పాటు ఇతర శాస్త్రీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
(Release ID: 1826546)
Visitor Counter : 238