పర్యటక మంత్రిత్వ శాఖ

మొదటి ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఇంటర్నేషనల్ క్రూయిజ్ కాన్ఫరెన్స్ 2022లో భాగంగా పర్యాటక సంబంధిత అంశాలపై వివిధ చర్చల్లో పాల్గొన్న శ్రీ జి కిషన్ రెడ్డి


భారతదేశ సుదీర్ఘ తీరం వాణిజ్య అభివృద్ధికి, ఎగుమతులను పెంచడానికి మాత్రమే కాకుండా పర్యాటక రంగ అభివృద్ధిలో కూడా కీలకంగా ఉంటుంది : శ్రీ జి కిషన్ రెడ్డి

విశ్రాంతి, పర్యాటక రంగ అభివృద్ధిలో క్రూయిజ్ పర్యాటక రంగం అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తోంది : కేంద్ర పర్యాటక మంత్రి

Posted On: 15 MAY 2022 8:33PM by PIB Hyderabad

మొదటి ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఇంటర్నేషనల్ క్రూయిజ్ సదస్సు  2022 ముంబయిలో 2022 మే 14,15 తేదీల్లో జరిగింది. సదస్సులో కేంద్ర పర్యాటక, సంస్కృతి మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సదస్సులో పర్యాటక రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై శ్రీ కిషన్ రెడ్డి ప్రసంగించారు. దేశంలో  క్రూయిజ్ పర్యాటక రంగం అభివృద్ధికి  గల అవకాశాలు, సాధించిన విజయాలను శ్రీ కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. 

“భారతదేశం  7,500 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం కలిగి ఉంది. పొడవైన తీర ప్రాంతం కలిగి ఉన్న భారతదేశం  సముద్ర రంగంలో అగ్ర స్థానం సాధించింది. దేశ సముద్రయాన చరిత్రను పరిశీలిస్తే  నాగరికత మరియు సంస్కృతి ఆసియా అంతటా వ్యాపించి తమ ప్రభావం చూపాయని తెలుస్తుంది. అయితే,  భారతదేశం కలిగి ఉన్న  పొడవైన తీరం కేవలం వాణిజ్య,ఎగుమతుల రంగాలను మాత్రమే కాకుండా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా అపారమైన అవకాశాలను అందిస్తుంది" అని శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.“పురాతన కాలం నుంచి నదుల దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది.  హిందుస్థాన్ అనే పేరు సింధు నది నుంచి వచ్చింది.  నదులను  దేవతలుగా గుర్తించి పూజించే దేశం భారతదేశం" అని ఆయన అన్నారు. 

రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో దేశంలో క్రూయిజ్ పర్యాటక రంగం అభివృద్ధికి  గల అవకాశాలను చర్చించారు.  క్రూయిజ్ పర్యాటకులను ఆకర్షించి,  క్రూయిజ్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నూతన ప్రాంతాలను గుర్తించి, లైట్‌హౌస్‌ల వంటి ప్రాంతాలను అభివృద్ధి చేసి, అన్ని ప్రాంతాలకు ప్రయాణ సౌకర్యాలను కల్పించేందుకు తీసుకోవలసిన చర్యలను  సదస్సులో చర్చించారు. క్రూయిజ్ పర్యాటక రంగం, నది పర్యాటక రంగం  అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శ్రీ కిషన్ రెడ్డి వివరించారు. " దేశంలో క్రూయిజ్, నది పర్యాటక రంగాలను అభివృద్ధి చేసేందుకు 2014 నుంచి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.  విశ్రాంతి, పర్యాటక రంగ అభివృద్ధి లో  క్రూయిజ్ పర్యాటక రంగం  అత్యంత  వేగంగా అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన రేవులు, క్రూయిజ్ నౌకలకు అవసరమైన  ప్రత్యేక టెర్మినల్స్ అభివృద్ధి లాంటి పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేందుకు పర్యాటక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రత్యేక కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది" అని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. 

" క్రూయిజ్ ప్రయాణికులు, నౌకల కోసం ప్రత్యేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికోసం పర్యాటక మంత్రిత్వ శాఖ, నౌకాయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక సంయుక్త ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ను ఏర్పాటు చేసాము. దాదాపు ఒక లక్ష మంది పర్యాటకుల అవసరాలు తీర్చే సామర్థ్యం గల సాగరిక  అంతర్జాతీయ  క్రూయిజ్ టెర్మినల్ ను ఇటీవల కోచిలో ప్రారంభించాం. అనేక తీర ప్రాంతాలలో క్రూయిజ్ టెర్మినళ్లు , లైట్‌హౌస్‌లు మరియు ఇతర పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నాము. 2023 నాటికి ఎంపిక చేసిన ఓడరేవులలో దేశీయ మరియు అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినళ్లు ఏర్పాటయ్యే విధంగా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాము. క్రూయిజ్ కోసం అనేక మంది  భారతీయులు  విదేశీ గమ్యస్థానాలను సందర్శిస్తున్నారు దేశంలో ఈ సౌకర్యాలను కల్పించేందుకు కేంద్రం  ప్రయత్నాలు చేస్తోంది." అని శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

   పర్యాటక సంబంధిత మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం స్వదేశ్ దర్శన్, ప్రసాద్ మరియుకేంద్ర ఆర్థిక సహకారం పేరిట 3 ప్రధాన పథకాలు మరియు కార్యక్రమాలనుపర్యాటక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం అమలు చేస్తున్నది. స్వదేశ్ పథకం తీరప్రాంత నేపథ్యానికి సంబంధించిన కింద ఇప్పటివరకు మంజూరు చేసిన  76 ప్రాజెక్టులలో 10 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్  నికోబార్ దీవులు మరియు తమిళనాడు లో అమలు జరుగుతున్నాయి. ఈ పథకం కింద పర్యాటక మంత్రిత్వ శాఖ దాదాపు 650 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇప్పటివరకు పర్యాటక శాఖ కూడా 'పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ఏజెన్సీలకు సహాయం' పథకం కింద ప్రధాన నౌకాశ్రయాలలో వివిధ రాష్ట్రాల్లో క్రూయిజ్ టెర్మినల్ మరియు సంబంధిత మౌలిక సదుపాయాల అభివృద్ధి  కోసం 228.61 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి.  'పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ఏజెన్సీలకు సహాయం' కింద చేపట్టిన రేవుల అభివృద్ధి, జల మార్గాల వివరాలను సదస్సుకు అధికారులు వివరించారు. 

ఈ సదస్సును నిర్వహించిన ఓడరేవులు, నౌక  జలమార్గాల మంత్రిత్వ శాఖను  కేంద్ర మంత్రి అభినందించారు. ఈ సదస్సును నిర్వహించిన కేంద్ర మంత్రి  శ్రీ సర్బానంద సోనోవాల్పై  శ్రీ కిషన్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ  క్రూయిజ్ కేంద్రంగా అభివృద్ధి సాధిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా జాతీయ పర్యాటక విధాన రూపకల్పన  కోసం కృషి చేస్తున్నామని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు.  క్రూయిస్ పర్యాటక అభివృద్ధికి అవసరమైన విధానాలను జాతీయ పర్యాటక విధానంలో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ద్వారా  75వ స్వాతంత్య్ర సంవత్సరాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో 'కమ్ క్రూయిజ్ ఇన్ ఇండియా' నినాదంతో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. 

 క్రూయిజ్ పరిశ్రమకు చెందిన వ్యాపార నాయకులు మరియు వాటాదారులతో మంత్రి ముఖాముఖి చర్చలు జరిపారు.

క్రూయిజ్ గమ్యస్థానాలు, క్రూయిజ్ మౌలిక సదుపాయాలు,పర్యాటక రంగం,  ఆతిధ్య రంగం, నౌకాయాన రంగాలకు అవసరమైన  నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి, అనుకూలమైన విధాన వాతావరణం తదితర అంశాలపై సదస్సులో చర్చలు జరిగాయి. కోవిడ్ మహమ్మారి ముగిసిన నేపథ్యంలో నెలకొన్న అభివృద్ధి  అవకాశాలపై దృష్టి సారించిన సదస్సు క్రూయిజ్ సర్క్యూట్‌ల అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించింది.  క్రూయిజ్ సెక్టార్‌లో. క్రూయిజ్ పర్యాటక  అభివృద్ధి  కోసం వివిధ  మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం సాధించే అంశాలపై కూడా సదస్సు దృష్టి సారించింది.  అంతర్జాతీయ, దేశీయ/కోస్టల్ మరియు రివర్ క్రూయిజ్ రంగాల్లో  క్రూయిజ్ నిర్వహణ మరియు ఆపరేషన్ కోసం అవసరమైన విధానాల రూపకల్పన తదితర అంశాలపై కూడా చర్చలు జరిగాయి.దేశంలో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు  క్రూయిజ్ టెర్మినల్‌ల అభివృద్ధి  మరియు ఆధునీకరణ దిశగా అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 



(Release ID: 1825673) Visitor Counter : 155


Read this release in: English , Urdu , Hindi