ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పర్యావరణహిత జీవన విధానమే ఉత్తమం: ఉపరాష్ట్రపతి


• పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భారతదేశం ప్రపంచాన్ని ముందుకు నడుపుతోంది

• స్థానిక సంస్థలకు సాధికారత కల్పించినపుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

• పర్యావరణ చట్టాలు కఠినంగా అమలయ్యేందుకు మరిన్ని ప్రత్యేకమైన బెంచ్ లను ఏర్పాటుచేయాలి

• చండీగఢ్‌లో ‘ఎన్విరాన్మెంటల్ డైవర్సిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ జురిస్‌ప్రుడెన్స్’ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

Posted On: 07 MAY 2022 3:44PM by PIB Hyderabad

పర్యావరణహితమైన జీవన విధానమే ఉత్తమని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇలాంటి జీవన విధానాన్ని అవలంబించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవటంతో పాటు ప్రభుత్వాలు కూడా ఇలాంటి విధానాలను కఠినంగా అమలుచేయడం తక్షణావసరమని ఆయన అన్నారు. ఏటా 1.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన భూమండలాన్ని అందించేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు తోడుగా ప్రతి ఒక్కరూ మన చుట్టుపక్కనున్న పర్యావరణం పట్ల బాధ్యతాయుతమైన జీవన విధానంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు.

శనివారం చండీగఢ్‌లో ‘ఎన్విరాన్మెంటల్ డైవర్సిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ జురిస్‌ప్రుడెన్స్’ అంతర్జాతీయ సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజు రోజుకూ అంతరించిపోతున్న జీవ వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకోవడం అత్యంత ఆవశ్యకమన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని భారత్ ముందుడి నడిపిస్తోందన్న ఆయన.. గ్లాస్గోలో ఇటీవల జరిగిన సీవోపీ26 సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఈ దిశగా భారత్ విధించుకున్న లక్ష్యాలను ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. 

భారత సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రకృతిని ఆరాధించడం, కాపాడుకోవడం ముఖ్యమైన ధర్మంగా పేర్కొన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా భారత పార్లమెంటు ఎన్నో చట్టాలను ఆమోదించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఈ చట్టాలను సమర్థవంతంగా, కఠినంగా అమలయ్యే దిశగా భారతదేశ న్యాయవ్యవస్థ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకమైన బెంచ్ లను ఏర్పాటుచేయాల్సిన అవసరాన్నీ ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు. కాలుష్య నిబంధనలను ఉల్లంఘించేవారిని, జీవ వైవిధ్యానికి సమస్యలు సృష్టిస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. అప్పుడే సమాజంలో పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరుగుతోందన్నారు. బాల్యం నుంచే ఈ దిశగా విద్యార్థులను ముందుకు నడిపించేలా పాఠ్యప్రణాళికలోనూ మార్పులు చేయాలన్నారు. 

దీనికితోడు స్థానిక సంస్థలు, కాలుష్య నియంత్రణ బోర్డులకు సాధికారత కల్పించడం ద్వారా ఈ దిశగా భారీ ముందడుగు వేసేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. జల నిర్వహణ విషయంలో గ్రామపంచాయతీలకు అధికారాలు కట్టబెట్టాలన్నారు.  

ఈ కార్యక్రమంలో పంజాబ్ గవర్నర్ శ్రీ బన్వరీలాల్ పురోహిత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవై, బ్రెజిల్ నేషనల్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఆంటోనియో హెర్మన్ బెంజమిన్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ మహ్మద్ రఫీక్, యూఎన్ రెసిడెంట్ కో-ఆర్డినేటర్ ఆఫ్ ఇండియా శ్రీ షోంబి షార్ప్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ స్వతంతర్ కుమార్, చండీగఢ్ విశ్వ విద్యాలయం కులపతి, శ్రీ సత్నామ్ సింగ్ సంధుతోపాటు విదేశీ ప్రతినిధులు, భారతదేశానికి చెందిన వివిధ రంగాల ప్రతినిధులు, పర్యావరణ వేత్తలు పాల్గొన్నారు.

 

***


(Release ID: 1823502) Visitor Counter : 161