వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ మరియు రైతుల సంక్షేమం పై ఏర్పాటైన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం
కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించిన కమిటీ
కేసీసీ పరిధిలో 2.94 కోట్ల మంది రైతులు
3.22 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే రుణాల మంజూరు... శ్రీ తోమర్
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2022 5:17PM by PIB Hyderabad
వ్యవసాయ మరియు రైతుల సంక్షేమం పై ఏర్పాటైన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ 2022 మార్చి 23న సమావేశం అయ్యింది. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత పటిష్టంగా సమర్థంగా అమలు చేసేందుకు అమలు చేయాల్సిన చర్యలను సమావేశంలో చర్చించారు.
సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మిగిలిపోయిన పీఎం కిసాన్ లబ్ధిదారులను కిసాన్ క్రెడిట్ కార్డు పథకం పరిధిలోకి తీసుకొని వస్తామని మంత్రి తెలిపారు. ఎక్కువ మంది రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలన్న లక్ష్యంతో మూడు లక్షల రూపాయల స్వల్పకాలిక రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, తనిఖీ రుసుము, లెడ్జర్, ఫోలియో ఛార్జీలు లాంటి ఛార్జీలను మాఫీ చేశామని మంత్రి వివరించారు. వడ్డీ రాయితీ పథకం ద్వారా ఎక్కువ మంది రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందుతాయని శ్రీ తోమర్ వివరించారు.
కేసీసీ ఫారమ్‌ను సరళీకృతం చేశామని శ్రీ తోమర్ సభ్యులకు తెలిపారు. దరఖాస్తు అందిన 14 రోజుల లోగా కేసీసీ విడుదల చేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ అయ్యాయని అన్నారు. బ్యాంకులు సంబంధిత వర్గాల సంఘటిత కృషితో కేసీసీ పథకం లక్ష్యాల మేరకు అమలు జరుగుతున్నదని శ్రీ తోమర్ తెలిపారు. 2022 మార్చి 4 నాటికి కేసీసీ పరిధిలో 2.94 కోట్ల మంది రైతులు ఉన్నారని , వీరికి 3.22 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే రుణాలు అందాయని శ్రీ తోమర్ వెల్లడించారు.
కేసీసీ పథకం వివరాలను సంయుక్త కార్యదర్శి శ్రీ రితేష్ చౌహాన్ వివరించారు.
పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు సభ్యులు పలు సూచనలు అందించి, కొన్ని సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. సలహాలు సూచనలు అందించిన సభ్యులకు కృతజ్జతలు తెలిపిన మంత్రి సమస్యలను పరిష్కరించి రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీసీ పథకం ప్రయోజనాలను తమ నియోజకవర్గ రైతులకు వివరించి అవగాహన కల్పించాలని సభ్యులకు మంత్రి సూచించారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్:
విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు లాంటి వ్యవసాయ అవసరాల కోసం రైతులకు స్వల్పకాలిక రుణాలు అందించేందుకు 1998లో కిసాన్ క్రెడిట్ కార్డు పథకం రూపుదిద్దుకుంది. పంటల పెంపకం, పశుసంవర్ధక మరియు ఇతర అనుబంధ కార్యకలాపాలను చేపడుతున్న రైతుల స్వల్ప,దీర్ఘకాలిక అవసరాల కోసం కేసీసీ రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఏడాది కాలానికి స్వల్పకాలిక రుణాలు, అయిదు సంవత్సరాల కాలపరిమితితో దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నారు. రుణ కాలపరిమితిని పొడిగించే అధికారాన్ని బ్యాంకులు కలిగి ఉన్నాయి. కేసీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద రైతులకు స్వల్పకాలిక రుణంగా మూడు లక్షల రూపాయలను 7% రాయితీ రేటు తో అందిస్తున్నారు. సత్వర చెల్లింపులు ప్రోత్సాహకం కింద అదనంగా 3% రాయితీ అందిస్తున్నారు. దీనితో సకాలంలో రుణాలు చెల్లిస్తున్న రైతులకు వడ్డీ రేటు 4%గా మాత్రమే ఉంటుంది.
ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి, లోక్‌సభ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్, శ్రీ గుర్జీత్ సింగ్ ఔజ్లా, శ్రీమతి జస్కౌర్ మీనా, శ్రీ మహేంద్ర సింగ్ సోలంకి, శ్రీ ప్రదీప్ కుమార్ చౌదరి, శ్రీమతి. రమాదేవి, శ్రీ రోడ్మల్ నగర్, శ్రీ శ్రీనివాస్ దాదాసాహెబ్ పాటిల్, రాజ్యసభ సభ్యులు శ్రీమతి. గీత అలియాస్ చంద్రప్రభ శ్రీ రామ్ షకల్ పాల్గొన్నారు.
వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్‌తో పాటు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1809409)
సందర్శకుల సూచీ సంఖ్య : : 591