సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సాహిత్యం మన సంస్కృతికి దర్పణం
-సాహిత్యోత్సవ్- ప్రారంభ కార్యక్రమంలో
కేంద్రమంత్రి అర్జున్ రాం మేఘ్వాల్...
సాహిత్య అకాడమీ నిర్వహణలో
ఢిల్లీలో అక్షరోత్సవం మొదలు..
Posted On:
10 MAR 2022 3:33PM by PIB Hyderabad
-సాహిత్యోత్సవ్- పేరిట జాతీయ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అక్షరోత్సవం ఈ రోజు ఢిల్లీలో ప్రారంభమైంది 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా ఈ సంవత్సరపు అక్షరోత్సవాన్ని నిర్వహిస్తున్నారు
సాహిత్య అకాడమీ ఎగ్జిబిషన్.ను కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయమంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ ప్రారంభించడంతో ఈ ఉత్సవం ఘనంగా మొదలైంది. సాహిత్య అకాడమీ గత ఏడాది సాధించిన విజయాలను, నిర్వహించిన కార్యక్రమాలను తెలియజెప్పేలా ఈ ఎగ్జిబిషన్.కు రూపకల్పన చేశారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ మాట్లాడుతూ,..సాహిత్యం మన సంస్కృతిని చూపించే దర్పణం వంటిందని అన్నారు. మనం ఆలోచించడం, రాయడం మొదలు పెట్టినప్పటినుంచి, లేదా మానవ నాగరకత మొదలైనప్పటి నుంచి సాహిత్యం ఒక దర్పణంలా పనిచేస్తూ వస్తోందన్నారు. “భాష అనేది భావ వ్యక్తీకరణకు మాధ్యమం. విభన్న భాషల్లో రచించిన పుస్తకాలను, గ్రంథాలను అకాడమీ ఎగ్జిబిషన్.లో మనం చూడవచ్చు. ఇక, నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో మనం దేహం, మనసు, ఆత్మ, మేధస్సులకు చాలా ప్రాముఖ్యం ఉంది. ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా సాహిత్య అకాడమీ కూడా పరివర్తన చెందాల్సిన అవసరం ఉంది.” అని ఆయన అన్నారు. “మన సాహిత్యంలో తలెత్తే మార్పులను మనం తప్పనిసరిగా అంగీకరించాల్సిందే” అని ఆయన అభిప్రాయపడ్డారు. 21వ శతాబ్దం భారతదేశానికే సొంతం కావాలని, 21వ శతాబ్దం మనదే అవుతుందన్న నమ్మకం కూడా ఉందని కేంద్రమంత్రి మేఘ్వాల్ అన్నారు.
సాహిత్యోత్సవ్ సందర్భంగా “యువ భారత్ ఆవిర్భావం” పేరిట రవీంద్ర భవన్ పచ్చిక బయలులో ఈ రోజు ఉదయం పదిన్నరనుంచి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సాహిత్య అకాడమీ గుర్తింపు పొందిన 24 భారతీయ భాషలకు ప్రాతినిధ్యం వహించే 26మంది రచయితలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రముఖ అస్సామీ రచయత యోషే దోర్జీ తోంగ్చీ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం “భారతీయ భాషల్లో ప్రచురణ ప్రక్రియపై జరిగిన ప్యానల్ చర్చ”లో విభిన్న భాషలకు చెందిన ప్రముఖ ప్రచురణ కర్తలు, రచయితలు పాలుపంచుకున్నారు.
వీటికి తోడుగా మార్చి 11వ తేదీన, రవీంద్ర భవన్ పచ్చిక బయలులో “గిరిజన రచయితల సమావేశం’ ఉదయం పది గంటలనుంచి నిర్వహించనున్నారు. 24 భాషలకు ప్రాతినిధ్యం వహించే పలువురు సాహితీవేత్తలు ఈ సమావేశంలో పాల్గొంటారు. బాల్టి భాషలో ప్రముఖ కవి అయిన అఖోన్ అస్ఖర్ అలీ బష్రాత్ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తారు.
మార్చి11వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరగనున్న మరో కార్యక్రమంలో ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ పురస్కారాలను 24మంది అవార్జు విజేతలకు ప్రదానం చేస్తారు. కోపర్నికస్ మార్గ్.లో ఉన్న కామనీ ఆడిటోరియంలో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ప్రముఖ మరాటీ కవి, విమర్శకుడు డాక్టర్ బాలచంద్ర నేమాడే ముఖ్య అతిథిగా పాల్గొని, అవార్డులను ప్రదానం చేస్తారు.
అకాడమీ అవార్డు అందుకోనున్న 24మందీ ఉదయం పదిగంటలకు రవీంద్ర భవన్ పచ్చి బయలులో ప్రారంభమయ్యే రచయితల సమావేశంలో పాల్గొంటారు. అకాడమీ అవార్డుకు ఎంపికైన రచనలను సృష్టిలో తాము చవిచూసిన అనుభవాలను వారు ఈ సమావేశంలో సదస్యులతో పంచుకుంటారు. “భారతదేశంలో 1947నుంచి నాటక ప్రక్రియ పరిణామాలు” అనే అంశంపై అదే రోజున మధ్యాహ్నం 2.30కి ఒక చర్చాగోష్టి జరుగుతుంది. రంగస్థల ప్రముఖుడు భాను భారతి ప్రారంభించే ఈ చర్చాగోష్టికి సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ కంబార్ అధ్యక్షత వహిస్తారు.
సాహిత్యోత్సవ్ లో భాగంగా మార్చి 13నుంచి 15 వరకూ 3 రోజులపాటు జాతీయ స్థాయి సదస్సు జరుగుతుంది. “భారతీయ స్వాతంత్ర్య ఉద్యమంపై సాహిత్యం ప్రభావం” పేరిట నిర్వహించే సదస్సు అకాడమీ ఆడిటోరియంలో 13న తెదీ ఉదయం పదిన్నరకు మొదలవుతుంది. సదస్సును ప్రముఖ హిందీ రచయిత, సాహిత్య అకాడమీ పరిశోధకుడు డాక్టర్ విశ్వనాథ్ ప్రసాద్ తివారీ ప్రారంభిస్తారు. ప్రముఖ పండితుడు డాక్టర్ హరీష్ త్రివేది ప్రధానోపన్యాసం ఇస్తారు. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన 42మంది సాహితీవేత్తలు, పండితులు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంపై సాహిత్య ప్రభావాన్ని వివరించే వివిధ అంశాలతో వారు తమ అధ్యయన పత్రాలను సమర్పిస్తారు.
ఇక, “1947నుంచి భారతీయ భాషల్లో వచ్చిన కాల్పనిక సాహిత్యం, వైజ్ఞానిక కాల్పనిక రచనలు” అన్న అంశంపై అదే రోజున మధ్యాహ్నం రెండున్నర నుంచి ఒక చర్చాగోష్టి జరుగుతుంది. ప్రముఖ రచయిత దేవేంద్ర మేవాడీ ఈ గోష్టిని ప్రారంభిస్తారు. రవీంద్ర భవన్ పచ్చిక బయలులో జరిగే ఈ కార్యక్రమంలో జగద్గురు రామానందాచార్య స్వామి రామభద్రాచార్యకు సాహిత్య అకాడమీ ఫెలోషిప్పును అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ కంబార్ ప్రదానం చేస్తారు.
ఇక,.. “సమాచార సాధనాలు, పత్రికలు- సాహిత్యం” అనే అంశంపై ఒక ప్యానెల్ చర్చా కార్యక్రమాన్ని మార్చి 14 ఉదయం పదిన్నరకు నిర్వహిస్తారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ వేణుధర్ రెడ్డి ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రముఖ మరాటీ రచయిత విశ్వాస్ పాటిల్ అధ్యక్షత వహిస్తారు. దైనిక్ జాగరణ్ సాహిత్య సంపాదకుడు రాజేంద్ర రావు గౌరవ అతిథిగా పాల్గొంటారు. అదే రోజున మధ్యాహ్నం రెండున్నరకు “ట్రాన్స్ జెండర్ కవుల సమావేశం” మొదలవుతుంది. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రముఖ గుజరాతీ కవి డాక్టర్ వినోద్ జోషీ గౌరవ అతిథిగా హాజరవతారు.
మార్చి 15వ తేదీన ఉదయం 11 గంటలకు “పూర్వోత్తరి: ఈశాన్య, ఉత్తరాది రచయితల సమావేశం” మొదలవుతుంది. ఈ సమావేశాన్ని ప్రముఖ హిందీ కవి డాక్టర్ అరుణ్ కమాల్ లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రముఖ అస్సామీ రచయిత డాక్టర్ ధ్రువ జ్యోతి బోరా గౌరవ అతిథిగా హాజరవుతారు. అదే రోజున, మధ్యాహ్నం రెండున్నరనుంచి “సాహిత్యం-మహిళా సాధికారత” అనే అంశంపై చర్చాగోష్టిని ప్రముఖ ఆంగ్ల రచయిత్రి మమాంగ్ దయ్ ప్రారంభిస్తారు. ప్రముఖ బెగాళీ కవయిత్రి అనితా అగ్నిహోత్రి ప్రధానోపన్యాసం చేస్తారు.
సాహిత్యోత్సవం సందర్భంగా సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శనను ప్రతి రోజూ ఉదయం 10 గంటలనుంచి రాత్రి 7వరకూ నిర్వహిస్తారు.
మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
****
(Release ID: 1804884)
Visitor Counter : 207