సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
రాష్ట్రాల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా పట్టణ ప్రగతికి ప్రాధాన్యం
ఎమినిదేళ్లుగా ఎన్.డి.ఎ. ప్రభుత్వం కృషి:
జమ్ములో కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ప్రకటన..
మేయర్లు, చైర్ పర్సన్లు, మున్సిపల్ కమిషనర్లతో
3రోజుల పునశ్చరణ తరగతులకు శ్రీకారం..
2047కల్లా దేశంలోని సగం జనాభాకు
పట్టణాలే ఆవాసమవుతాయని వ్యాఖ్య..
Posted On:
02 MAR 2022 6:31PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని, గత ఎనిమిదేళ్లలో పట్టణ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి, భారతీయ ప్రభుత్వ పరిపాలనా సంస్థ (ఐ.ఐ.పి.ఎ.) అధ్యక్షుడు డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు చెప్పారు. భూగోళ విజ్ఞానం, ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అనుశక్తి, అంతరిక్ష పరిశోధన వ్యవహారాలను కూడా జితేంద్ర సింగ్ పర్యవేక్షిస్తున్నారు. పట్టణ పరిపాలనా ప్రక్రియపై నిర్వహిస్తున్న 3 రోజుల పునశ్చరణ తరగతుల కార్యక్రమాన్ని ఆయన ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. జమ్ము కాశ్మీర్ పట్టణ స్థానిక పరిపాలనా సంస్థల మేయర్లు/చైర్ పర్సన్లు, మునిసిపల్ కమిషనర్లు/ముఖ్య కార్యనిర్వహణాధికారులకోసం ఈ పునశ్చరణ తరగతులను నిర్వహించారు. ప్రారంభోపన్యాసంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, 25ఏళ్ల దార్శనికతతో కూడిన పట్టణ ప్రణాళిక, పట్టణాభివృద్ధి గురించి తొలిసారిగా ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ ప్రస్తావించిందన్నారు. అప్పటికల్లా దేశంలో 50శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లోనే నివసించే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. 2022-23వ సంవత్సరపు కేంద్ర బడ్జెట్లో పట్టణ రంగానికి ఇదివరకెన్నడూ లేనంత భారీ స్థాయిలో రూ. 76,549.46 కోట్లను కేటాయించినట్టు కేంద్రమంత్రి చెప్పారు. పట్టణ రంగ విధానాలు, ప్రణాళికా రచన, అమలు, సామర్థ్యాల నిర్మాణం, పరిపాలనా ప్రక్రియ వంటి అంశాల్లో సమూలమైన మార్పులకోసం బడ్జెట్లో పలు చర్యలను ప్రతిపాదించారని, ప్రణాళికా కర్తల, ఆర్థికవేత్తల, సంస్థలతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు పలు చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారని చెప్పారు. 2047వ సంవత్సరానికి అంటే, భారతదేశం వందేళ్లు పూర్తి చేసుకునేసరికి దేశంలోని సగం జనాభా పట్టణాల్లోనే ఆవాసం పొందే సూచనలున్నాయని కేంద్రమంత్రి చెప్పారు.
2014వ సంవత్సరంనుంచి కేంద్ర ప్రభుత్వం పలు పట్టణ ప్రత్యేక పథకాలను ప్రారంభించిందని ఆయన అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ (ఎస్.బి.ఎం.), ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పి.ఎం.ఎ.వై.), అటల్ పట్టణ పునరుద్ధరణ, పరివర్తనా పథకం (అమృత్), స్మార్ట్ సిటీల పథకం (ఎస్.సి.ఎం.), జాతీయ పట్టణ జీవనోపాధి పథకం (ఎన్.ఎల్.యు.ఎం.) వంటి కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పట్టణ ప్రాంతాల్లోని మెజారిటీ జనాభా అవసరాలను తీర్చడమే లక్ష్యంగా చేపట్టే ఈ పరివర్తనా పథకాలు సమ్మిళితంగా, సుస్థిరంగా, పర్యావరణహితంగా, ఉత్పాదకత సాధించేలా చూసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని జితేంద్ర సింగ్ చెప్పారు.
భారతదేశంలో సగటు స్థాయిని మించి పట్టణీకరణ సాధించిన రాష్ట్రాల్లో తలసరి ఆదాయం బాగా ఎక్కువగా ఉందని, తక్కువ స్థాయిలో పట్టణీకరణ జరిగిన బీహార్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తదితర రాష్ట్రాలతో పోల్చినపుడు ఈ విషయం అవగతమవవుతోందని కేంద్రమంత్రి అన్నారు. గుజరాత్ నుంచి తమిళనాడు వరకూ కొన్ని రాష్ట్రాలు పట్టణీకరణలో 50శాతం మార్కును (తమిళనాడు) దాటడం గానీ, పట్టణాల్లో మెజారిటీకి చేరువకావడం గానీ జరిగిందన్నారు.
జమ్ము కాశ్మీర్ కు చెందిన మునిసిపల్ పరిపాలనా అధికారులు, అధినేతలకు నిర్వహించే పునశ్చరణ తరగతుల కార్యక్రమాన్ని కేంద్రమంత్రి ప్రస్తావిస్తూ, 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. రానున్న పాతికేళ్లలో పాక్షిక పట్టణీకరణ (25శాతం) స్థాయినుంచి మెజారిటీ పట్టణాలను అభివృద్ధి చేసే స్థాయికి భారతదేశం మార్పు చెందుతున్న తరుణంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. వస్తూత్పత్తి, సేవల రంగాల విస్తృతి,.. పట్టణీకరణతో అనుసంధానమైన నేపథ్యంలో పట్టణ రంగ మార్పులన్నింటినీ ఆర్థిక ప్రగతికి ప్రతీకలుగా చెప్పవచ్చని ఆయన అన్నారు.
దేశంలోని పలు ప్రాంతాలతో పాటుగా, జమ్ము కాశ్మీర్.లో పట్టణీకరణ కూడా పెనుమార్పు చెందబోతున్నదని, 2011లో 27శాతం మేరకు ఉన్న పట్టణ జనాభా రానున్న దశాబ్దాల్లో సగానికి చేరుకోనున్నదని ఆయన చెప్పారు. మన పట్టణ పథకాల్లో పేర్కొన్నట్టుగా సంస్కరణలన్నింటనీ పటిష్టంగా చేపట్టవలసిన నేపథ్యంలో పట్టణీకరణ పయనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే ఆస్కారం ఉందని జితేంద్ర సింగ్ అన్నారు. ప్రాచీన పురపాలక సంఘాల్లో ఒకటిగా, 1930వ సంవత్సరంలో ఏర్పాటైన జమ్ము మునిసిపాలిటీ పట్టణీకరణ ప్రక్రియకు మార్గం చూపాలని, జమ్ము కాశ్మీర్ ఆర్థికాభివృద్ధికి అదే కీలకమవుతుందని ఆయన అన్నారు.
2000వ సంవత్సరంలో ఏర్పాటైన జమ్ము నగర పాలక సంస్థ గత కొన్నేళ్లుగా ఎన్నో ప్రశంసనీయమైన చర్యలు తీసుకోవడం తనకు సంతోషం కలిగిస్తోందన్నారు. ఆన్ లైన్ ద్వారా చెల్లింపుల వ్యవస్థ, అనుమతుల మంజూరీ ప్రక్రియ, అక్రమ నిర్మాణాల నిర్మూలన, బ్యానర్లు, హోర్డింగుల నియంత్రణ, సమర్థవంతంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి చర్యలను జమ్ము నగర పాలక సంస్థ చేపట్టిందన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో అమలులో ఉన్న అనేక ఆవిష్కరణలను, సృజనాత్మక పద్ధతులను, ఉత్తమ విధానాలను జమ్ము నగరంకోసం సానుకూలంగా వినియోగించుకొనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధుల పాత్రే నిర్ణయాత్మకమని ఆయన అన్నారు.
ఎన్నికైన ప్రజా ప్రతినిధులు నిర్వహించాల్సిన బముముఖ పాత్రల గురించి కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పట్టణ పరిపాలనా ప్రక్రియలో అట్టడుగు స్థాయినుంచి అనుసంధానం ఏర్పరచడం, అట్టడుగు స్థాయినుంచి జాతీయ నాయకత్వ స్థాయికి నాయకులు సహజంగా ఎదిగేలా ప్రోత్సహించడం, ప్రజా సంఘాల భాగస్వామ్యం, స్థానిక వనరుల సమీకరణ,.. నగర పాలనా వ్యవస్థకు సమాజానికి అలాగే, రాష్ట్ర నాయకత్వానికి, నగరానికి మధ్య మధ్యంతర అనుసంధానకర్తగా పనిచేయడం వంటి బహుముఖ పాత్రల నిర్వహణను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, రవాణా ఏర్పాట్లు, గృహనిర్మాణం వంటి రంగాలపై మనం ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఉందని సూచించారు.
జలజీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నీటిసరఫరా సదుపాయం కల్పించడంతోపాటుగా, అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ బహిరంగ మలవిసర్జన రహిత స్థాయిని (ఒ.డి.ఎఫ్. స్థాయిని) ఇప్పటికే మనదేశం సాధించిందని కేంద్రమంత్రి అన్నారు. స్మార్ట్ నగరాల పథకం మనకు మౌలిక సదుపాయాలను, పరిపాలనా ప్రక్రియను అందిస్తోందని, పి.ఎం.ఎ.వై. పథకం అందుబాటు యోగ్యమైన గృహవసతిపై దృష్టిని కేంద్రీకరిస్తోందని, పి.ఎం. స్వానిధి పథకం వీధి వ్యాపారులకు అవసరమైన పెట్టుబడిని అందిస్తోందని జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ పథకాలన్నింటినీ జమ్ము నగరంలో కూడా పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతీయ ప్రభుత్వ పరిపాలనా సంస్థ (ఐ.ఐ.పి.ఎ.) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మూడు రోజుల పునశ్చరణ తరగతుల కార్యక్రమం, భారత ప్రభుత్వ పథకాలను గురించి అవగాహన చేసుకునేందుకు, దేశంలోని వివిధ ప్రాంతాల పథకాల అమలుపై అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. జమ్ము నగరం అవసరాలకు తగినట్టుగా వివిధ పథకాల అమలుకోసం ఇది ఉపయోగపడుతుందన్నారు. జమ్ములో చేపట్టబోయే పట్టణ సంస్కరణలు జమ్ము నగరానికే కాక, జమ్ము కాశ్మీర్.లోని ఇతర పట్టణాలకు కూడా ముఖ్యమని ఆయన అన్నారు. పట్టణ, నగర పరిపాలనా ప్రక్రియపై నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల ఈ సదస్సు,.. ఎన్నికైన మన ప్రజాప్రతినిధులు తమ అజెండాను నిర్ణయించుకునేందుకు దోహదపడుతుందని, జమ్మును పరిశుభ్రమైన, హరిత, ఉత్పాదక నగరంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
*****
(Release ID: 1802463)
Visitor Counter : 230